Bhairava Geetha Review, in Telugu | ‘భైరవ గీత’ మూవీ రివ్యూ | Ram Gopal Varma - Sakshi
Sakshi News home page

Published Fri, Dec 14 2018 9:58 AM | Last Updated on Fri, Dec 14 2018 11:27 AM

Ram Gopal Varma Bhairava Geetha Movie Review - Sakshi

టైటిల్ : భైరవ గీత
జానర్ : ఫ్యాక్షన్‌ డ్రామా
తారాగణం : ధనుంజయ, ఇర్రా మోర్‌, బాల రాజ్‌వాడీ, విజయ్‌ రామ్‌
సంగీతం : రవి శంకర్‌
దర్శకత్వం : సిద్ధార్థ్‌ తాతోలు
నిర్మాత : రామ్‌ గోపాల్ వర్మ

ఇటీవల వరుస పరాజయాలతో ఫాం కోల్పోయిన రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకుడిగా గ్యాప్‌ ఇచ్చినా నిర్మాతగా సందడి చేస్తున్నాడు. సిద్దార్థ్‌ తాతోలును దర్శకుడిగా ధనుంజయ, ఇర్రామోర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన పిరియాడిక్‌ ఫ్యాక్షన్‌ డ్రామా భైరవ గీత. వర్మ మార్క్‌ ప్రమోషన్‌తో మంచి హైప్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో నిర్మాతగా అయినా వర్మ సక్సెస్‌ సాధించాడా..? తొలి చిత్రంతో సిద్దార్థ్ ఏమేరకు ఆకట్టుకున్నాడు..?

కథ‌ :
రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. అలా గతంలో చాలా సార్లు టాలీవుడ్‌లో చూసిన ఓ రొటీన్‌ కథతో వచ్చిన సినిమానే భైరవ గీత. భైరవ (ధనుంజయ), సుబ్బారెడ్డి(బాల రాజ్‌వాడీ) అనే ఫ్యాక్షనిస్ట్‌ దగ్గర పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి.. తన స్థాయికి తగ్గట్టుగా తన కూతురు గీత(ఇర్రా మోర్‌)ను కట్టారెడ్డి (విజయ్‌ రామ్‌) అనే మరో ఫ్యాక్షనిస్ట్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. గీత..భైరవను ప్రేమించటంతో ఇద్దరు ఊరొదిలి పారిపోతారు. విషయం తెలుసుకున్న సుబ్బారెడ్డి, కట్టారెడ్డి.. భైరవ తల్లిని, స్నేహితులను చంపేస్తారు. దీంతో భైరవ, సుబ్బారెడ్డి మీద తిరుగుబాటు చేస్తాడు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు.? చిరవకు భైరవ, గీత ఒక్కటయ్యారా? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :
భైరవ గీత చూస్తే నటీనటుల ఎంపికలో వర్మకు తిరుగులేదని మరోసారి అర్ధమవుతుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ధనుంజయ, భైరవ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగటంతో పెద్దగా వేరియేషన్స్‌ చూపించే అవకాశం లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ధనుంజయ నటన ఆకట్టుకుంటుంది. గీత పాత్రలో కనిపించిన ఇర్రా మోర్‌ నటన కూడా ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా పరిణతి కలిగిన నటిలా కనిపించింది. పర్ఫామెన్స్‌తో పాటు గ్లామర్‌ షోతోను మెప్పించింది. సుబ్బారెడ్డి, కట్టారెడ్డి పాత్రల్లో కనిపించిన బాల రాజ్‌వాడీ, విజయ్‌ రామ్‌ తమ పాత్రలకు కావాల్సిన క్రూరత్వాన్ని పండించారు.

విశ్లేష‌ణ‌ :
వర్మ.. సినిమా ప్రారంభంలోనే కథ మొత్తం చెప్పేసినా, ఆయన శిష్యుడు సిద్ధార్థ్‌ (దర్శకుడు) ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోపెట్టగలిగే కథనంతో సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా పాత్రల పరిచయం విషయంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ సినిమా మీద ఆసక్తి పెంచుతుంది. బోల్డ్‌ కథను అంతే ‘రా’గా వెండితెర మీద చూపించాడు. చాలా సన్నివేశాల్లో సిద్దార్థ్‌ టేకింగ్‌ కథను డామినేట్‌ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే వయలెన్స్‌ మీద పెట్టిన దృష్టి, ఇతర సన్నివేశాల మీద పెట్టినట్టుగా అనిపించదు. ముఖ్యంగా లవ్‌ స్టోరి ఏమాత్రం కన్వింన్సింగ్‌గా లేదు. గీత, భైరవను అంతగా ప్రేమించడానికి సరైన కారణం ఎక్కడా కనిపించదు. ద్వితియార్థంలోనూ మంచి ఎమోషన్స్‌ పండించే అవకాశం ఉన్నా ఎక్కువగా వయలెన్స్‌ మీదే దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది. విపరీతమైన రక్తపాతంతో కొన్ని సన్నివేశాలు చూడటానికే ఇబ్బంది కలిగిలే ఉండటం, బలమైన కథ, ఎమోషన్స్‌ లేకపోవటం నిరాశకలిగిస్తాయి. సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటిని తన ఫ్రేమ్స్‌లో చూపించాడు కెమెరామేన్‌. సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
సినిమాటోగ్రఫి
సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
పాత కథ
మితిమీరిన వయలెన్స్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement