కోలీవుడ్‌కు సూపర్‌ పోలీస్‌గా రామ్‌చరణ్‌ | Ram Charan Super Police to Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు సూపర్‌ పోలీస్‌గా రామ్‌చరణ్‌

Published Wed, Dec 21 2016 1:58 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

కోలీవుడ్‌కు సూపర్‌ పోలీస్‌గా రామ్‌చరణ్‌ - Sakshi

కోలీవుడ్‌కు సూపర్‌ పోలీస్‌గా రామ్‌చరణ్‌

టాలీవుడ్‌ యువ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ తేజకు కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇంతకుముందు మావీరన్  చిత్రం ఇక్కడ మంచి ఆదరణ పొందింది. త్వరలో స్ట్రయిట్‌ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.తాజాగా సూపర్‌ పోలీస్‌గా ఒక పవర్‌ఫుల్‌ పాత్రలో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఆయన పెద్ద సాహసమే చేశారు. హిందీలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్  హీరోగా నటించిన జంజీర్‌ చిత్ర రీమేక్‌లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రమే తెలుగులో తుపాన్ గా విడుదలై కమర్షియల్‌గా హిట్‌ అయ్యింది. ఇప్పుడు సూపర్‌ పోలీస్‌గా కోలీవుడ్‌కు రానుంది.

ఇందులో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్  ప్రియాంకచోప్రా రామ్‌చరణ్‌ తేజకు జంటగా నటించడం ఒక విశేషం అయితే, సంచలన హిందీ నటుడు సంజయ్‌దత్‌ ప్రధాన పాత్రలో నటించడం మరో విశేషం. ఇక ప్రకాశ్‌రాజ్, తనికెళ్లభరణి, శ్రీహరి, మహీగిల్, అతుల్‌ కులకర్ణి ముఖ్య పాత్రల్లో నటించారు. కాకీ షర్టుపై గౌరవంతో పని చేసే నిజాయితీపరుడైన పోలీస్‌ అధికారి ఇతి వృత్తమే సూపర్‌పోలీస్‌. తన నిజాయితీ కారణంగా ఐదేళ్లలో 23 సార్లు బదిలీ అయి, చివరికి ముంబైకి చేరిన ఆ పోలీస్‌ అధికారికి ఒక కలెక్టర్‌ దారుణ హత్య దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆ హత్యకు కారణాలేంటీ? ఆ హంతకులను ఎలా ఎదుర్కొని శిక్షించారన్న పలు ఆసక్తికరమైన అంశాలకు ప్రతిరూపమే సూపర్‌ పోలీస్‌ చిత్రం.

ఇంతకు ముందు పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను కోలీవుడ్‌కు అందించిన స్వాతి, హర్హిణిల భద్రకాళీ ఫిలింస్‌ అధినేత భద్రకాళీ ప్రసాద్‌ రూపొందిస్తున్న తాజా చిత్రం ఇది. సత్య సీతల, అడ్డాల వెంకటరావు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకుడు.ఏఆర్‌కే.రాజరాజన్  సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రం మంచి కమర్షియల్‌ అంశాలతో కూడిన యాక్షన్ ఓరియంటెట్‌ కథతో జనరంజకంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. చిత్రంలో ఐదు ఐటమ్‌ సాంగ్స్‌ చోటు చేసుకోవడం మరో ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు. సూపర్‌ పోలీస్‌ చిత్రాన్ని ఇదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement