పంజాబీ పిల్ల... తెలుగు డబ్బింగ్
రకుల్ ప్రీత్‌సింగ్... ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలోని నవ యువ కథానాయికల్లో మొదటి వరుసలో ఉన్న గ్లామర్ గర్ల్. తెలుగు తెరకు వచ్చిన గడచిన ఆరేళ్ళలో తొమ్మిది సినిమాల్లో నటించిన హ్యాపెనింగ్ హీరోయిన్. ఈ పంజాబీ అమ్మాయి బయట చక్కగా తెలుగు మాట్లాడతారు. తెలుగు నటీనటులే తెలుగు సరిగ్గా మాట్లాడలేక పోతున్న ఈ రోజుల్లో ఆమె తెలుగు మాట్లాడడం వింటే ముచ్చటేస్తుంది. విషయం ఏమిటంటే, రకుల్ ఇప్పుడు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో చిన్న ఎన్టీయార్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కథానాయిక అయిన రకుల్ అలా వాచికాభినయం కూడా ప్రదర్శించనున్నారు.
‘‘ ‘నువ్వు డబ్బింగ్ చెప్పగలవు’ అంటూ దర్శకుడు సుకుమార్ నన్ను ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నారు. గత వారం ఈ సినిమాలో కొన్ని సీన్లకు టెస్ట్ డబ్బింగ్ చెప్పాను. అందరూ నా గొంతు బాగుందన్నారు’’ అని రకుల్ చెప్పుకొచ్చారు. అయితే, బయట ఎంత బాగా మాట్లాడినా, డబ్బింగ్ చెప్పడం వేరు కాబట్టి, కొంత టెన్షన్ ఫీలవుతున్నట్లు ఆమే ఒప్పుకుంటున్నారు.
తెర మీది సన్నివేశంలోని భావోద్వేగాలకు తగ్గట్లుగా మాట్లాడుతూ, ఉచ్చారణ సరిగ్గా ఉండేలా చూసుకోవడం కష్టమని ఒప్పుకుంటూనే అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ రకుల్ తీసుకుంటున్నారట. గమ్మత్తేమిటంటే, రకుల్ ఇంతవరకూ ఎవరి దగ్గరా పద్ధతి ప్రకారం తెలుగు నేర్చుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తనతో కేవలం తెలుగులోనే మాట్లాడ మని మొదట్లోనే చెప్పేశారు. వాళ్ళు మాట్లాడుతున్నది వింటూ, వాళ్ళతో మాట్లాడుతూనే భాష నేర్చేసుకు న్నారు.
‘‘ఆ కష్టం ఇప్పుడు ఫలించింది’’ అని ఈ మిస్ ఇండియా పోటీ ఫైనలిస్ట్ చెప్పుకొచ్చారు. నటిగా ఇంతదాన్ని చేసిన తెలుగు ప్రేక్షకులకూ, పరిశ్రమకూ ఇలా తెలుగులో మాట్లాడుతూ ఋణం తీర్చుకుంటు న్నట్లు రకుల్ భావిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’లో లండన్‌లో ఎన్నారైగా కనిపించనున్న రకుల్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తయారవుతున్న సినిమాలో అల్లు అర్జున్ పక్కన ‘అచ్చమైన తెలుగమ్మాయి’ పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి, వేషం... వేషానికి తగ్గ మాటతో తెలుగు నేలతో తన బంధాన్ని ఈ పంజాబీ పిల్ల గట్టిపరుచుకుంటున్నట్లున్నారు. ఆల్ ది బెస్ట్ రకుల్.