Bhairava Geetha
-
‘వెన్ను పోటు’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయనున్న వర్మ..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల సంగతి ఎలా ఉన్నా ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఇటీవల దర్శకుడిగా వరుసగా ఫెయిల్ అవుతున్న ఆర్జీవీ తాజాగా భైరవ గీతతో నిర్మాతగా పరవాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నుపోటు పాటకు ప్రత్యేకంగా ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు వర్మ. అయితే వర్మ రిలీజ్ చేయబోయే పాటే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే సెన్సేషన్ సృష్టించిన వర్మ.. ఇప్పుడు వెన్నుపోటు పాట కోసం రిలీజ్ చేస్తున్న పోస్టర్‌ను ఏ రేంజ్లో డిజైన్ చేశాడా అన్న ఆసక్తి నెలకొంది. The first look of వెన్ను పోటు Song from Lakshmi’s NTR will release on December 21st at 4 PM — Ram Gopal Varma (@RGVzoomin) 19 December 2018 -
‘భైరవ గీత’ మూవీ రివ్యూ
టైటిల్ : భైరవ గీత జానర్ : ఫ్యాక్షన్ డ్రామా తారాగణం : ధనుంజయ, ఇర్రా మోర్, బాల రాజ్వాడీ, విజయ్ రామ్ సంగీతం : రవి శంకర్ దర్శకత్వం : సిద్ధార్థ్ తాతోలు నిర్మాత : రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుస పరాజయాలతో ఫాం కోల్పోయిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా గ్యాప్ ఇచ్చినా నిర్మాతగా సందడి చేస్తున్నాడు. సిద్దార్థ్ తాతోలును దర్శకుడిగా ధనుంజయ, ఇర్రామోర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన పిరియాడిక్ ఫ్యాక్షన్ డ్రామా భైరవ గీత. వర్మ మార్క్ ప్రమోషన్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో నిర్మాతగా అయినా వర్మ సక్సెస్ సాధించాడా..? తొలి చిత్రంతో సిద్దార్థ్ ఏమేరకు ఆకట్టుకున్నాడు..? కథ : రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. అలా గతంలో చాలా సార్లు టాలీవుడ్లో చూసిన ఓ రొటీన్ కథతో వచ్చిన సినిమానే భైరవ గీత. భైరవ (ధనుంజయ), సుబ్బారెడ్డి(బాల రాజ్వాడీ) అనే ఫ్యాక్షనిస్ట్ దగ్గర పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి.. తన స్థాయికి తగ్గట్టుగా తన కూతురు గీత(ఇర్రా మోర్)ను కట్టారెడ్డి (విజయ్ రామ్) అనే మరో ఫ్యాక్షనిస్ట్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. గీత..భైరవను ప్రేమించటంతో ఇద్దరు ఊరొదిలి పారిపోతారు. విషయం తెలుసుకున్న సుబ్బారెడ్డి, కట్టారెడ్డి.. భైరవ తల్లిని, స్నేహితులను చంపేస్తారు. దీంతో భైరవ, సుబ్బారెడ్డి మీద తిరుగుబాటు చేస్తాడు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు.? చిరవకు భైరవ, గీత ఒక్కటయ్యారా? అన్నదే మిగతా కథ. నటీనటులు : భైరవ గీత చూస్తే నటీనటుల ఎంపికలో వర్మకు తిరుగులేదని మరోసారి అర్ధమవుతుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ధనుంజయ, భైరవ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగటంతో పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ధనుంజయ నటన ఆకట్టుకుంటుంది. గీత పాత్రలో కనిపించిన ఇర్రా మోర్ నటన కూడా ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా పరిణతి కలిగిన నటిలా కనిపించింది. పర్ఫామెన్స్తో పాటు గ్లామర్ షోతోను మెప్పించింది. సుబ్బారెడ్డి, కట్టారెడ్డి పాత్రల్లో కనిపించిన బాల రాజ్వాడీ, విజయ్ రామ్ తమ పాత్రలకు కావాల్సిన క్రూరత్వాన్ని పండించారు. విశ్లేషణ : వర్మ.. సినిమా ప్రారంభంలోనే కథ మొత్తం చెప్పేసినా, ఆయన శిష్యుడు సిద్ధార్థ్ (దర్శకుడు) ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోపెట్టగలిగే కథనంతో సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా పాత్రల పరిచయం విషయంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ సినిమా మీద ఆసక్తి పెంచుతుంది. బోల్డ్ కథను అంతే ‘రా’గా వెండితెర మీద చూపించాడు. చాలా సన్నివేశాల్లో సిద్దార్థ్ టేకింగ్ కథను డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే వయలెన్స్ మీద పెట్టిన దృష్టి, ఇతర సన్నివేశాల మీద పెట్టినట్టుగా అనిపించదు. ముఖ్యంగా లవ్ స్టోరి ఏమాత్రం కన్వింన్సింగ్‌గా లేదు. గీత, భైరవను అంతగా ప్రేమించడానికి సరైన కారణం ఎక్కడా కనిపించదు. ద్వితియార్థంలోనూ మంచి ఎమోషన్స్ పండించే అవకాశం ఉన్నా ఎక్కువగా వయలెన్స్ మీదే దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది. విపరీతమైన రక్తపాతంతో కొన్ని సన్నివేశాలు చూడటానికే ఇబ్బంది కలిగిలే ఉండటం, బలమైన కథ, ఎమోషన్స్ లేకపోవటం నిరాశకలిగిస్తాయి. సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటిని తన ఫ్రేమ్స్‌లో చూపించాడు కెమెరామేన్. సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి సంగీతం మైనస్ పాయింట్స్ : పాత కథ మితిమీరిన వయలెన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఇంత మెజార్టీ వస్తుందని ఊహించలేదు : వర్మ
సాక్షి, హైదరాబాద్ : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో ధనుంజయ్, ఐరా మోర్లు జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భైరవ గీత. వర్మశిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వంలో... తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడనాట విడుదల కాగా.. డిసెంబరు 14న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో భైరవగీత ప్రమోషన్లలో భాగంగా రామ్ గోపాల్ వర్మ సాక్షి టీవీతో మాట్లాడారు. సినిమా విశేషాలతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ మిషన్ గన్ తీసుకుని ప్రతిపక్షాన్ని నామరూపాల్లేకుండా కాల్చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న విశ్వాసమే ఆయన్ను గెలిపించిందనేది నా భావన. అందరూ హంగ్ వస్తుంది లేదా ఇంకా ఏదో జరుగుతుందని చెప్పారు. కానీ ఎవరూ కూడా ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు. నేను కూడా అస్సలు ఊహించలేదు’ అంటూ వర్మ చెప్పుకొచ్చారు. కేసీఆర్ బయోపిక్ తీస్తా... ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్‌ను పొగుడుతూ వర్మ చేసిన ట్వీట్ గురించి ప్రశ్నించగా..... ‘ఓ ముఖ్యమంత్రి అదీ రెండోసారి.. మొదటి దఫా కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం నిజంగా అరుదైన విషయం. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ఆయన్ను 2.ఓ అన్నాను. నిజం చెప్పాలంటే ఆయన ఇలియానా కంటే అందంగా ఉంటారు. అందం అంటే లుక్స్‌కి సంబంధించింది కాదు. ఆకర్షించే గుణం గురించి నేను మాట్లాడుతున్నది. ఇలియానా డాన్స్ మూడు నిమిషాల కంటే ఎక్కువ చూడలేను. అదే కేసీఆర్ మాట్లాడితే మూడు గంటలపాటైనా వింటాను. ఎందుకంటే అన్నీ పంచ్ డైలాగ్‌లు పేలుస్తారు. హీరోల కంటే కూడా ఆయన చరిష్మా గొప్పది. కుదిరితే ఆయన బయోపిక్ కచ్చితంగా తెరకెక్కిస్తాను’ అంటూ వర్మ తన మనసులోని భావాలు పంచుకున్నారు. -
‘భైరవ గీత’ రెడ్ కార్పెట్ ప్రీమియర్
-
గీతమ్మా... నువ్వెవరమ్మా?
రామ్‌గోపాల్‌వర్మ సమర్పించడం, ‘నాకు స్పెషల్ సినిమా’ అని చెప్పుకోవడం, డైరెక్టర్ని పొగడ్తలతో ముంచెత్తడం... తదితర కారణాల వల్ల ‘భైరవగీత’ మీద ప్రేక్షకుల ఆసక్తి ప్రసరించింది. ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశిస్తున్న ఐరా మోర్ తన గురించి చెప్పిన ముచ్చట్లు... ఏమవుతుందో ఏమో! మా కుటుంబంలో అందరూ పెద్ద చదువుల వారే. నాన్న లాయర్. అమ్మ ప్రొఫెసర్. సిస్టర్ డాక్టర్. బ్రదర్ ఇంజనీర్. నాన్న చాలా స్ట్రిక్ట్. సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. థియేటర్‌తో మాత్రం పరిచయం ఉంది. ‘ఇక ఎలాగైనా సినిమాల్లో నటించాలి’ అని నిర్ణయించుకున్నాక అమ్మానాన్నలకు చెప్పాలనుకున్నా. కానీ భయం. చెప్పాలా? వద్దా? చెబితే తిడతారేమో!అసలే నాన్న పరమ స్ట్రిక్ట్. ఇక ఇలా కాదని ఒక మంచిరోజు చూసి ధైర్యం చేసి అడిగాను. అయిదు నిమిషాలు కూడా ఆలోచించకుండానే నాన్న ఓకే చెప్పేశారు. నాకు ఆశ్చర్యం, బోలెడు ఆనందం కలిగాయి. అమ్మా,నాన్నలు చదువుకున్న వాళ్లు, లోకం తెలిసిన వాళ్లు, వారికి ఏది మంచి నిర్ణయం ఏది కాదు అనేది తెలియంది కాదు కదా! నేనే గీత వర్మ ‘ఫ్రెష్ ఫేస్’ కోసం చూస్తున్నారని తెలిసి ఆడిషన్‌కి వెళ్లాను. రెండు మూడు ఆడిషన్ల తరువాత ‘భైరవగీత’లో గీత పాత్రకు ఎంపికయ్యాను. లండన్ నుంచి సొంతూరుకు వస్తుంది గీత. బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర. నిజజీవితంలో నేను కూడా ఇంతే. గీత పాత్ర చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. కాస్త బెరుకు! థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నటన అంటే భయం లేదు. అయితే కొన్నిసార్లు కెమెరాను ఫేస్ చేస్తున్నప్పుడు బెరుకుతో చేతులకు చెమటలు పట్టేవి. ప్రిపేర్ కానప్పుడే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది. చేయబోయే సీన్ గురించి హోంవర్క్ చేసినప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా నటించేదాన్ని. పరుగో పరుగు ‘భైరవగీత’లో పరుగెత్తే దృశ్యాలు ఉన్నాయి. కాళ్లకు ఇబ్బంది కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందని మారుమూలప్రాంతంలో షూటింగ్ చేసినప్పుడు ఒంటరిగా ఫీలయ్యాను. అయితే ఇది తాత్కాలికమే. ముద్దు సన్నివేశం చేయడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ‘‘నవ్వైనా, ఏడుపైనా, ముద్దు అయినా..ఇదంతా సినిమాలో భాగంగానే చేస్తాం. వాటిని ఆ క్షణంలోనే మరిచిపోవాలి. సీరియస్‌గా ఆలోచించవద్దు’’ అని హీరో ధనుంజయ్ చెప్పడంతో ‘నిజమే కదా’ అనిపించింది. మంచి కథ చాలు ఫలానా హీరోతో నటించాలనేదానికంటే మంచి కథ, ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాలనేది నా కోరిక. పాత్ర బలాన్ని తప్ప నిడివిని పట్టించుకోను. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే మహేశ్‌బాబు, రవితేజ సినిమాలు చూశాను. ‘అర్జున్‌రెడ్డి’ ‘మహానటి’ సినిమాలు కూడా చూశాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా అంటే ఇష్టం. మూడుసార్లు చూశాను. -
పూరితో వివాదం.. స్పందించిన వర్మ
సంచలన దర్శకుడు వర్మ, ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్‌ల స్నేహం గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి తరుచూ పార్టీల్లో దర్శనమిస్తుంటారు. అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ ల విషయంలో వర్మది తప్పే అని పూరి చెప్పటం వివాదానికి కారణమని కొంతమంది ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ వార్తా పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ అలాంటి దేమి లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. పూరి, నేను గతంలో ఎంత క్లోజ్ గా ఉన్నామో ఇప్పటికీ అలాగే ఉన్నామని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వర్మ నిర్మాణంలో తెరకెక్కిన భైరవగీత డిసెంబర్ 14న రిలీజ్ అవుతుండగా వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రీకరణ జరుగుతోంది. Fake News..Me and @purijagan are as close as we have ever been 👍 pic.twitter.com/vnC0cARS62 — Ram Gopal Varma (@RGVzoomin) 5 December 2018 -
వెనక్కి తగ్గిన వర్మ..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భైరవ గీత. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమాను 2.ఓ కు పోటిగా ఈ నెల 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగా వర్మ ప్రచారం కార్యక్రమాలను కూడా తన స్టైల్లో కొనసాగించాడు. 2.ఓ చిన్న పిల్లల సినిమా అంటూ కామెంట్ చేసి భైరవ గీతకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకువచ్చాడు. అయితే చివరి నిమిషంలో వర్మ వెనుకడుగు వేశాడు. సెన్సార్ సమస్యలతో పాటు సాంకేతిక కారణాల వల్ల భైరవ గీత సినిమా రిలీజ్ వాయిదా వేసినట్టుగా వెల్లడించారు. వారం ఆలస్యం డిసెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. Due to some censor related technical issues, @ThattSidd directed @BhairavaGeetha is now releasing on December 7 th Election Day ..Please vote for #BhairavaGeetha @dhananjayaka @Irra_Mor @AbhishekPicture — Ram Gopal Varma (@RGVzoomin) 27 November 2018 -
అప్పుడు నారాయణ అనేస్తా!
‘‘ప్రతి సినిమాను ఒకే రకమైన ష్యాషన్‌తో తీస్తాను. ఆడితే ఒళ్లు దగ్గరపెట్టుకుని తీశాడంటారు. ఆడకపోతే రివర్స్‌లో మాట్లాడతారు. ఫిల్మ్ మేకింగ్‌లో తెలిసి తప్పులు చేయను. ఏ దర్శకులూ కావాలని తప్పులు చేయరు’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ధనుంజయ్, ఐరా మోర్ జంటగా రూపొందిన చిత్రం ‘భైరవగీత’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ సమర్పణలో అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజవుతోంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ చెప్పిన విశేషాలు... ► ‘భైరవగీత’ చిత్రాన్ని భుజాన వేసుకోలేదు. అ«ధఃపాతాళంలోకి కూరుకుపోయిన నన్ను ఓ చేయి ఇచ్చి పైకి లాగుతుందనుకుంటున్నాను. ఒక సినిమా కథ వల్ల ఆడొచ్చు లేదా స్టార్డమ్ వల్ల ఆడొచ్చు. కానీ ఒక డైరెక్టర్ సీన్‌ను చెప్పే విధానంలో ఉండే మార్పే నా దృష్టిలో సినిమాటిక్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ అరుదుగా మారుతుంటుంది. దీన్ని చాలా సంవత్సరాల తర్వాత నేను సిద్ధార్థ్ దర్శకత్వంలో చూశాను. ►నా దగ్గర నుంచి 30–40మంది డైరెక్టర్లు వచ్చి ఉంటారు. నా వర్కింగ్ స్టైల్ ఇన్ప్లూయెన్స్తో సిద్ధార్థ్ నా దగ్గరకు వచ్చాడు. అందుకే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్‌లో నా మార్క్ కనిపించి ఉండొచ్చు. సినిమాలో సిద్ధార్థ్ స్టైల్ తెలుస్తుంది. లోయర్ స్టేటస్ ఉన్న వ్యక్తి, హయ్యర్ స్టేటస్ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు. దానివల్ల ఎలాంటి రెబలిజమ్ మొదలైంది? అనేది ఈ చిత్రకథ. ►వంశీ అనే అతను ఈ సినిమా స్క్రిప్ట్ రాశాడు. ఆ తర్వాత మేం మార్పులు చేశాం. ఈ స్క్రిప్ట్‌ను íసిద్ధార్థ్ డైరెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది. సిద్ధార్థ్‌ను శిష్యుడుగా అనుకోవడం లేదు. ఎప్పుడెప్పుడు నా నుంచి బయటపడాలా అని చూస్తున్నాడు. సినిమా ఆడితే.... రామ్‌గోపాల్ వర్మ ఎవరు? అని సిద్ధార్థ్ అడిగినా ఆశ్చర్యపోవడానికి లేదు. ‘2.ఓ’ సినిమాను పిల్లలు చూసే సినిమా అనడానికి కారణం ‘భైరవగీత’ పబ్లిసిటీ కోసమే. ►కావాలని తప్పులు చేయం. సినిమా బాగా ఆడకపోవడానికి ఒక్కరే కారణం అవ్వరు. నాలుగైదు కారణాలు ఉంటాయి. ‘ఆఫీసర్’ చిత్రం బ్యాడ్‌గా ఉందని తెలిస్తే రిలీజ్ కూడా చేయం కదా. నాగార్జున, నేను ఇద్దరూ నమ్మి ‘ఆఫీసర్’ సినిమా చేశాం. అందుకే రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి హీట్ డిస్కషన్ లేదు. ►నేను దేవుణ్ణి నమ్మనని ఎప్పుడూ చెప్పలేదు. భక్తులను నమ్మననే చెప్పాను. నేను దేవుణ్ణి నమ్మితే చాలా పాపాలు చేయలేను. నాకు తోచినవన్నీ చేసేసి చనిపోయే 5 నిమిషాల ముందు నారాయణ అనేస్తా. నేను డైరెక్టర్‌నే కాదు యాక్టర్‌ని కూడా. ►ఎన్టీఆర్‌గారి జీవితంలో లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాతి సంఘటనలే కీలకంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తున్నాను. ఇందులో కొత్తగా తెలియనిది చెప్పడం లేదు. బాలకృష్ణగారి ‘యన్.టీ.ఆర్’ బయోపిక్ సబ్జెక్ట్‌కు, నా సబ్జెక్ట్‌కు కనెక్షన్ లేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో చంద్రబాబునాయుడుగారి పాత్ర ఎలా ఉంటుంది? అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ సినిమా పరంగా నా ఇంట్రెస్ట్‌నే శాటిస్ఫై చేస్తాను. స్క్రిప్ట్ చూపించనని లక్ష్మీపార్వతిగారికి చెప్పాను. నమ్మకం ఉంటేనే అనుమతి ఇవ్వమని కోరాను. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తున్నారు. జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం. ‘యన్.టీ.ఆర్’ బయోపిక్, వైఎస్సార్ ‘యాత్ర’ సినిమాల టైమ్‌లోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజవుతుందంటే అది కాకతాళీయమే. ►రామ్ ఇలాంటోడు అలాంటోడు అన్నారు. నేను తప్ప అందరూ ‘మీటూ’లో ఉన్నారు బాలీవుడ్లో. వచ్చిన వార్ల పేర్లు విని షాక్ అయ్యాను. ►ఓటు ప్రాముఖ్యత గురించి నా చిన్నప్పుడు నేనూ విన్నాను. ఇప్పటివరకు నా లైఫ్‌లో ఓటు వేయలేదు. పాలిటిక్స్‌ను అర్థం చేసుకునే టైమ్ నాకు లేదు. నాకు ఎవ్వరు ఉన్నా ఓకే. చట్టానికి లోబడి ఉంటాను కాబట్టి ప్రభుత్వాలు చట్టాన్ని మార్చితే ఆ మార్పులను ఫాలో అవుతాను. నాకు ఆసక్తి ఉన్న పాలిటిక్స్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకు అమెరికన్ పాలిటిక్స్ అంటే ఇష్టం. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ గెలుస్తాడని ఇండియాలో ముందు చెప్పింది నేనే. -
భయానికి అర్థం తెలియదు
‘‘నేను థియేటర్ ఆర్టిస్టుని. సిద్ధు (డైరెక్టర్), వర్మగారు ఆడిషన్ చేసి ‘భైరవగీత’ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నారు. నా తొలి సినిమా తెలుగులో చేయడం హ్యాపీ. ఈ సినిమా నా జీవితాంతం గుర్తుంటుంది’’ అని ఐరా మోర్ అన్నారు. ధనుంజయ్, ఐరా మోర్ జంటగా సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవగీత’. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలవుతోంది. ఐరా మోర్ పంచుకున్న విశేషాలు... ► లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘భైరవగీత’. ఇందులో నేను గీత పాత్రలో నటించా. స్వతంత్ర భావాలు కలిగిన స్ట్రాంగ్ అమ్మాయి. లండన్‌లో చదివి హోమ్ టౌన్‌కి వస్తుంది. దేవుడి మీద పెద్దగా భక్తి ఉండదు. కానీ మానవత్వాన్ని నమ్ముతుంది. కుల వ్యవస్థను నమ్మదు. సొంత ఇంట్లోనే కులాల మధ్య అంతరం కనిపిస్తుంది.. బానిసత్వం తెలుస్తుంది. అలాంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. వర్మగారు ముక్కుసూటి మనిషి. ఆయనకు ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. అంతేకానీ, మనసులో పెట్టుకుని కన్ఫ్యూజ్ చేయరు. ► మాది జమీందారీ కుటుంబం. మా సామాజిక వర్గంలో భయం అనే పదానికి మీనింగ్ తెలియదు. భయం తెలియకపోవచ్చు కానీ, ఒక రకమైన బెరుకు మాత్రం ఉంటుంది. ► చాలా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. అక్కడ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ ఉండేది కాదు. కొన్నిసార్లు ఒంటరిగా అనిపించేది. నేను కిసెస్కి కంఫర్టబుల్ కాదు. కానీ, తొలి సినిమాలో అవన్నీ చేసేటప్పుడు కాస్త థ్రిల్లింగ్‌గానే అనిపించింది. నా పాత్రను దృష్టిలో పెట్టుకుని చాలా చేశా. నాకు తెలుగు అర్థం కాదు. పాత్రను అంగీకరించడానికి ముందు నేను వందసార్లు ఆలోచిస్తా. ► ‘మీటూ’ లాంటి విషయాల గురించి అమ్మాయిలు చెప్పడం మంచిదే. మనం పనిచేసే వాతావరణం చాలా క్లియర్‌గా ఉండాలి. నేను రవితేజ, మహేష్బాబుగార్ల సినిమాలు చాలా చూశా. అనుష్కగారంటే చాలా ఇష్టం. నా పాత్ర నచ్చితే అది చిన్న రోల్ అయినా చేస్తా. -
అలా అన్నాడంటే ఫ్రాడ్ లేదా పిచ్చోడు అయ్యుండాలి
‘‘భైరవగీత’ నాకు చాలా స్పెషల్ మూవీ. నేను ఇన్నేళ్లలో ఎన్నో సినిమాలకు దర్శకుడిగా చేయడంతోపాటు చాలా చిత్రాలు నిర్మించాను. డైరెక్షన్ అంటే ఓవరాల్ ఎఫెక్ట్ అనుకుంటారు అందరూ. కానీ ఉన్న మెటీరియల్‌ను ఉపయోగించి సినిమాటిక్ యాంగిల్లోకి మార్చేవాడే నిజమైన దర్శకుడు అని నా భావన’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సిద్ధార్థ తాతోలుని దర్శకునిగా పరిచయం చేస్తూ రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన చిత్రం ‘భైరవ గీత’. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘సిద్ధార్థ నా దగ్గర ఒక సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. అప్పుడు విలువైన సలహాలు ఇచ్చేవాడు. అతను ఇంటిలిజెంట్. కడప వెబ్ సిరీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే సిద్ధార్థ ఆ ట్రైలర్‌ను నేను చేస్తానన్నాడు. సిద్ధూ అ సినిమా ఎలా చేస్తాడనే డౌట్ ఉండేది. నువ్వు నిజంగా చేయగలుగుతావా? అని కూడా అడిగాను. ఎవరైనా చేయలేని పని చేస్తాను అన్నాడంటే వాడు ఫ్రాడ్ అన్నా అయ్యుండాలి లేదా పిచ్చోడైనా అయ్యుండాలి. అతను పిచ్చోడు కాదు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రష్ చూసి షాకయ్యాను. ఈ సీన్‌ను ఇలా కూడా తీయొచ్చా అనిపించింది. అది నాకొక లెసన్. డైరెక్షన్ అనుభవం లేకుండా చేయటమనేది రేర్‌గా జరుగుతుంది. నా టైమ్‌లో నేను, మణిరత్నం, శేఖర్ కపూర్ ఎక్కడా అసిస్టెంట్స్‌గా చేయలేదు. ‘భైరవగీత’ కష్టంతో కూడుకున్న సినిమా. 90 శాతం కొత్తవాళ్లతో తీసిన చిత్రం’’ అన్నారు. సిద్ధార్థ తాతోలు మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్ చదివిన నేను సినిమాల్లోకి వెళతాను అనగానే నన్ను సపోర్ట్ చేసిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాముగారికి థ్యాంక్స్ చెప్పి ఇచ్చిన చాన్స్‌ని చిన్నదిగా చేయదలచుకోలేదు. హీరో ధనుంజయ్‌ను ఈ సినిమా తర్వాత అందరూ భైరవా అని పిలుస్తారు. హీరోయిన్ ఐరా మోర్తో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. అభిషేక్ గారితో పాటు నన్ను నమ్మి నాతో వర్క్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నిజ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నేను ఇప్పటివరకు 10 సినిమాల్లో నటించాను ఇది నా 11వ చిత్రం’’ అన్నారు ధనుంజయ్. -
