రిసెప్షన్ పార్టీలో 'ఆ జంట' స్పెషల్ ఎట్రాక్షన్
ఇటీవల కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్న హీరో, హీరోయిన్లు త్రిష, రానా దగ్గుబాటి మరోసారి హైలెట్ అయ్యారు. శనివారం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ జంట హల్చల్ చేసింది. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇక గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా త్రిష మాత్రం ఎప్పటికప్పుడు మీడియాలో నానుతూనే ఉంది.
తాజాగా దుబాయ్లో జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్లోనూ వీరిద్దరూ కలిసే కనిపించారు. ఈ వేడుక తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇచ్చిన లేట్‌నైట్ పార్టీలో రానా, త్రిష బాగా ఎంజాయ్ చేశారనీ గుసగుసలు వినిపించాయి. అంతకు ముందు అమెరికాలో తెలుగు సంఘాల కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన రానా అక్కడ త్రిషతో ఊరంతా చక్కర్లు కొట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. చాలా ప్రయివేటు కార్యక్రమాల్లోనూ ఈ జంట ఎక్కువగా కనిపించింది.
ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లోనూ రానా, త్రిషల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని పుకార్లు షికార్లు చేసినా వారిద్దరు మాత్రం అబ్బే అదేమీ లేదు... మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చిలకపలుకులు చెప్పటం విశేషం. అలాగే వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు వెలువడినా అవన్ని రూమర్స్ అని కొట్టిపారేశారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ బ్రేకప్ అయ్యిందనే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా త్రిష, రానా జంట మరోసారి వార్తల్లో నిలిచారనటంలో సందేహం లేదు.