హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందనే వార్తలు ఆ మధ్య టాలీవుడ్లో హల్ చల్ చేశాయి. దర్శక ధీరుడు జక్కన్న ఎన్టీఆర్ తో గరుడ అనే మూవీకీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ మధ్యకాలంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతుండడంతో ఈ వార్తలకు ఇంకాస్త బలం చేకూరింది. అయితే ఇపుడు దీనికి భిన్నంగా..రాజమౌళి తర్వాత మూవీ గరుడ అనేది పక్కా అయిన్పటికీ హీరో మాత్రం ఎన్టీఆర్ కాదని టాలీవుడ్ టాక్. వెయ్యి కోట్ల భారీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎగరేసుకుపోయాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఇది ఎన్టీర్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త అయినా ఇదే నిజమని ఇండస్ట్రీ విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రయోగాలకు మారుపేరుగా మారిన టాలీవుడ్ దర్శక దిగ్గజం తన భారీ ప్రాజెక్టుకు హృతిక్ రోషన్ ను ఖాయం చేసినట్టు తెలుస్తోంది. తద్వారా మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందుకే హృతిక్ ని ప్రిఫర్ చేశాట్ట. అయితే తారక్ తో మరో డిఫరెంట్ స్టోరీతో కచ్చితంగా సినిమా చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.
స్టూడెంట్ నెం1, సింహాద్రి, యమదొంగ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్ నటిస్తున్నాడని ,డేట్స్ కూడా ఇచ్చారని అప్పట్లో ఫిలిం నగర్ గుసగుసలాడిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం తారక్ కూడా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై, కొరటాల శివ డైరక్షన్లో వస్తున్న జనతా గ్యారేజ్ మూవీషూటింగ్ లో, రాజమౌళి బాహుబలి 2లో షూటింగ్ లో బిజీ బిజీగా వున్నారు. ఇది ఇలా ఉంటే గతంలో రాజమౌళి, ఎన్టీఆర్‌తో ఓ భారీ 3డీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఎన్టీఆర్‌తోనే కాదు అసలు 3డీ చిత్రమే చేయడంలేదని రాజమౌళి తన ట్విట్టర్ లో స్పందించారు కూడా. మరి ఈ వార్తలపై జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి.
వాళ్లిద్దరి క్రేజీ కాంబినేషన్ ఇప్పట్లో లేనట్టేనా?
Published Sat, Mar 12 2016 10:51 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM
Advertisement
Advertisement