‘2.ఓ’ పిల్లల సినిమా : వర్మ
నవంబర్ 29న శంకర్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 2.ఓ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అదే స్థాయిలో దాదాపు 10వేల స్క్రీన్స్‌పై 2.ఓను రిలీజ్ చేసేందుకు ప్లాన్చేస్తున్నారు మేకర్స్. అయితే ఇంతపెద్ద సినిమా రిలీజ్ అయిన తరువాతి రోజే రామ్ గోపాల్ వర్మ ప్రమోట్ చేస్తోన్న భైరవగీత రిలీజ్ కానుంది. ఏ సందర్భానైనా తన సినిమా ప్రమోషన్ కోసం వాడేసుకునే వర్మ, 2.ఓను కూడా భైరవగీత ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడు. తాజాగా ప్రీ రిలీజ్ పార్టీలో పాల్గొన్న వర్మ.. 2.ఓ చిన్న పిల్లల సినిమా అంటూ తనదైన స్టైల్లో వివాదానికి తెర తీశాడు. ‘పెద్ద స్టార్లతో పెద్ద డైరెక్టర్ తీసిన చిన్న పిల్లల సినిమా 2.ఓ, చిన్న పిల్లాడు అయి సిద్ధార్థ్ తీసిన అడల్ట్ సినిమా భైరవగీత. పిల్లల సినిమా చూస్తారా.? పెద్దల సినిమా చూస్తారా?’ అంటూ అభిమానులను ప్రశ్నించాడు. -
వర్మ స్టైల్లోనే.. ‘భైరవగీత’ ట్రైలర్!
రామ్‌గోపాల్ వర్మ.. ఈ పేరే ఒక సంచలనం. ఏ సినిమా తీసినా.. అందులో తన మార్క్ కనిపించేలా తెరకెక్కించడమే ఆర్జీవీ ప్రత్యేకం. ఆయన సినిమాలే కాదు.. రియల్ లైఫ్‌లో ఆర్జీవీ తీరూ ప్రత్యేకమే. అయితే గత కొన్నేళ్లుగా సరైన సినిమాను ప్రేక్షకులను అందించలేకపోతున్నారని అభిమానులు నిరాశపడుతున్నారు. అయితే మళ్లీ ఆర్జీవీ ‘భైరవగీత’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ చిత్రం నుంచి రీసెంట్గా మరో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆర్జీవీ స్టైల్లోనే సాగుతున్న ఈ మూవీ ట్రైలర్లో.. అన్ని ఎమోషన్స్‌ను హైరేంజ్‌లోనే చూపెట్టాడు. ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వర్మశిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార బాధ్యతలను వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆలోచనను...ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలి....ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేయాలి..అంటూ వినిపించిన డైలాగ్‌లు బాగున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్ ప్రేమకథలో ధనుంజయ్, ఇర్రా మోర్లు హీరో హీరోయిన్లు నటించారు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదలకానుంది. -
‘నువ్వే నా భగవద్గీత!’ : భైరవ గీత తొలి పాట
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా భైరవ గీత. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్ ప్రేమకథలో ధనుంజయ్, ఇర్రా మోర్లు హీరో హీరోయిన్లు నటించారు. వర్మశిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార బాధ్యతలను వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇటీవల చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా ‘నువ్వే నా భగవద్గీత..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. రవిశంకర్ సంగీత సారధ్యంలో విజయ్ ఏసుదాసు, సాక్షి హోల్కర్ ఆలపించిన ఈ గీతానికి సిరాశ్రీ సాహిత్యమందించారు. వర్మ మార్క్ ప్రొమోషన్‌తో భైరవ గీతపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.