
‘రాములమ్మ’కు స్ఫూర్తి అతనే! :దాసరి
‘‘సినీ చరిత్రలో ఎన్నో ప్రయోగాలు చేసిన దర్శకులున్నారు. రకరకాల కోవలకు చెందిన సినిమాలు తీసిన ప్రతిభావంతులున్నారు. కానీ ఒకే ధ్యేయంతో, ఒకే తరహా సినిమాలు తీసి విజయాలను అందుకున్న ఏకైక దర్శకుడు మాత్రం ఒక్క ఆర్.నారాయణమూర్తే. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాని ఇమేజ్ అతని సొంతం’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఆర్.నారాయణమూర్తే స్వరాలు కూడా అందించిన ఈ చిత్ర గీతాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని కె.రాఘవేంద్రరావుకు అందించారు. దాసరి ఇంకా చెబుతూ - ‘‘పేదవాడి కష్టాలను, వ్యవస్థపై ఉన్న కసిని సినిమా రూపంలో చూపించే ఏకైక దర్శకుడు నారాయణమూర్తి.
నేను ‘ఒసేయ్ రాములమ్మ’ తీయడానికి స్ఫూర్తి తనే. జనాల్లోకి వెళితే అతని వ్యక్తిత్వానికి, మాటకు విలువ ఉంటుంది. కానీ... ఎందరడిగినా తాను రాజకీయాలకు దూరమనే చెప్పాడు. తన సినిమాకొచ్చే ప్రతి రూపాయినీ తన ఊరి అభివృద్ధికే ఉపయోగిస్తాడు. నారాయణమూర్తితో నా బంధం మాటల్లో చెప్పలేను. అతను నాకు వీరభక్త హనుమాన్ లాంటివాడు’’ అన్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ, ‘‘రాజకీయనాయకుల దిగజారుడు తనాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నా. తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, తెలంగాణ శకుంతల లాంటివారి నటన, ప్రజా కవుల సాహిత్యం ఈ చిత్రానికి ఆభరణాలు. పది రోజుల్లో తొలి కాపీ వస్తుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె.రాంబాబు.