
ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘నా చిన్నతనం నుండి ఆర్. నారాయణమూర్తిగారి సినిమాలు చూస్తున్నాను. ఇప్పటికీ అదే పంథాలో తనదైన స్టైల్‌లో చక్కటి సందేశంతో ప్రతి సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు.
‘‘డబ్బుకోసం ఆలోచించి మూర్తిగారు ఏ రోజూ సినిమాలు తీయలేదు’ అన్నారు వీవీ వినాయక్. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థను నోటు ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తుందో సందేశాత్మకంగా చక్కగా వివరించారు నారాయణమూర్తి’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘ఎర్రసైన్యం’తో పాటు అనేక సిల్వర్ జూబ్లీ సినిమాలను నారాయణమూర్తి చేశారని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాటం చేస్తుంటారు’’’ అన్నారు దర్శకులు బి.గోపాల్. ‘‘చిన్న సందేశాలతో సినిమాలు చేయటానికే నేను భయపడి పోతాను. అలాంటిది ఇన్నేళ్లుగా ఓ కమిట్‌మెంట్‌తో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు తీస్తున్నారు ఆయన.
తాను చెప్పాలనుకున్న విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు శేఖర్ కమ్ముల. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వారసత్వ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. పది శాతం పాలిస్తూ, తొంభై శాతం పరిపాలించబడితే ప్రజాస్వామ్యం కాదు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జ్యోతిబాపూలే, అంబేద్కర్ చూపించిన బాటలో పయనించాలని ఈ సినిమాలో చూపించాను. ప్రజాస్వామ్యం అంటే అంగట్లో అమ్మే సరుకు కాకుండా, దానిని కాపాడుకోవాలి అని చాటి చెప్పే చిత్రమిది’’ అన్నారు. గద్దర్, ధవళ సత్యం, ఎల్బీ శ్రీరాం, గటిక విజయ్ కుమార్, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment