ఏమో ఏమౌనో...
రాజా, స్వాతి దీక్షిత్ జంటగా తిరుపతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఏమో ఏమౌనో’. సై, జై చిరంజీవ తదితర చిత్రాల్లో నటించిన సూర్యప్రసాద్ (పింగ్ పాంగ్) ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ -‘‘నేను తొలిసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ఇది.
నా పాత్ర మాస్ టచ్‌తో ఉంటుంది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకు ఈ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. సూర్యప్రసాద్ మాట్లాడుతూ -‘‘ధనార్జనే ధ్యేయంగా ఈ సినిమాని నిర్మించడంలేదు. సూర్య మంచి నిర్మాత అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. మంచి కథాంశంతో ఈ చిత్రం చేస్తున్నా.
గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అన్ని శాఖలకన్నా నిర్మాణం చాలా కష్టం. యూనిట్ సభ్యుల సహకారంతో షూటింగ్ సజావుగా జరుగుతోంది. 90 శాతం సినిమా పూర్తయ్యింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. దర్శకునిగా అవకాశం ఇచ్చినందకు ధన్యవాదాలు తెలిపారు తిరుపతి మాధవ్. ఈ చిత్రానికి సంగీతం: ఐ.టి. ప్రధాన్, ఎడిటింగ్: నందమూరి హరి, కెమెరా: ప్రభాకర్.