
278 రోజులే... డాట్!
చిట్టి (రోబో) ‘2.ఓ’ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పేసింది. కానీ, చిన్న చేంజ్! మొన్నటిదాకా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నట్లు చెప్పిన చిట్టి... ఓ మూణ్ణెల్లు ఆలస్యంగా వచ్చే ఏడాది జనవరికి వస్తానని చెప్పింది. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమా ‘2.ఓ’. సుభాష్ కరణ్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.
‘రోబో’ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అందువల్ల ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. నువ్విలా లేటు చేస్తే ఎలా? అని చిట్టీని అడిగితే... ‘లెక్కపెట్టుకోండి! ఈ రోజుతో కలిపి 278 రోజులే కదా! ఇట్టే గడుస్తాయి... డాట్’ అంది. లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ –‘‘వీఎఫ్‌ఎక్స్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవడం కోసమే దీపావళికి విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని జనవరి 25, 2018న విడుదల చేస్తున్నాం.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ‘2.ఓ’ ఇండియన్ సినిమాల్లో ఒక చరిత్ర సృష్టిస్తుంది’’ అన్నారు. అమీ జాక్సన్ కథానాయికగా, ప్రముఖ హిందీ హీరో అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: ఆంటోని, కెమేరా: నిరవ్ షా, సంగీతం: ఏఆర్ రెహమాన్.