మహేశ్కు 15 లక్షలు.. పవన్కు 6 లక్షలేనా?
ఈ మధ్య సినిమా సెట్స్లో కన్నా ట్విట్టర్ కామెంట్స్లోనే ఎక్కువగా కనిపిస్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన సోషల్ సైట్కు పనిచెప్పాడు. ఇటీవల కాలంలో ఎక్కువగా స్టార్ హీరోలను పొగడుతూ వస్తున్న వర్మ.. ఈసారి మాత్రం విమర్శలకు దిగాడు. తన కామెంట్లతో పవన్ ఫ్యాన్స్పై సెటైర్స్ వేశాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్లో పవన్ కళ్యాణ్కు అతి తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటూ తన మార్క్ కామెంట్స్ చేశాడు.
'ట్విట్టర్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కేవలం ఆరు లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండటం నాకు విచిత్రం అనిపిస్తుంది. అంటే పవన్ ఫ్యాన్స్ నిరక్షరాస్యులా లేక సాంకేతికంగా ఇంకా అభివృద్ధి చెందలేదా..? పవన్ కళ్యాణ్ ఆలస్యంగా ట్విట్టర్లో జాయిన్ అయి ఉండొచ్చు, కానీ అలాంటి టాప్ స్టార్ సోషల్ మీడియాలోకి వస్తే ఫ్యాన్స్ వెంటనే ఫాలో అవ్వాలి కదా..? చివరకు సమంతకు కూడా 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు పవన్ లాంటి టాప్ స్టార్కు అంత తక్కువ మంది ఫాలోవర్స్ ఉండటం నాకు నమ్మబుద్ధి కావటం లేదు.
పవర్ స్టార్కి అందరికంటే పెద్ద అభిమానినైన నేను.. పవన్కి మహేష్ కన్నా తక్కువ మంది ఫాలోవర్స్ ఉండటం పై తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాను. అందరూ టాప్ స్టార్స్కు పవన్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారంటే పవన్ ఫ్యాన్స్ మీద సైకోఎనలిటికల్ రిసెర్చ్ చేయాలేమో..? పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అడుగుతున్నాడు గానీ, ముందు తన ఫ్యాన్స్ని ట్విట్టర్ గురించి తెలుసుకునేలా అభివృద్ధి చేసుకోవాలని అని మీకు అనిపించటం లేదా..? పవన్ వీరాభిమానిగా నేను ఆయన అభిమానులను టెక్నికల్గా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. అందుకోసం సమావేశాలు నిర్వహించైనా పవన్ ఫాలోవర్స్ని పెంచటానికి ప్రయత్నించాలి. నేను పవన్ ఫ్యాన్స్ కన్నా మహేష్ ఫ్యాన్స్ను ఎక్కువ గౌరవిస్తాను. వాళ్లు తన అభిమాన నటుణ్ని చాలా గొప్పగా ఫాలో అవుతున్నారు.
నేను మాత్రం పవన్ను ఫాలో అవ్వను. ఎందుకంటే నేను ఆయన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ మాత్రమే ఇష్టపడతాను. ఆయన మానవతా దృష్టిని కాదు, రైతుల మీద ఆయనకు ఉన్న ప్రేమను కాదు. నేను మాత్రమే కాదు పవన్ అభిమానులందరూ పవన్ ఆలోచనల కన్నా, పవన్ హీరోయిజాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. పవన్ యాక్టివ్గా లేకపోవటం వల్లనే ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో పవన్ వెనకపడిపోతున్నాడు. ప్రస్తుతం మహేష్ ఖాతాను ఫాలో అవుతున్న 15 లక్షల మార్క్ను పవన్ అందుకోవటానికి 2018 వరకు సమయం పడుతుంది. కానీ ఆ సమయానికి మహేష్ ఖాతాను దాదాపు 45 లక్షల మంది ఫాలో అవుతుంటారేమో'.. అంటూ పవన్, మహేష్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు రాం గోపాల్ వర్మ.