
ఆ చిత్రాల మధ్య పోటీ లేనట్లేనా?
భారతీయ సినిమా మాత్రమే కాదు ప్రపంచ సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలు కోచ్చడయాన్, విశ్వరూపం-2. ఒక చిత్రంలో విశ్వ నటుడు కథనాయకుడు కాగా మరో చిత్రంలో ఇండియన్ సూపర్ స్టార్ హీరో. ఈ రెండు చిత్రాలు సాంకేతికపరంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతుండడం మరో విశేషం. భారీ తారాగాణంతో అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటున్న కోచ్చడయాన్, విశ్వరూపం-2 చిత్రాలు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రా లు ఒకేసారి తెరపైకి రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యం అయ్యేలా కనిపించడంలేదు. కోచ్చడయాన్ చిత్ర ఆడియోను ఈ నెల 28న, చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఎప్పటిలానే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. మార్చి 9న ఆడియో విడుదల చేయనున్నట్లు మరోసారి ప్రకటించారు. అయితే చిత్రం విడుదల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. విశ్వరూపం -2 విడుదల తేదీ మాత్రం మరోసారి వాయిదాపడనున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తి అయిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కోచ్చడయాన్‌కు పోటీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇందుకు బయ్యర్లు ఒప్పుకోవడంలేదని తెలిసింది. రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదలయితే వసూళ్లు తగ్గిపోతాయని బయ్యర్లు అంటున్నారు. దీంతో విశ్వరూపం -2 చిత్రాన్ని కోచ్చడయాన్ చిత్రం విడుదలైన వారం తరువాత విడుదల చేయడానికి కూడా వారు అంగీకరించడంలేదు. అందువల్ల విశ్వరూపం-2 మే నెలకు వాయిదాపడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.