Disco Raja Review, in Telugu, Rating {2.5/5} | ‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ | Ravi Teja - Sakshi
Sakshi News home page

‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ

Published Fri, Jan 24 2020 12:52 PM | Last Updated on Fri, Jan 24 2020 5:12 PM

Ravi Teja Disco Raja Telugu Movie Review And Rating - Sakshi

టైటిల్‌: డిస్కో రాజా
జానర్‌: సైన్స్‌ఫిక్షన్‌ అండ్‌ రివేంజ్‌ డ్రామా
నటీనటులు: రవితేజ, నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్యా హోప్‌, బాబీ సింహా, వెన్నెల కిశోర్‌, సునీల్‌, సత్య
సంగీతం: తమన్‌
దర్శకత్వం: వీఐ ఆనంద్‌
నిర్మాత: రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి
నిడివి: 149.08 నిమిషాలు

ఆంధ్ర అమితాబ్‌, మాస్‌ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు గాంచిన వీఐ ఆనంద్‌ చెప్పిన కాన్సెప్ట్‌ నచ్చడం, అతడిపై పూర్తి విశ్వాసంతో ‘డిస్కో రాజా’  ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు రవితేజ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య నేడు ‘డిస్కో రాజా’  ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మరి ‘డిస్కో రాజా’ రవితేజను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? కాన్సెప్ట్‌ విత్‌ కమర్షియల్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం.  


కథ:
లడఖ్‌లో ప్రారంభమై ఢిల్లీ, చెన్నై, రుద్రాపూర్‌, ముంబై, గోవాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వాసు (రవితేజ) ఓ అనాథ. తనతో పాటు మరికొంతమంది అనాథలతో రామచంద్రం అనే ఓ పెద్దాయనతో కలిసి ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ క్రమంలోనే నభా (నభా నటేష్‌)తో ప్రేమలో పడతాడు. అయితే తన కుటుంబానికి వచ్చిన సమస్యను సెటిల్‌మెంట్‌ చేసుకోవడం కోసం గోవా వెళ్లిన వాసు తిరిగిరాడు. అయితే ఇదే క్రమంలో కొన్ని అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. మరోవైపు పరిణితి ( తాన్యా హోప్‌), పాల్గుణి (వెన్నెల కిశోర్‌) అండ్‌ టీం చేసిన ఓ ప్రయోగం సక్సెస్‌ అవుతుంది. చివరికి ఆ ప్రయోగం చేసింది డిస్కో రాజా(రవి తేజ)పై అని తెలుసుకుంటారు. అయితే ఇంతకీ ఆసలు డిస్కో రాజా ఎవరు? బర్మా సేతు (బాబీ సింహా), హెలెన్‌ (పాయల్‌ రాజ్‌పుత్‌), భరణి (రామ్‌కీ), పీటర్‌ (సత్య), ఉత్తరకుమారా అలియాస్‌ దాస్‌ (సునీల్‌)లు ఈ కథలో ఎందుకు ఎంటర్‌ అవుతారా? అసలు వాసు, డిస్కో రాజాకు ఉన్న సంబంధం ఏమిటి? డిస్కో రాజాపై వారు చేసిన ప్రయోగం ఏమిటి? అనేదే డిస్కోరాజా సినిమా కథ.

నటీనటులు: 
మామూలుగా రవితేజ సినిమా అంటేనే కథ మొత్తం అతడి చుట్టే తిరుగుతుంది.. ఆయన సినిమాకు ఆయనే ప్రధాన బలం, బలగం. ఇక ఈ సినిమాలో కూడా వన్‌ మ్యాన్‌ షో అనడం సాధారణమే అవుతుంది. రవితేజ అంటేనే ఎనర్జీ, కామెడీ.. ఈ విషయాలలో డోకా లేదు. ఇక ఈ సినిమాలో చాలా స్టైలీష్‌గా కనిపిస్తాడు. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో అతడు పలికించే హావభావాలు మైండ్‌ బ్లాంక్‌ అనే చెప్పాలి. అంతేకాకుండా మధ్య మధ్యలో అతడు చెప్పే హిందీ డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఇక ఓవరాల్‌గా రవితేజ సినిమాకు ఊపిరి పోశాడు. పవర్‌ప్యాక్‌ పర్ఫార్మెన్స్‌తో  మాస్‌మహారాజా రఫ్పాడించాడు. 

https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif
ఇక ముగ్గురు యువ కథానాయికలు పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్‌లు వారి పాత్రలకు జీవం పోశారు. ఇస్మార్ట్‌ బ్యూటీ నభా ఈ సినిమాలో కూడా తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. డాక్టర్‌ పాత్రలో తాన్యా హోప్‌ జీవించేసింది. ఇక ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌కు డిఫరెంట్‌ రోల్‌ దక్కింది. దీంతో నటిగా నిరూపించుకునేందుకు పాయల్‌కు దక్కిన మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇక పరభాషలో సెటిల్‌ అయిన తెలుగువాడు బాబీ సింహా ఈ చిత్రంతో టాలీవుడ్‌లో తొలిసారి నెగటీవ్‌ రోల్‌లో మెరిశాడు. విలన్‌ పాత్రలో కొన్ని సీన్లలో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్‌, సత్య తమ కామెడీ టైమింగ్‌తో అలరించారు. హీరో నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిన సునీల్‌కు ఈ చిత్రంలో విభిన్న పాత్ర దక్కింది.  తన శైలికి విభిన్నమైన పాత్రను కుడా సునీల్‌ అవలీలగా చేసేశాడు. మిగతా తారాగణం వారి పాత్రలకు తగ్గట్టు వారు న్యాయం చేశారు. 


విశ్లేషణ: 
‘రావణాసురిడి బాణానికి బలైన లక్ష్మణుడిని కాపాడటానికి హనుమంతుడు స​ప్త సముద్రాలు దాటి సంజీవని తీసుకొస్తాడు. అదేవిధంగా మనిషి చనిపోతే బతికించే సంజీవని కనిపెట్టడానికి వెళుతున్నాను’అనే ఓ డైలాగ్‌ ఈ చిత్రంలో ఉంటుంది. ఈ చిన్న లైన్‌ నుంచే దర్శకుడు వీఐ ఆనంద్‌ మొత్తం సినిమా కథను అల్లుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ లాంటి మాస్‌ హీరోతో ఓ విభిన్న చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్న డైరెక్టర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. అదేవిధంగా తన శైలికి భిన్నమైన కథను ఒప్పుకొని రవితేజ గొప్ప ప్రయోగమే చేశాడు. అయితే రవితేజ విశ్వాసాన్ని ఎక్కడా వమ్ముచేయకుండా, తన కాన్సెప్ట్‌కు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని.. నిర్మాతకు కావాల్సిన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడించి చాలా చక్కగా ప్రజెంట్‌ చేశాడు వీఐ ఆనంద్‌. 

టాలీవుడ్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలంటే కత్తిమీదసాము వంటిది. ఎందుకంటే లాజిక్‌ మిస్సయినా, ప్రేక్షకుడికి అర్థంకాకపోయినా డైరెక్టర్‌ ఫెయిల్‌ అయినట్టే. ఈ విషయంలో డైరెక్టర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రతీ విషయాన్ని, తను చెప్పాలనుకున్న అంశాన్ని చాలా బలంగా తెరపై చూపించాడు. దీంతో ఇప్పటివరకు చిన్న చిన్న సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్‌.. ఈ సినిమాతో డైరె​క్టర్‌గా మరో మెట్టు ఎక్కనున్నాడు. 

ఇక ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా సంఘటనలే ఉంటాయి. ఆ సంఘటనలతోనే ఈ చిత్రాన్ని చాలా తెలివిగా దర్శకుడు తెరకెక్కించాడనే చెప్పాలి. అంతేకాకుండా ఇది ఎలా అవుతుంది అని సగటు ప్రేక్షకుడు ప్రశ్నించకుండా ముందే సైన్స్‌ ఫిక్షన్‌ అనే ట్యాగ్‌ జోడించారు. దీంతో కొన్ని సీన్ల గురించి ప్రశ్నించే వీలు లేదు. అయితే సైన్స్‌ ఏదైనా చేయగలుగుతుంది అని విశ్వసించి, కొన్ని లాజిక్‌ లేని సీన్లను పక్కకు పెడితే సినిమా రవితేజ స్టైల్లో అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఆయన ఫ్యాన్స్‌ ఈ సినిమాతో పండగ చేసుకోవడం ఖాయమనే చెప్పాలి. 

సినిమా ఆరంభమైన వెంటనే కథ అర్థమైనట్టు ఉంటుంది. కానీ ఏమి అర్థంకాదు. సినిమాలో లీనమైనా కొద్ది ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, అదేవిధంగా క్లైమాక్స్‌లో వచ్చే అతిపెద్ద ట్విస్ట్‌ సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌గా నిలుస్తుంది. ముగ్గురు హీరోయిన్లకు తలా కొన్ని సీన్లు పడ్డప్పటికీ రవితేజ ముందు​ అంతగా హైలెట్‌ కావు. ఇక రవితేజ అండ్‌ గ్యాంగ్‌ చేసే కామెడీ, అల్లరి ఫుల్‌ ఎంటర్‌టైన్‌గా ఉంటుంది.  

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం తమన్‌ మ్యూజిక్‌. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండ్‌ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు అందించిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ సినిమాతో తమన్‌కు రావాల్సిన  గౌరవం తప్పక దొరుకుతుందనే చెప్పాలి. ఇక కార్తీక్‌ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక ఈ సినిమా రెండు తరాల మధ్య జరుగుతుంది. కొంత సేపు గతం, మరికొంత సేపు ప్రస్తుతం జరుగుతుంటుంది. దీంతో దేనికి తగ్గట్టు ఆ సెట్స్‌ వేసి ఆ రోజుల్లోకి తీసుకెళ్లాడు ఆర్ట్‌ డైరెక్టర్‌. 

‘మన వాళ్లు కలలు నిజం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక కలలపై బుక్స్‌ ఎలా రాస్తారు, కుటుంబం అంటే ఒకరిపై ఒకరు బతకడం కాదు.. ఒకరి కోసం ఒకరు బతకడం, ఏ యవ్వారం జరగకపోతే ఆ యవ్వనం యవ్వనం కాదు’ అని రచయిత అబ్బూరి రవి అందించిన డైలాగ్‌లు పర్వాలేదనిపించాయి. అయితే మాస్‌ మహారాజా స్టైల్లో మాస్‌ మసాలా డైలాగ్‌లు ఎక్కువగా లేవు. ఇక పాటలు అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగ్యశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్‌ ఘట్టాలు పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.   

https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif
ప్లస్‌ పాయింట్స్‌:
రవితేజ నటన
తమన్‌ మ్యూజిక్‌
క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌

మైనస్‌ పాయింట్స్‌:
లాజిక్‌ లేని కొన్ని సీన్లు
బలమైన కథ కాకపోవడం
కొన్ని సాగదీత సీన్లు

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement