ఇకపై బ్యాడ్‌ సినిమాలు చేయను | Ravi Teja Sakshi Interview About Disco Raja Movie | Sakshi
Sakshi News home page

ఇకపై బ్యాడ్‌ సినిమాలు చేయను

Published Sun, Jan 19 2020 12:21 AM | Last Updated on Sun, Jan 19 2020 5:04 AM

Ravi Teja Sakshi Interview About Disco Raja Movie

రవితేజ

ఆఫ్‌స్క్రీన్‌లో అయినా ఆన్‌ స్క్రీన్‌లో అయినా రవితేజ ఫుల్‌ ఎనర్జీతో ఉంటారు. ఆ ఉత్సాహమే రవితేజకు మాస్‌ మహారాజా అనే పేరు తెచ్చిపెట్టింది. ఈ మాస్‌ మహారాజా ఈ నెల 24న ‘డిస్కో రాజా’గా థియేటర్స్‌లోకి వస్తున్నారు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా ‘సాక్షి’తో రవితేజ చెప్పిన విశేషాలు.

► మీ సంక్రాంతి వేడుకలు ఎలా జరిగాయి?
కుటుంబంతో హాయిగా గడిపాను. మంచి ఫుడ్, మంచి సినిమాలు చూసి ఎంజాయ్‌ చేశాను.

► ‘డిస్కోరాజా’ చిత్రకథ ఏంటి? ఇందులో మీరు ఎలాంటి పాత్ర చేశారు?
ఈ సినిమాలో నా పాత్ర గురించి, సినిమా కథ గురించి ప్రస్తుతం ప్రేక్షకుల్లో భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేశానా? నా పాత్రలో షేడ్స్‌ ఉంటాయా? కథ సైంటిఫిక్‌ థ్రిల్లరా? నా క్యారెక్టర్‌కు ఏదైనా సిండ్రోమా? అని రకరకాలుగా మాట్లాడుకుంటూ మా సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో ఉన్న కొత్తదనం, థ్రిల్‌ను ఆడియన్స్‌ ఫీల్‌ అవ్వాలనే కథ గురించి ఇప్పుడు ఏం చెప్పాలనుకోవడం లేదు. అలాగని నా క్యారెక్టర్‌ గురించి ప్రేక్షకులకు థియేటర్‌లో ఎటువంటి కన్‌ఫ్యూజన్‌  ఉండదు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్‌కు సినిమాలోని అన్ని అంశాలపై ఫుల్‌ క్లారిటీ వస్తుంది. సినిమా బాగా వచ్చింది. హిట్‌ సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం. కథ నాకు బాగా నచ్చి, నేను ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ చేసిన ఏ సినిమా నన్ను నిరుత్సాహపరచలేదు.

► ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉన్నారు. కథలో వారి ప్రాముఖ్యత ఏంటి?
నా సినిమాల్లో హీరోయిన్‌  పాత్ర కథకు కీలకంగా ఉండాలనే కోరుకుంటాను. హీరోయిన్స్‌ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాకూడదు. ఇప్పటివరకు చాలా సరదా క్యారెక్టర్లు చేసిన నభా నటేష్‌ ఇందులో నభ అనే బ్యాంకు ఉద్యోగిని పాత్ర చేశారు.  భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, అప్యాయతలకు విలువనిచ్చే పాత్ర తనది. ఇక పాయల్‌ రాజ్‌పుత్‌ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. తాన్యా హోప్‌ సైంటిస్ట్‌ పాత్రలో కనిపిస్తారు.

► దర్శకుడు వీఐ ఆనంద్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది?
ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఇలాంటి కథను ఆనంద్‌ నుంచి నేను ఊహించలేదు. ఆనంద్‌ ఏదైతే అనుకున్నాడో స్క్రీన్‌ పై అదే చూపించాడు. చెప్పాలంటే అనుకున్నదానికంటే ఇంకా బాగా తీశాడు.

► కథలో మీరు ఏమైనా మార్పులు సూచించారా?
ఆనంద్‌కు ఎటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సెట్‌లో చాలా క్లియర్‌గా ఉంటాడు. సెట్‌లో ఆనంద్‌ చిరాకు పడటం కానీ, కోపగించుకోవడం కానీ నేను చూడలేదు. కాకపోతే కొంచెం మోహమాటస్తుడు.

► ‘డిస్కో రాజా’ కోసం మరొకసారి గొంతు సవరించినట్లున్నారు?
సంగీత దర్శకుడు తమన్‌  ప్రస్తుతం పిచ్చహైప్‌లో ఉన్నాడు. ‘డిస్కో రాజా’ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చాడు. నేను ఈ సినిమాలో ‘రమ్‌పమ్‌బమ్‌’ పాటకి గొంతు కలిపాను. తమన్‌  సరదాగా నా చేత మళ్లీ పాడించాడు. ఇంతకుముందు ‘బలుపు’ (కాజల్‌ చెల్లివా..), ‘పవర్‌’ (నోటంకీ నోటంకీ), ‘రాజాది గ్రేట్‌’ (రాజా రాజా ది గ్రేటూ రా) సినిమాల్లో పాటలు పాడాను. వీటిలో ‘బలుపు, పవర్‌’ సినిమాలకు తమనే మ్యూజిక్‌ అందించాడు. నా నెక్ట్స్‌ మూవీ ‘క్రాక్‌’కి కూడా తమనే సంగీత దర్శకుడు.

► ఏడాదిపాటు వెండితెరకు దూరమయ్యారు?
‘అల.. వైకుంఠపురములో....’లో డైలాగ్‌ ఉంటుంది కదా! ‘గ్యాప్‌ ఇవ్వలా.. వచ్చింది’ అని. ‘నేను గ్యాప్‌ తీసుకోలేదు... వచ్చింది. మరోసారి ఇలా కాకుండా సరైన ప్రణాళిక వేసుకుంటాను.

► మీ గత చిత్రాలు (టచ్‌ చేసి చూడు, నేల టిక్కెట్టు , అమర్‌ అక్బర్‌ ఆంటొని) ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి?
హిట్స్‌ ఫ్లాప్స్‌ మన చేతిలో ఉండవు. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఇకపై నేను బ్యాడ్‌ సినిమాలు చేయను. మంచి సినిమాలు మాత్రమే చేస్తాను. ఇది పక్కా.

► ఇటీవల మీరు వర్కౌట్‌ చేస్తోన్న ఫొటోలు వైరల్‌గా మారాయి..
వ్యాయామం చేయడం నాకు ఇష్టం. నా దైనందిన జీవితంలో అదొక భాగం. సరైన విధానంలో, క్రమశిక్షణగా వర్కౌట్స్‌ చేయాలి. తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటాను. ఇప్పుడు బ్యాడ్‌ ఫుడ్‌ తీసుకోవడం లేదు. ఆల్రెడీ రెండు మూడు జన్మలకు సరిపడా తినేశాం కదా (నవ్వుతూ).

► మీ అబ్బాయి మహాధన్‌ ను మళ్లీ ఎప్పుడు వెండితెరపై చూపించబోతున్నారు?
‘రాజా ది గ్రేట్‌’లో నా చిన్నప్పటి పాత్రను మహాధన్‌  బాగా చేశాడని ప్రేక్షకులు అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. ప్రస్తుతానికి మహాధన్‌  స్కూల్‌కి వెళ్తున్నాడు. ఇప్పట్లో అయితే ఏం లేదు. మహాధన్‌  ప్రతి విషయం పట్ల చాలా క్లియర్‌గా ఉంటాడని మాత్రం చెప్పగలను. ఈ తరం పిల్లలు చాలా షార్ప్‌ అండ్‌ స్పీడ్‌ అండీ బాబు.

► ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలే చేస్తున్నారు.  ప్రయోగాత్మక సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా?
అలా ఏం లేదు. కంటెంట్‌ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల్లో బాగా ఆదరణ పెరిగింది. ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’ చిత్రం ఇప్పుడు విడుదలైతే ఇంకా మంచి ఫలితం వచ్చి ఉండేది. డిఫరెంట్‌ సినిమాలు చేయడానికి నేనూ కథలు వింటున్నాను. అందుకు తగ్గ పనులు జరుగుతున్నాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే కొత్త రకం సినిమాలు చేయాలనుకుంటున్నాను. కొత్తరకం కంటెంట్‌ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు చేయాలి కూడా.

► యాక్టర్‌గా ‘నీ కోసం’ (1999) చేసిన రవితేజకు, ‘డిస్కోరాజా’(2020) చేసిన రవితేజకు ఉన్న మార్పు గురించి ఏం చెబుతారు?
కాలంతో పాటు ఎవరైనా మారిపోతుంటారు. అనుభవం పాఠాలు నేర్పుతుంది. అప్పటితో పోల్చితే నా ఆలోచనా ధోరణి మారింది. ఆలోచనల్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరిగింది. ఇంకా ఫుల్‌క్లారిటీతో ఉంటున్నాను. చాలా హాయిగా, హ్యాపీగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను.

► ఇటీవల మీరు నటించబోతున్నారని వార్తల్లో వినిపించిన సినిమాలు సెట్స్‌పైకి వెళ్లలేదు?
‘తేరీ’ (తమిళ సినిమా) తెలుగు రీమేక్‌ వద్దనుకున్నాను. అలాంటి సినిమా ఇది వరకే చేశాననిపించింది. ఇంకో సినిమా (‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో సినిమాని ఉద్దేశిస్తూ) గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు.

► దర్శకత్వ శాఖలో పని చేసి ఆ తర్వాత సక్సెస్‌ఫుల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు.  భవిష్యత్‌లో డైరెక్షన్‌  చేస్తారా?
ఓ కమర్షియల్‌ సినిమా డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నాను. కానీ ఎప్పుడో ఇప్పుడే చెప్పలేను. నిర్మాణరంగంవైపు వెళ్లాలనే ఆలోచన లేదు. ఎందుకంటే మనకు రానిది మనకెందుకు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement