ఐరా మోర్
‘‘నేను థియేటర్ ఆర్టిస్టుని. సిద్ధు (డైరెక్టర్), వర్మగారు ఆడిషన్ చేసి ‘భైరవగీత’ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నారు. నా తొలి సినిమా తెలుగులో చేయడం హ్యాపీ. ఈ సినిమా నా జీవితాంతం గుర్తుంటుంది’’ అని ఐరా మోర్ అన్నారు. ధనుంజయ్, ఐరా మోర్ జంటగా సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవగీత’. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలవుతోంది. ఐరా మోర్ పంచుకున్న విశేషాలు...
► లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘భైరవగీత’. ఇందులో నేను గీత పాత్రలో నటించా. స్వతంత్ర భావాలు కలిగిన స్ట్రాంగ్ అమ్మాయి. లండన్‌లో చదివి హోమ్ టౌన్‌కి వస్తుంది. దేవుడి మీద పెద్దగా భక్తి ఉండదు. కానీ మానవత్వాన్ని నమ్ముతుంది. కుల వ్యవస్థను నమ్మదు. సొంత ఇంట్లోనే కులాల మధ్య అంతరం కనిపిస్తుంది.. బానిసత్వం తెలుస్తుంది. అలాంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. వర్మగారు ముక్కుసూటి మనిషి. ఆయనకు ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. అంతేకానీ, మనసులో పెట్టుకుని కన్‌ఫ్యూజ్ చేయరు.
► మాది జమీందారీ కుటుంబం. మా సామాజిక వర్గంలో భయం అనే పదానికి మీనింగ్ తెలియదు. భయం తెలియకపోవచ్చు కానీ, ఒక రకమైన బెరుకు మాత్రం ఉంటుంది.
► చాలా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. అక్కడ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ ఉండేది కాదు. కొన్నిసార్లు ఒంటరిగా అనిపించేది. నేను కిసెస్‌కి కంఫర్టబుల్ కాదు. కానీ, తొలి సినిమాలో అవన్నీ చేసేటప్పుడు కాస్త థ్రిల్లింగ్‌గానే అనిపించింది. నా పాత్రను దృష్టిలో పెట్టుకుని చాలా చేశా. నాకు తెలుగు అర్థం కాదు. పాత్రను అంగీకరించడానికి ముందు నేను వందసార్లు ఆలోచిస్తా.
► ‘మీటూ’ లాంటి విషయాల గురించి అమ్మాయిలు చెప్పడం మంచిదే. మనం పనిచేసే వాతావరణం చాలా క్లియర్‌గా ఉండాలి. నేను రవితేజ, మహేష్‌బాబుగార్ల సినిమాలు చాలా చూశా. అనుష్కగారంటే చాలా ఇష్టం. నా పాత్ర నచ్చితే అది చిన్న రోల్ అయినా చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment