సర్కార్-3 వచ్చేస్తోంది!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. 2005లో అమితాబ్ బచ్చన్ హీరోగా రామూ తీసిన సర్కార్ సినిమా సంచలన విజయం సాధించింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల ఠాక్రేను గుర్తుతెచ్చే పాత్రలో అమితాబ్‌ను చూపించిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు సర్కార్ -3 సినిమా తీయడానికి సిద్ధమైపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా రామూయే వెల్లడించాడు. మధ్యలో సర్కార్ రాజ్ పేరుతో మొదటి భాగానికి సీక్వెల్ తీసిన వర్మ.. ఇప్పుడు ముంబైలో 'కంపెనీ' అనే పేరుతో తన కొత్త కార్యాలయాన్ని తెరిచాడు. ఇటీవల.. ఏప్రిల్ 7న రామూ బర్త్‌డే సందర్భంగా ఆ ఆఫీసుకు సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ వెళ్లారు. దాంతో వీళ్లిద్దరూ కలిసి సర్కార్ -3 తీయడం ఖాయమనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై అమితాబ్‌ను అడిగితే.. తామిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నామని, వాటిలో సర్కార్ 3 గురించి కూడా ఉందని చెప్పారు.
సుభాష్ నాగ్రే పాత్రలో నల్లటి కుర్తా, పంచెతో కనిపించే అమితాబ్, అతడి కొడుకు శంకర్ పాత్రలో అభిషేక్ బచ్చన్ సర్కార్ సినిమాలో అలరించారు. మూడేళ్ల తర్వాత సర్కార్ రాజ్ సినిమా వచ్చింది. అందులో ఐశ్వర్యా రాయ్ కూడా నటించింది. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత తాను సర్కార్ మూడో భాగం తీయడానికి సిద్ధమవుతున్నట్లు రామూ చెప్పాడు. దీని షూటింగ్ ప్రధానంగా లండన్, ముంబైలలో ఉంటుందట. ఒక టీనేజర్ తన మొదటి డేటింగ్ గురించి ఎంత ఉత్సాహంగా ఉంటాడో.. తాను సర్కార్ 3 గురించి అంతే ఉత్సాహంగా ఉన్నానని వర్మ చెప్పాడు. తాను, అమితాబ్ బచ్చన్ కలిసి స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నామన్నాడు.
రెండో భాగంలోనే అభిషేక్ పాత్ర చనిపోయింది కాబట్టి, ఇక మూడోభాగంలో అభిషేక్ ఉండబోడని కూడా వర్మ స్పష్టం చేశాడు. అలాగే ఈ భాగంలో ఐశ్వర్య కూడా ఉండదట. ఇందులో పూర్తిగా కొత్త పాత్రలు ఉంటాయని తెలిపాడు. వర్మ సినిమా గురించి ప్రకటించడం పాపం.. ఎప్పుడు షూటింగ్ పూర్తిచేస్తాడో, ఎప్పుడు విడుదల చేస్తాడోనని అంతా ఎదురుచూస్తారు. ఈలోపే వర్మ చకచకా పని పూర్తిచేయడం, విడుదల తేదీ ప్రకటించడం కూడా జరిగిపోతాయి. మరి సర్కార్ 3 ఎప్పుడు విడుదల అవుతుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.