సినిమా : నటి రాశీఖన్నా రాశి బాగుంది. ఆమె రాశి బాగుండబట్టే కదా తెలుగు, తమిళ భాషల్లో నాయకిగా రాణిస్తోంది అని అంటారా? అదీ కరెక్టే కానీ కోలీవుడ్‌లో ఇప్పుడు ఆమె టైమ్ ఇంకా బాగుంది. కారణం ఇళయదళపతితో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇంతకు ముందు జయంరవికి జంటగా అడంగమరు, అధర్య సరసన ఇమైకా నొడిగళ్, విజయ్‌సేతుపతితో సంఘతమిళన్ వంటి చిత్రాల్లో రాశీఖన్నా నటించింది. ఆ చిత్రాలు మంచి సక్సెస్‌నే అందుకున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్‌కు జంటగా సైతాన్ కా బచ్చా, సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 3 చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో విజయ్‌దేవరకొండతో జత కట్టిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. అయితే కోలీవుడ్‌లో ప్రముఖ స్టార్‌తో నటించే అవకాశం రాలేదు. కాగా విజయ్ వంటి స్టార్‌తో నటించే అవకాశం వస్తే ఆ స్టార్‌డమ్‌నే వేరు. అలాంటి క్రేజీ ఆఫర్‌ను రాశీఖన్నా కొట్టేసిందన్నది తాజా సమాచారం. విజయ్ ప్రస్తుతం మాస్టర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మలయాళ నటి మాళవికామోహన్ నటిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఫైట్ సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు.
చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. అదే విధంగా అరుణ్‌రాజ్ కామరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్‌కు జంటగా నటి రాశీఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. మరో ముఖ్య పాత్రలో ఐశ్వర్యరాజేశ్ నటించనున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె విజయ్‌కి చెల్లెలుగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే ఈ అమ్మడు ఎవరికి చెల్లెలిగానైనా నటిస్తాను కానీ విజయ్‌కు చెల్లెలిగా నటించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అలాంటి పాత్రనే విజయ్‌తో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి దీనికి ఏం చెప్పి సమర్ధించుకుంటుందో ఐశ్వర్యరాజేశ్. కాగా ఇంతకు ముందు కూడా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఎంగవీట్టు పిళ్లై చిత్రంలో ఈ అమ్మడు శివకార్తీకేయన్‌కు చెల్లెలిగా నటించింది. మాస్టర్ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే తాజా చిత్రానికి విజయ్ రెడీ అవుతారని తెలిసింది. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా విజయ్ నటించనున్న 65వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment