
సూపర్ స్టార్ సినిమా మరోసారి వాయిదా
వరుస ఫ్లాప్ల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ డ్రామా కబాలీ. రజనీ ఏజ్కు, ఇమేజ్కు తగ్గ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను సమ్మర్ సీజన్ మొదట్లోనే రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది.
ఆ తరువాత తమిళనాట ఎన్నికల హడావిడి మొదలు కావటంతో రజనీ మరోసారి వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఎన్నికలు పూర్తవ్వగానే ఎట్టి పరిస్థితుల్లో కబాలీ రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు మరోసారి షాక్ ఇచ్చాడు సూపర్ స్టార్. జూన్ 3న రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమాను వాయిదా వేశారు. నెల ఆలస్యంగా జూలై 1న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రజనీ నిర్ణయం అభిమానులకుకు నిరాశ కలిగించినా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో నితిన్కు మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అ.. ఆ..' సినిమా జూన్ 3న రిలీజ్ అవుతోంది. అదే రోజు కబాలీ కూడా రిలీజ్ అవుతుందని టెన్షన్ పడుతోన్న చిత్రయూనిట్, రజనీ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కబాలీలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తుండగా, రజనీ ముసలి డాన్గా కనిపిస్తున్నాడు.