
'ఆ నటుడి జీవితాన్ని తెరకెక్కిస్తున్నా'
ముంబై: బార్న్ విత్ సిల్వర్ స్ఫూన్. చిన్నప్పుడే చెడు సావాసాలు. అంతలోనే తల్లి మరణం. కొన్నేళ్లు సినిమాలు. ఆపై డ్రగ్స్కు బానిస. అక్రమ ఆయుధాల కేసులో దోషి. మళ్లీ సినిమాలు.. ప్రస్తుతం జైలు శిక్ష .. ఇలా ఒక మసాలా సినిమాకు ఏమాత్రం తీసిపోనిది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం. దానినే ఇప్పుడు తెరకెక్కించనున్నారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ.
బ్లాక్ బస్టర్ మూవీ 'పీకే' తరువాత తాను రూపొందించబోయే సినిమా వివరాలను హిరానీ శుక్రవారం అధికారికంగా వెలువరించారు. సంజయ్ దత్ జీవితాన్ని తెరకెక్కిస్తున్నది నిజమేనని, ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తిచేసే పనిలో ఉన్నానని ఆయన చెప్పారు. ఈ సినిమాలో నటీనటులు ఎవరనే ప్రశ్నకు బదులిస్తూ.. కాస్టింగ్ గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించలేదని, స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఆయా పాత్రల డిమాండ్ మేరకు నటీనటుల్ని ఎంపిచేస్తామన్నారు. కాగా, యంగ్ హీరో రణ్బీర్ కపూర్ సంజూ బాబా పాత్రను పోషించనున్నారని వార్తలు వినవచ్చాయి. హిరానీ మాత్రం వాటిని నిర్ధారించలేదు.