
‘‘కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారు చిన్న నిర్మాతలే కావొచ్చు. కానీ, వారే భవిష్యత్తులో పెద్ద నిర్మాతలుగా ఎదుగుతారు. అందుకే, ప్రతి చిన్న నిర్మాతను ఆదుకునే స్వభావంతో చిత్ర పరిశ్రమలోని వాళ్లు ముందుకు రావాలి. ‘రాఘవేంద్ర మహత్యం’ సినిమా పాటలు బాగున్నాయి. రవీంద్రగోపాల్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీయాలని ఆకాంక్షిస్తున్నా’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. రవీంద్రగోపాల్ టైటిల్ రోల్‌లో నటించి, నిర్మించిన చిత్రం ‘రాఘవేంద్ర మహత్యం’. మంత్రాలయం అన్నది ఉపశీర్షిక. పీసీ రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో కృష్ణచంద్ర దర్శకత్వంలో రూపొందింది.
ప్రమోద్‌కుమార్ స్వరపరచిన ఈ సినిమా పాటల సీడీని సి. కల్యాణ్ రిలీజ్ చేసి, చిత్ర సమర్పకులు గోపాల నారాయణకు అందించారు. రవీంద్రగోపాల మాట్లాడుతూ– ‘‘గతంలో రజనీకాంత్, రాజ్‌కుమార్ వంటి ప్రముఖులు రాఘవేంద్రస్వామి సిన్మాలు చేశారు. ఇప్పుడు వస్తున్న మా సినిమాలో కథ ఎక్కువగా ఉండటంతో పాటు వాటికి భిన్నంగా ఉంటుంది. చక్కటి భక్తిరస దృశ్యకావ్యంగా తీశాం. పాటలు, శ్లోకాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. నాకెలాంటి ఇమేజ్ లేకపోవడంతో చూసినవారికి కేవలం పాత్రే గుర్తు ఉంటుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రమోద్‌కుమార్, దర్శకుడు బాబ్జీ, పాటల రచయిత తైదల బాపు, నటుడు అశోక్‌కుమార్, నిర్మాత మోహన్‌గౌడ్ పాల్గొన్నారు.