లారెన్స్‌లో... కొత్త కోణం
కొరియోగ్రాఫర్‌గా మొదలై, నటుడిగా, దర్శకుడిగా ఎదిగిన సినీ ప్రముఖుడు రారెన్స్. తాజాగా ఆయన తన బహుముఖ ప్రజ్ఞలోని మరో కోణం కూడా బయటకు తీస్తున్నట్లు చెన్నై ఖబర్. ఆ మధ్య ‘ముని’, ‘గంగ’ లాంటి సినిమాలతో అదరగొట్టిన లారెన్స్ తన తాజా చిత్రంలో ఏకంగా గాయకుడి అవతారమెత్తుతున్నారట! తమిళ చిత్రం ‘మొట్ట శివ... కెట్ట శివ’ (‘గుండుతో కనిపించే శివ... చెడ్డవాడైన శివ’ అని తెలుగులో స్థూలంగా అర్థం)లో ఆయన ‘లోకల్ మాస్...’ అంటూ ఉత్సాహంగా సాగే ఒక పాట పాడినట్లు కోడంబాకమ్ వర్గాల కథనం. గాయని సుచిత్రతో లారెన్స్ గొంతు కలిపారట! ఇదే పాటకు మంచి ఫాస్ట్ వెర్షన్ కూడా ఉందట! ఆ వెర్షన్‌నేమో గాయనీ గాయకులు మాలతి, టిప్పు గానం చేశారట! సంగీత దర్శకుడు అమ్రేశ్ గణేశ్ ఈ రెండు పాటల్నీ వేర్వేరుగా రికార్డ్ చేశారని చెబుతున్నారు.
అన్నట్లు, విషయం ఏమిటంటే - ఈ సినిమా మరేదో కాదు... గత ఏడాది మొదట్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెలుగులో వచ్చి, హిట్టయిన నందమూరి కల్యాణ్‌రామ్ చిత్రం ‘పటాస్’కు అధికారిక తమిళ రీమేక్. సాయి రమణి దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ రీమేక్‌లో లారెన్స్, ఆయన పక్కన నిక్కీ గల్రానీ, మరో ముఖ్యపాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తానికి, దర్శకుడిగా, నటుడిగా విజృంభిస్తున్న లారెన్స్ కొంపదీసి ఇప్పుడు తన సినిమాల్లో పూర్తిస్థాయి సింగర్‌గా కూడా దృష్టి పెడతారా?