వయసు పెరుగుతున్నప్పటికీ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎనర్జీలో, స్టైల్లో, డైలాగ్ డెలివరీలో మాత్రం పదును తగ్గడం లేదు. తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమా ‘పేట్టా’. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ‘‘పేట్టా’ సినిమాను అనుకున్న సమయానికన్నా పదిహేను రోజులు ముందుగానే పూర్తి చేశాం. ఇది టీమ్ సమిష్టి కృషి’’ అని రజనీకాంత్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. దాదాపు రెండు నెలల తర్వాత రజనీ చేసిన ట్వీట్ ఇదే కావడం విశేషం.
‘పేట్టా’ సినిమా షూటింగ్‌ను రజనీకాంత్ ముందే పూర్తి చేశారని తెలుసుకున్న అభిమానులు తలైవానా.. మజాకా అని అనుకుంటున్నారు. ‘‘తలైవాని నేను డైరెక్ట్ చేశానంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఈ సినిమా ప్రయాణం నా జీవితంలో మరచిపోలేనిది. రజనీకాంత్‌గారికి, సహకరించిన టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు కార్తీక్ సుబ్బరాజ్.
‘పేట్టా’ సినిమాలో సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మేఘా ఆకాష్, సతన్‌రెడ్డి, మాళవికా మోహనన్‌లతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, రజనీకాంత్ క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని టాక్. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. రజనీకాంత్ తర్వాతి చిత్రం మురుగదాస్ దర్శకత్వంలో ఉండబోతుందన్న ప్రచారం కోలీవుడ్‌లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
‘మీటూ’ని దుర్వినియోగం చేయకూడదు
‘పేట్టా’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని వారణాసి నుంచి చెన్నై చేరుకున్న రజనీకాంత్‌ను ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులు ‘మీటూ’ ఉద్యమం గురించి స్పందించమని అడిగారు. అప్పుడు రజనీ మాట్లాడుతూ– ‘‘మహిళల కోసం సాగుతున్న ‘మీటూ’ ఉద్యమం సక్రమమైన మార్గంలో వెళితే మంచిదే. ‘మీటూ’ని దుర్వినియోగం చేయకూడదు’’ అని అన్నారు.
ఇంకా వైరముత్తు–చిన్మయి వివాదం గురించి చెబుతూ– ‘‘గాయని చిన్మయి చేసిన ఆరోపణలను వైరముత్తు ఖండించారు కదా. అలాంటి సంఘటనలు జరగలేదని చెప్పారు. చట్టపరంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారని వార్తలు విన్నాను’’ అని అన్నారని చెన్నై మీడియా చెబుతోంది. ‘‘సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలి. దేవాలయాల సంప్రదాయాలను, నియమాలను కూడా గౌరవించాలన్నది నా మనవి’’ అని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి కూడా రజనీ చెప్పారట.
Comments
Please login to add a commentAdd a comment