పూరీతో జన్మజన్మల బంధం.. | Ramaprabha Special Interview In Sakshi | Sakshi
Sakshi News home page

జన్మంటూ ఉంటే రమాప్రభగానే..

Published Tue, Jun 26 2018 10:06 AM | Last Updated on Tue, Jun 26 2018 5:20 PM

Ramaprabha Special Interview In Sakshi

రెడీ, స్టార్ట్‌.. కెమెరా, యాక్షన్‌.. అంటూ క్షణం తీరిక లేకుండా 1500 సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పనిచేశారు. రంగుల ప్రపంచంలో వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. చిత్రసీమలో దాదాపు మూడు తరాల హీరోల సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆ రంగుల ప్రపంచానికి దాదాపుగా దూరమయ్యారు. ఇప్పుడు ఆధ్మాత్మికం వైపు తన పయనాన్ని ప్రారంభించారు. మరో జన్మంటూ ఉంటే.. రమాప్రభగానే పుట్టాలని ఉందని, ఈ మదనపల్లె ముద్దుబిడ్డ సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు.  

మదనపల్లె సిటీ : వెండితెర సహాయ నటిగా.. దశాబ్దాల పాటు.. తన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సీనియర్‌ నటి రమాప్రభ ప్రస్తుతం సాయిసేవలో తరిస్తున్నట్లు తెలిపారు. గతంలో హైదరాబాదు జూబ్లిహిల్స్‌లో ఉన్న ఆమె గత ఏడాది నుంచి స్వస్థలమైన మదనపల్లెలోనే ఉంటున్నట్లు చెప్పారు. తన సినీరంగ అనుభవాలు ఆమె మాటల్లోనే..

వెండితెరతో ఆరు దశాబ్దాల అనుబంధం..
జిల్లాలోని వాల్మీకిపురం మాఊరు. నాన్న గంగిశెట్టి. సాధారణ కుటుంబం. మా అమ్మ,నాన్నకు మేం 13 మంది సంతానం. 1947 మే 5న నేను జన్మించాను. ఊటీలో ఉంటున్న మా మేనమామ కృష్ణరావు ముఖర్జీకి పిల్లలు లేనందున నన్ను దత్తత తీసుకున్నారు. ఊటిలోనే నా బాల్యం గడిచింది. అనంతరం ఆయన తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నారు. నేను కూడా ఆయనతో పాటే చెన్నై వెళ్లాను. ఓ సందర్భంలో దర్శకులు ప్రత్యగాత్మ నన్ను, నా టాలెంట్‌ను చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు. దీంతో 1963లో చిలకాగోరింక సినిమాలో నాకు మొదటి అవకాశాన్ని కల్పించారు. అలా ప్రారంభమైన నా సినీప్రస్థానం 55 సంవత్సరాల పాటు ఏకధాటిగా కొనసాగింది. దాదాపు 1500 సినిమాల్లో వివిధ క్యారెక్టర్లలో నటించాను. సినీరంగంలో వెండితెరపై, వెనుక అనేక ఎత్తుపల్లాలు చూశాను.

దాదాపు మూడు తరాల హీరో, హీరోయిన్లతో నటించాను. తరువాత  సినీరంగంలో కొద్దిరోజుల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. తరువాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. మాఅన్నయ్య, ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాం. రణం, పండుగ తదితర సినిమాల్లో బామ్మ పాత్రలు పోషించాను. అప్పటి పరిస్థితుల బట్టి జూబ్లీహిల్స్‌లో ప్లాటు కొన్నా. హైదరాబాదు మన ఊరు కాదు కదా.. షూటింగ్‌కు వెళ్లిన ఊరు. ఎందుకో రావాలనిపించి స్వస్థలం మదనపల్లెకు వచ్చేశా. నాపేరుతో అంటూ ఏమీ లేవు. నాకు ఎక్కడ ప్లాట్లు లేవు. ఇప్పుడు నా మçనసు ఆ«ధ్యాత్మికం వైపు మరలింది. దీంతో రంగుల ప్రపంచాన్ని వదిలేసి సొంత జిల్లాకు వచ్చేశాను. మదనపల్లె రూరల్‌ మండలం గంగన్నగారిపల్లెలో మాపెద్ద తమ్ముడి ఇంటిలో ఉంటున్నాను. మదనపల్లె పట్టణంలోచిన్న తమ్ముడు, చెల్లెలు ఉన్నారు.

పూరీతో జన్మజన్మల బంధం
సినీరంగం నుంచి దాదాపు పూర్తిగా సంబంధాలు వదిలేశాక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నన్ను ఆదుకున్నారు. పూరిబాబుతో నాకు జన్మజన్మల బంధం. ప్రస్తుతం నాకు చివరి స్టేజి, సినిమాలు లేవు. ఎక్కడో మదనపల్లెలో ఉన్నా. అయినప్పటికీ నాకు డబ్బులు పంపించాలన్న తపన ఆయనలో ఉంది. గోపీచంద్‌ నటించే ఆరు అడుగుల బుల్లెట్‌ సినిమా షూటింగ్‌లో అనుకోకుండా పూరిబాబును కలసిననప్పుడు నా సెల్‌ నంబర్‌ , పుట్టిన తేదీ అడిగారు. అప్పటి నుంచి ప్రతి నెలా 5వ తేదీలోపు నెలకు రూ.20 వేలు పంపుతున్నారు.

జయలలిత మంచి స్నేహితురాలు..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాకు మంచి స్నేహితురాలు. షూటింగ్‌లో ఇద్దరు కలిసి మెలసి ఉండేవాళ్లం. నేను అప్పట్లో నేనే సెంటర్‌ ఆఫ్‌  అట్రాక్షన్‌. జయలలిత ఎప్పుడూ నా గురించి అందరినీ అడిగేవారు. బయటకు వెళ్లాలంటే ఫోన్‌లో ‘ఎన్నా.. వరిలియా’ (ఏం రాలేదా..) అని అడిగేవారు. సీఎం అయ్యాక ఫోన్‌ చేస్తే మరో మహిళ (శశికళ) ఫోన్‌ ఎత్తి ఎవరు..? అనేవారు. నాకు కొంచెం అలగుడు ఎక్కవ. అది అహంకారమో ఈగోనో.. తెలియదు.  ఈ కారణంగానే మా ఇద్దరి మధ్యదూరం పెరిగింది.

ఏఎన్‌ఆర్‌ మరణం జీర్ణించుకోలేను..
నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు మృతి ఇప్పటికీ జీర్ణించుకోలేను. ఆయన మృతి చెంది న విషయాన్ని.. వాణిశ్రీ ఫోన్‌ చేసి చెప్పారు. నేను అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. కొందరు నన్ను రావద్దని అవమానించారు. నా మనసును అకారణంగా గాయపరిచారు.

ఎస్వీ రంగారావు మా డాడీ..
ఎస్వీ రంగారావును నేను డాడీ అని అనేదాన్ని. రాజబాబు నేనూ కలిసి దాదాపు 300 సినిమాల్లో నటించాం. ఒకానొక దశలో మేమిద్దం కలిసి నటించిన సినిమాలు వరుసగా ఉండేవి. రాజబాబును రేయ్‌.. అని అప్యాయంగా పిలిచేదాన్ని. రాజబాబు మృతితో నేను బాగా దిగలుపడ్డాను.  సూర్యకాంతం అంటే గౌరవం, చాలా మంచి ఆవిడ.

మహానటితో మంచి సంబంధాలు..
సావిత్రమ్మతో నాకు మంచి సంబంధాలు ఉన్నా యి. షూటింగ్‌ విరామంలో డ్రైవర్లు, పనివాళ్ల ఇళ్లకు వెళ్లేవాళ్లం. మహానటి సినిమా చూడలేదు. చాలా మంది ఫోన్‌ చేశారు. ఆ సినిమాలో.. మ్యూజిక్, పాటలు ఏంటండి..? మహానటి అన్న పేరు పెట్టిన తరువాత ఆమెతో అనుబంధం ఉన్నవారిని సంప్రదించకుండా సినిమా తీశారు. మాహానటి సినిమా కేవలం బిజినెస్‌. ఇక సావిత్రమ్మ మహామొండి. చాలా దగ్గరగా ప్రేమించే వాళ్లును కూడా పో.. అనేది. అందుకే చాలా మంది ఆమెకు దూరమయ్యా రు. పేద సినీ కళాకారులను ఆదుకునేందుకు అప్పటి ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్‌ న్యూజెర్సీలో గంధంమాలను వేలం వేశారు. దాన్ని కొనుగోలు చేసేందుకు  సావిత్రమ్మ మైలాపూర్‌లో ఓ ఇళ్లును రాసిచ్చేశారు. ఇది ఆమె దాతృత్వానికి నిదర్శనం. 

కృష్ణ నిజజీవితంలోనూ సూపర్‌స్టారే..
సూపర్‌ స్టార్‌ కృష్ణ వెండి తెరపైనే కాదు నిజజీవితంలోనూ సూపర్‌స్టారే. ఆయన వ్యక్తిత్వం ఉన్నతమైంది. ఆ రోజుల్లో రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు చాలా పెద్ద మనసుతో స్పందించే వారు. తన వంతు సహాయాన్ని బాధితులకు ప్రభుత్వం ద్వారా అందించేవారు. ఇంతమంది గొప్పవారితో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. మనో జన్మంటూ ఉంటే.. రమాప్రభగానే పట్టాలని, ప్రేక్షకులను అలరించాలని ఉంది.

సాయిబాబా ఇష్టం..
నాకు షిరిడీ సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఆయన భక్తురాలిని. ఇంటి ఆవరణలోనే బాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నా. రోజూ  ప్రత్యేక పూజలు చేయడం అలవాటుగా మార్చుకున్నా. అందులోనే నాకు మనశ్శాంతి లభిస్తోంది. ఇంటిలో మాపెద్ద తమ్ముడు, పి    ల్లలు అందరూ ఉంటారు. నేను వారితోకలిసినా నాకంటూ ఓ ప్రత్యేకమైన పెంట్‌ హౌస్‌ నిర్మించుకుని ఒంటరిగానే ఉంటున్నా ను. ఇందులోనే నాకు మానసిక ప్రశాంతత. సమయం ఉన్నప్పుడు కుట్లు, అల్లికలు చేస్తా. పెయింగ్‌ అంటే ఇష్టం. ఎక్కిరాల భరద్వాజ నా ఆధ్యాత్మిక గురువు. ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నా. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు షిర్డీకి వెళ్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement