
జయను పరామర్శించిన రజనీకాంత్
- త్వరలో చెన్నైకి ప్రధాని: కేంద్రమంత్రి పొన్‌రాధాకృష్ణన్
- సింగపూర్ వైద్యుల చికిత్స!
- తమిళనాడు వ్యాప్తంగా హోమాలు, గోపూజలు
- నేడు అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, చెన్నై: చెన్నై అపోలో ఆస్పత్రిలో 25 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించడానికి ప్రధాని మోదీ త్వరలోనే చెన్నై వస్తారని, అయితే ఎప్పుడనేది తెలియదని కేంద్ర నౌకాయాన సహాయమంత్రి పొన్‌రాధాకృష్ణన్ ఆదివారం చెప్పారు. ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్, కూతురు ఐశ్వర్య ధనుష్.. ఆస్పత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమ్మకు ప్రస్తుతం లండన్‌కు చెందిన వైద్యుడు రిచర్డ్, ఎయిమ్స్ వైద్య బృందం చికిత్స కొనసాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం సింగపూర్‌లోని ప్రఖ్యాత మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి చెందిన మహిళా వైద్యులను చెన్నైకి పిలిపించారు. వీరు జయలలితకు ప్రత్యేక ఫిజియోథెరపీ చికిత్స సాగిస్తున్నారు. అయితే, ఇద్దరు వైద్యులు సింగపూర్ నుంచి వచ్చినట్టుగా అపోలో వర్గాలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. జయలలిత ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వదంతుల ఆరోపణలతో తమ పార్టీ కార్యకర్తలను వేధించడాన్ని డీఎంకే కోశాధికారి స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఇదే ఆరోపణలతో డీఎంకే కౌన్సిలర్ నవనీతకృష్ణన్‌పై పొల్లాచ్చి, అతని స్నేహితులు ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పదివేల ఆలయాల్లో దీప పూజలు
ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య క్షేమం కోసం ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా భక్తి భావం మిన్నంటింది. మృత్యుంజయ మహాయాగాలు, గో పూజలను అన్నాడీఎంకే వర్గాలు నిర్వహించాయి. పదివేలకు పైగా ఆలయాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్య దీప పూజలు నిర్వహించారు. తిరువళ్లూరులో వీరరాఘవస్వామి ఆలయంలో ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, అన్నాడీఎంకే సభ్యుడు డాక్టర్ సునీల్, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారెడ్డిలతో పాటు వంద మంది వైద్యుల బృందం, అన్నాడీఎంకే వర్గాలు మృత్యుంజయ మహాయాగం నిర్వహించారు. ఇదిలాఉండగా అన్నాడీఎంకే పార్టీ సోమవారం 45వ వసంతంలోకి అడుగుపెట్టనుండగా నిరాడంబరంగా వేడుకలు జరుపుకునేందుకు అన్నాడీఎంకే వర్గాలు నిర్ణయించాయి.