హీరోయిన్‌ ఫోటోషూట్‌ : విశేష స్పందన | Rashmika mandanna Photo Shoot in Bellandur Pond | Sakshi
Sakshi News home page

శభాష్‌ రష్మిక

Published Sat, Dec 15 2018 11:24 AM | Last Updated on Sat, Dec 15 2018 11:24 AM

Rashmika mandanna Photo Shoot in Bellandur Pond - Sakshi

కర్ణాటక, కృష్ణరాజపురం : పర్యావరణ కాలుష్యంపై స్వచ్ఛంద సంస్థలు, సమాజ సేవా సంఘాలు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో  గాలి, నీరు, భూమి కాలుష్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ కోవలోనే బెంగళూరు నగరంలో అత్యంత పెద్ద చెరువైన బెళ్లందూరు చెరువు కూడా పాలకులు, ప్రజల సంయుక్త నిర్లక్ష్యానికి పూర్తిగా కలుషిత కోరల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో నీటి కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రముఖ యువ హీరోయిన్‌ రష్మిక మందన్న బెళ్లందూరు చెరువు నీటిలో ఫోటోషూట్‌ చేయించుకున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ డీ.సన్మతి నేతృత్వంలో బెళ్లందూరు చెరువు నీటి లోపల తీయించుకున్న ఫోటోలను తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన రష్మిక ఫోటోలతో పాటు సందేశాన్ని కూడా పోస్ట్‌ చేశారు.

బెళ్లందూరు చెరువులో ఇటువంటి పరిస్థితి నెలకొందనే విషయం ఫోటోషూట్‌ చేయించుకునే వరకు తమకు తెలియలేదంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఎంతో అందంగా ఉన్న బెళ్లందూరు చెరువులో ప్రస్తుతం నెలకొన్న కాలుష్యాన్ని చూసిన అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ రష్మిక తెలిపారు.  దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని చెరువుల్లోనూ బెళ్లందూరు చెరువులో నెలకొన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని అటువంటి చోట నేను ఉండదలచుకోవడం లేదని జల కాలుష్యంపై అవగాహన కల్పించడానికి బెళ్లందూరు చెరువులో ఫోటోషూట్‌ చేయించుకున్నట్లు ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. ట్విట్టర్‌లో రష్మిక మందన్న పోస్ట్‌ చేసిన ఫోటోలు, సందేశానికి అభిమానులు, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement