రజనీకాంత్ సినిమా అంటేనే అటు సినీ ఇండీస్ట్రీకి ఇటు ఆయన ఫ్యాన్స్‌కు పెద్ద పండగ. రజనీ సినిమా ప్రారంభం నుంచి విడుదలైన తర్వాత వచ్చే టాక్ వరకూ తలైవా ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా వాళ్ల జోరు మామూలుగా ఉండదు. అలాంటిది హిట్ టాక్ వస్తే ఇక ఏ రేంజ్‌లో వారి ఆనందం ఉంటుందో ఊహించుకోగలరు. ప్రస్తుతం ‘దర్బార్’ఫలితంతో ఆయన ఫ్యాన్స్ రెండు పండుగలు చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’ . సంక్రాంతి కానుకగా ఈ నెల 9న(గురువారం) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకపోతోంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
చాలాకాలం తర్వాత పోలీస్ గెటప్‌లో కనిసిస్తుండటం, మురగదాస్ దర్శకత్వం వహిస్తుండటం, టీజర్, ట్రైలర్, పాటలు ఓ రెంజ్‌లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ భారీ అంచానల నడుమ విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం తమిళనాటనే దాదాపు రూ. 19 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసిందంటే కోలీవుడ్‌లో రజనీ స్టామినా ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఇక కేవలం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్, ఓవర్సీస్‌లోనూ రజనీకి మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా ‘దర్బార్’భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే ‘దర్బార్’ రూ. 50 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రం రెండో రోజు కూడా తన జోరును కొనసాగించింది. బాలీవుడ్‌లో తానాజీ, ఛపాక్ చిత్రాలు విడుదలైనప్పటికీ ‘దర్బార్’జోరు, హుషారు ఏమాత్రం తగ్గలేదు. ఆ చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగించింది. అదేవిధంగా శుక్రవారం తెలుగులో మరే సినిమా లేకపోవడం దర్బార్‌కు మరింత కలిసొచ్చింది. రెండో రోజు కూడా దాదాపు రూ. 50 కోట్ల పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓవరాల్‌గా సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రజనీ దర్బార్ రూ. 100 కోట్ల మార్క్ దాటిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ ‘రజనీ దర్బార్’బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేయబోతోందని అతడి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతమందించాడు.
చదవండి:
దర్బార్ : మూవీ రివ్యూ
అమితాబ్ సూచనను పాటించలేకపోతున్నా
Comments
Please login to add a commentAdd a comment