వైద్య సాయం కోసం వచ్చిన వారితో లారెన్స్
చెన్నై ,పెరంబూరు: నటుడు లారెన్స్‌ను కలిసి వైద్య సాయం పొందడానికి వచ్చి గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో అవస్థలు పడుతున్న కుటుంబానికి ఊరట లభించింది. నటుడు లారెన్స్ ఆ అభాగ్యులను ఆదరించారు. ఎందరికో ఎన్నో విధాలుగా సాయపడుతూ సాయాజక సేవలు అందిస్తున్న లారెన్స్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని తన కొడుకు వైద్య చికిత్సకు సాయం చేస్తారని వచ్చిన ఒక అభాగ్యురాలికి కాస్త ఆలస్యంగానైనా నటుడు లారెన్స్ ఆదరణ అభించింది. వివరాలు.. రాజపాళయంకు చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుకు గురుసూర్య విచిత్రమైన వ్యాధికి గురయ్యాడు. అతని వైద్యం కోసం తల్లి గృహలక్ష్మీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆవేదన చెందింది. దీంతో ఆమె భర్త కూడా వదిలి వెళ్లిపోయాడు. చదవండి :(లారెన్స్ కోసం వచ్చి భిక్షాటన)
గృహలక్ష్మీకి తోడబుట్టిన తమ్ముడు వెంకటేశన్ అండగా నిలిచాడు. తన పెళ్లిని కూడా త్యాగం చేసి వెంకటేశన్ అక్క కోసం, ఆమె కొడుకు కోసం తన వంతు సాయం చేస్తున్నాడు. కాగా కొడుకు వైద్య సాయం కోసం నటుడు లారెన్స్‌ను కలవమని ఎవరో ఇచ్చిన సలహాతో గృహలక్ష్మీ, తన కొడుకు, తమ్ముడిని తోడుగా తీసుకుని గత నాలుగైదు రోజుల క్రితం చెన్నైకి వచ్చింది. అయితే వారికి నటుడు లారెన్స్ ఇంటి అడ్రస్ తెలియక పోవడంతో ఏం చేయాలో దిక్కు తోచక స్థానిక ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లోనే ప్రయాణికులు చేసిన దానంతో పొట్టపోసుకుంటున్నారు. వీరి గురించి ఒక తమిళ పత్రిక వార్త ప్రచురించడంతో అది లారెన్స్ దృష్టికి చేరిం ది. దీంతో వెంటనే స్పందించిన లారెన్స్ షూటింగ్‌లో బిజీగా ఉన్నా, మంగళవారం ఉదయాన్నే గృహలక్ష్మీని, ఆమె కొడుకు, సోదరుడిని తీసుకురమమ్మని తన అనుచరులను కారులో పంపారు. ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన వారు ఆ ముగ్గురిని కలిసి లారెన్స్ పంపించారని చెప్పగానే ఎంతో ఉద్వేగానికి గురయ్యారు.
దేవుడు లారెన్స్ రూపంలో కరుణించారనే భావించారు. లారెన్స్ అనుచరులు ఆ ముగ్గురిని స్థానిక సముద్ర తీర ప్రాంతంలో ఉన్న లారెన్స్ ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చారు. అనంతరం నటుడు లారెన్స్ వారిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సాయం కోసం తనును వెతుక్కుంటూ చెన్నై వచ్చారని తెలిసి చాలా బాధపడ్డానన్నారు. ఆ పిల్లాడి జబ్బు ఏమిటన్నది తెలుసుకుని వీలైనంత వరకూ తన ట్రస్ట్ ద్వారానే వైద్య సేవలు అందిస్తానని, తనకు సాధ్యం కాకపోతే ప్రభుత్వాన్ని సాయం కోరతానని లారెన్స్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment