వాళ్లను ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో చూపిస్తాం | Rana Daggubati proud to support C/o Kancharapalem | Sakshi
Sakshi News home page

రూట్‌ మార్చను

Published Sun, Aug 26 2018 1:52 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Rana Daggubati proud to support C/o Kancharapalem - Sakshi

రానా

‘లీడర్‌’ టు ‘నేనే రాజు నేనే మంత్రి’.. రానా చేసిన సినిమాలు తీసుకుంటే ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. బలమైన కథ ఉన్న సినిమాలే చేస్తుంటారు. హీరో అయినా ఓకే.. విలన్‌ అయినా ఓకే.. కథ బాగుంటే గెస్ట్‌గా అయినా ఓకే అన్నది రానా పాలసీ. ఎప్పటికీ నా పాలసీ ఇదే అంటున్నారు. వెంకటేష్‌ మహా దర్శకత్వంలో విజయ ప్రవీణ పరుచూరి నిర్మించిన ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ నచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు రానా. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రానాతో చిట్‌ చాట్‌.

► ఇప్పుడు మీ వయసుకి తగ్గ ఫిజిక్‌తో స్లిమ్‌గా ఉన్నారు.. భల్లాలదేవ పాత్ర కోసం పెంచిన ఫిజిక్‌ని కొంచెం కొంచెంగా తగ్గించినట్లున్నారు?
యస్‌. నిజానికి క్యారెక్టర్స్‌ కోసం బరువు పెరగడం వల్ల ఇన్ని రోజులూ వయసుకి మించి కనిపించాను. అందరూ అదే అనేవారు. కానీ అలా అనిపించుకోవడం బాగానే అనిపించేది. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్‌ తెచ్చే పేరు మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు బరువు తగ్గాక వయసుకి తగ్గట్టుగా యంగ్‌గా కనిపిస్తున్నావు అంటుంటే.. ఇది కూడా బాగానే అనిపిస్తోంది (నవ్వుతూ).

► ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ అంటూ ఓ బజ్‌ క్రియేట్‌ చేశారు. ఆ సినిమా గురించి ఎలా తెలిసింది?
నాన్న (రానా తండ్రి, నిర్మాత డి. సురేష్‌బాబు) చెబితే తెలిసింది. ‘ఆ సినిమా చూడ్రా... చాలా బాగుంది’ అన్నారు. చూసి, ఆశ్చర్యపోయాను. అసలు ఇలాంటి సినిమా చూడలేదు. ప్రేక్షకులకు మంచి ఫీల్‌నిచ్చే సినిమా అవుతుంది. అందుకే మేం ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నాం. ఒక పెద్ద బ్యాకింగ్‌ ఉంటే ఇలాంటి సినిమాలు వెలుగులోకి వస్తాయి. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి, అర్జున్‌రెడ్డి, మహానటి చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ‘మంచి చిత్రాలకు ఇదే మంచి సమయం’ అనిపించింది. ‘కంచెరపాలెం’తో కనెక్ట్‌ అవ్వడానికి ఇది ముఖ్య కారణం.

► ‘కంచెరపాలెం’ గొప్పతనం ఏంటి?
జీవితాలను చూపించే సినిమా. వైజాగ్‌ సమీపంలో ఉన్న కంచెరపాలెంలో జరిగే కథ. అందులో నలభై ఏళ్లు దాటినా పెళ్లి కాని వ్యక్తి ఉంటాడు. జనరల్‌గా చిన్న చిన్న ఊళ్లల్లో అలాంటి వ్యక్తులు ఉంటే అందరూ అతని గురించే మాట్లాడుకుంటారు. ఆ మాటల్లోంచి పుట్టే కథ, ఇతర సంఘటనలు.. వీటితో ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చాలా న్యాచురల్‌గా సాగుతుంది. సినిమా చూస్తున్న ఫీలింగ్‌ ఉండదు. మన కళ్లెదుట నిజంగా జరుగుతున్న కథేమో అన్నంత రియలిస్టిక్‌గా ఉంటుంది. నిర్మాత విజయ ప్రవీణ, దర్శకుడు మహా వెంకటేశ్‌ మంచి ప్రయత్నం చేశారు.

► మరి.. మీకూ ప్రొడక్షన్‌ హౌస్‌ ఉంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మీరూ చేయొచ్చు కదా?
విజయ, వెంకటేష్‌ పూర్తిగా కొత్తవాళ్లు కాబట్టి ఈ సినిమా తీశారు. అదే మాలాంటివాళ్లం అయితే కంచెరపాలెం సెట్, స్టార్‌ క్యాస్టింగ్‌ అంటూ చాలా హడావిడి చేసేస్తాం. అప్పుడు న్యాచురాల్టీ మిస్సవుతుంది. వీళ్లు కంచెరపాలెంకి వెళ్లి అక్కడే మొత్తం సినిమా తీశారు. బేసిక్‌గా ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వాలనే తపన ఉంది కాబట్టే, మా బేనర్‌ ద్వారా విడుదల చేస్తున్నాం. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్‌తో ఎవరు సినిమా తీయాలనుకున్నా మేం ఓ ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేయాలనుకుంటున్నాం.

► కంచెరపాలెంలో ఉండేవాళ్లనే ఈ సినిమాలో నటింపజేశారు. మీరు రషెస్‌ చూశారు కాబట్టి వాళ్ల నటన ఎలా అనిపించింది?
మామూలుగా మనం ఏ సినిమా చూసినా ఫలానా ఆర్టిస్ట్‌ ఆ సినిమాలో ఉన్నాడనీ ఇలా మాట్లాడుకుంటాం కదా. ఈ సినిమాలో ఒక్క ఆర్టిస్ట్‌ని కూడా అలా చెప్పలేం. స్క్రీన్‌కి అలవాటుపడనివాళ్లు. ఈ కథ రాసుకున్నాక వెంకట్‌ కంచెరపాలెం వెళ్లి, కథలో ఉన్న క్యారెక్టర్స్‌కి తగ్గవాళ్లను సెలెక్ట్‌ చేసుకున్నాడు. అందరూ బ్రహ్మాండంగా నటించారు.

► ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించి మీరే మాట్లాడారు. నటించినవాళ్లను వెలుగులోకి తీసుకు రాలేదే?
ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో చూపిస్తాం. విచిత్రం ఏంటంటే.. ఇందులో నటించినవాళ్లెవరూ ఇప్పుడు వాళ్లలా లేరు. సినిమా నిర్మాణం దాదాపు రెండు మూడేళ్లు జరిగిందనుకున్నాం. ఏడేళ్ల వయసున్నవాళ్లకి ఇప్పుడు పదేళ్లు వచ్చాయి. ఎదిగే వయసులో రూపు రేఖలు మారుతుంటాయి కదా. అలాగే పెద్ద వయసున్నవాళ్లు ఈ సినిమా కోసం గడ్డం పెంచారు. సినిమా అయిపోయింది కాబట్టి తీసేశారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు.

► ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’... ఇలా ఒకదానికి ఒకటి పోలిక లేని సినిమాలు చేస్తున్నారు. పక్కా ప్లాన్‌తో వెళుతున్నారా?
ఎగ్జాట్లీ. ‘నేను హీరోని’ అనిపించుకునేకన్నా ‘నేను నటుడ్ని’ అనిపించుకోవడంలోనే నాకు ఎగై్జట్‌మెంట్‌ ఉంటుంది. కంటెంట్‌ స్ట్రాంగ్‌గా ఉన్న కథల్లో నటిస్తే అలా అనిపించుకోవడానికి ఎక్కువ స్కోప్‌ ఉంటుంది. ‘బాహుబలి’ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. ‘ఘాజి’, ‘నేనే రాజు నేనే మంత్రి’ కూడా డిఫరెంట్‌ మూవీస్‌. ముందు ముందు కూడా ఇలాంటివే చేస్తాను తప్ప రూట్‌ మార్చను. నటుడిగా నేను శాటిస్‌ఫై అవ్వడం నాకు ముఖ్యం.

► ప్రస్తుతం చేస్తున్న ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’, ‘యన్‌.టి.ఆర్‌.’ బయోపిక్‌ గురించి?
కేరళలో వరదల కారణంగా ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’కి బ్రేక్‌ పడింది. ‘హాథీ....’ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ. కేరళలో ఉన్నటువంటి దట్టమైన అడవులు దాదాపు ఎక్కడా ఉండవు. ఇప్పుడు అక్కడ షూటింగ్‌ చేసే పరిస్థితి లేదు. ‘1945’ కోసం కేరళలో వేసిన పెద్ద సెట్‌ వరదల కారణంగా ఎఫెక్ట్‌ అయింది. ఆ విధంగా ఈ రెండు సినిమాలకు బ్రేక్‌ వచ్చింది. ఈలోపు ‘యన్‌.టి.ఆర్‌’ సినిమా ముగించేస్తా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement