
తెగిన బంధాలకు ముడి...
చిరుత, రచ్చ, నాయక్, ఎవడు... యాక్షన్ సినిమాలు. ‘మగధీర’... ఫాంటసీ చిత్రం. ఆరంజ్... ప్రేమకథా చిత్రం. ఇక మిగిలింది కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యమే. అది కూడా చేస్తే భిన్న రకాల సినిమాలు చేసిన క్రెడిట్ కొట్టేస్తారు చరణ్. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. మానవ సంబంధాలను జనరంజకంగా తెరకెక్కించే కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు సినీ విలేజ్‌లో శరవేగంగా జరుగుతోంది. చరణ్, కాజల్, శ్రీకాంత్, రాజ్‌కిరణ్, కమలినీ ముఖర్జీ తదితర ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కృష్ణవంశీ.
అలాగే... కొన్ని పోరాట సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరిస్తారు. వారం క్రితం మొదలైన ఈ షెడ్యూల్ 45 రోజుల పాటు జరుగుతుంది. తర్వాత ఫారిన్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఇందులో చరణ్ బాబాయ్‌గా శ్రీకాంత్, తాతగా రాజ్‌కిరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ తండ్రిగా ఓ ప్రముఖ నటుడు నటించనున్నారు. తెగిన బంధాలను మళ్లీ ముడివేసి, కుటుంబంలో ఆనందాన్ని నింపే పాత్రలో ఇందులో చరణ్ నటిస్తున్నారు. మెగా అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వస్తోందని యూనిట్ సభ్యుల సమాచారం. దసరాగా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: యువన్ శంకర్‌రాజా, కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్స్.