సావిత్రికీ నాకూ పోలికే లేదు!
‘‘మంచి నటన కనబర్చడానికీ, గ్లామరస్‌గా కనిపించడానికీ స్కోప్ ఉన్న పాత్రను ఈ చిత్రంలో చేశాను. ఈ రెండూ కోణాలూ ఉన్న పాత్రలు చేసే అవకాశం అరుదుగా వస్తుంది’’ అని రాశీఖన్నా అంటున్నారు. ఊహలు గుసగుసలాడే, జోరు చిత్రాల్లో కథానాయికగా, ‘మనం’లో అతిథి పాత్రలో కనిపించిన రాశీఖన్నా ప్రస్తుతం గోపీచంద్ సరసన నటించిన ‘జిల్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రం గురించి రాశీఖన్నా మాట్లాడుతూ - ‘‘ఇందులో నా పాత్ర పేరు సావిత్రి. తను చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. దూకుడెక్కువ. కానీ, నేను సావిత్రిలా కాదు. అసలు తనకూ, నాకూ ఒక్క విషయంలో కూడా పోలిక లేదు. నా మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉన్న పాత్ర కావడంతో నటిస్తున్నప్పుడు థ్రిల్‌కి గురయ్యాను. సావిత్రిని అందరూ ఇష్టపడతారు. అందులో మాత్రం సందేహం లేదు.
నా నుంచి రాధాకృష్ణగారు మంచి నటన రాబట్టుకున్నారు. గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా మంచి వ్యక్తి. పెద్ద హీరో కాబట్టి, ముందు కొంచెం తడబాటుగా అనిపించింది. కానీ, ఆయన తీరు చూసిన తర్వాత కూల్ అయిపోయాను. డాన్స్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు’’ అన్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ప్రత్యేక పాట చేస్తున్నారనే వార్త వినిపిస్తోందనే ప్రశ్నకు - ‘‘ఆ చిత్రబృందం నుంచి నన్నెవరూ సంప్రతించలేదు. ఇప్పట్లో నాకు ప్రత్యేక పాటలు చేసే ఉద్దేశం కూడా లేదు. అతిథి పాత్రలు చేయాలనుకుంటున్నాను’’ అని స్పష్టం చేశారు.