‘రచయిత’ మూవీ రివ్యూ | Rachayitha Movie Review | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 17 2018 2:27 PM | Last Updated on Sat, Feb 17 2018 6:04 PM

Rachayitha Movie Review - Sakshi

రచయిత

టైటిల్ : రచయిత
జానర్ : పీరియాడిక్‌ డ్రామా
తారాగణం : విద్యాసాగర్‌ రాజు, సంచితా పదుకొనే, శ్రీధర్‌ వర్మ
సంగీతం : షాన్‌ రెహమాన్‌
దర్శకత్వం : విద్యాసాగర్‌ రాజు
నిర్మాత : కళ్యాణ్ దూళిపాల‍్ల

ప్రయోగాత్మక చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో అదే జానర్‌ లో తెరకెక్కిన మరో ఆసక్తికర చిత్రం రచయిత. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు విద్యాసాగర్‌ రాజు ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించారు. 1954 నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సంచితా పదుకొనే కీలక పాత్రలో నటించారు. పాటల రచయిత చంద్రబోస్‌, సీనియర్‌ నటుడు జగపతి బాబులు సపోర్ట్ చేయటంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఆసక్తికరమైన నేపథ్యంతో తెరకెక్కిన రచయిత ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? ఈ ప్రయోగం ఎంత వరకు ఫలించింది..?

కథ :
ఆదిత్య వర్మ(విద్యాసాగర్‌ రాజు) ప్రముఖ కథా రచయిత. ఎన్నో విజయవంతమైన కథలు రాసిన ఆదిత్య వర్మ తన కొత్త కథను భయం నేపథ్యంలో రాయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం జనజీవనానికి దూరంగా ఓ నిర్మానుష్య ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. అదే సమయంలో 13 ఏళ్ల తన ప్రేమను గెలిపించుకునేందుకు పద్మావతి(సంచిత పదుకొనే) తల్లిదండ్రులను కలుస్తాడు. అప్పటికే పద్మావతికి మనోహర్‌ అనే వ్యక్తితో నిశ్చితార్థం అవుతుంది. కానీ ఓ ప్రమాదంలో మనోహర్ చనిపోవటంతో ఆ విషయాలను ఆదిత్య వర్మకు చెప్పకుండా పద్మావతిని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తారు ఆమె తల్లిదండ్రులు. ఊరు మారితే ఆమె ఆలోచనలు మారుతాయన్న నమ్మకంతో ఆదిత్య వర్మతో పాటు పంపిస్తారు. పద్మావతి తన గతాన్ని మర్చిపోయి ఆదిత్య వర్మకు దగ్గరయ్యే సమయంలోనే ఆదిత్య వర్మ తన కథ మొదలు పెడతాడు. పద్మావతి జీవితంలో జరిగిన సంఘటనలే ఆదిత్య కథగా రాస్తుండటంతో పద్మావతిలో భయం మొదలవుతుంది. ఆదిత్య వర్మ రాసిన కథ ప్రకారం చనిపోయిన మనోహర్ తనకోసం ఆత్మగా మారాడని భయపడుతుంది. నిజంగానే మనోహర్ దెయ్యంగా మారాడా..? అసలు మనోహర్ ఎలా చనిపోయాడు..? చివరకు ఆదిత్య వర్మ, దీపికలు ఒక్కటయ్యారా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
సినిమా అంతా ప్రధానంగా రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కీలకమయిన రచయిత పాత్రలో విద్యాసాగర్‌ రాజు మంచి నటన కనబరిచాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్‌ తో కథను ముందుకు నడిపించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ సంచిత పదుకొనే మంచి నటన కనబరించింది. భయానికి, ప్రేమకు మధ్య నలిగిపోయే అమ్మాయి పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది. 50ల కాలం నాటి అమ్మాయిగా హుందాగా కనిపించి మెప్పించింది. అదే సమయంలో గ్లామర్‌ షోతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీధర్ వర్మ పరవాలేదనిపించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ఆదిత్య వర్మ దగ్గర శిష్యరికం చేసేందుకు వచ్చిన నటుడు మాత్రం తన అతితో కాస్త విసిగిస్తాడు.


విశ్లేషణ :
ఓ రీవేంజ్‌ డ్రామాకు 1954 నాటి నేపథ్యం తీసుకున్న దర్శకుడు కథనాన్ని ఆసక్తికరంగా నడిపించటంలో విజయం సాధించాడు. ఆ కాలం నాటి పరిస్థితులను, దుస్తులు, వాతావరణం చూపించేందుకు చిత్రయూనిట్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. అయితే డిటెయిలింగ్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహిరంచి ఉంటే బాగుండేది. తను చెప్పాలను కున్న విషయాన్ని ప్రేక్షకులకు పోయటిక్‌గా చెప్పాలన్న ఉద్దేశంతో అవసరానికి మించిన డైలాగ్‌ లు రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో పాత్రలు అవసరానికి మించి డైలాగ్‌ లు చెప్తూ ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షిస్తాయి. కొన్ని సందర్భాల్లో నటీనటుల హావభావాలు కూడా 50ల కాలం నాటి సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తాయి. గ్రాఫిక్స్ మాత్రం ఆకట్టుకునేలా లేవు. కారు ప్రయాణంలో వచ్చే సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌ నాసిరకంగా ఉన్నాయి.  షాన్ రెహమాన్‌ అందించిన స్వరాలతో పాటు చంద్రబోస్‌ సాహిత్యం బాగున్నాయి. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు, సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథా, కథనం
పాటలు

మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాల్లో విసిగించే డైలాగ్స్‌
గ్రాఫిక్స్‌

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement