‘స్వాతిముత్యం’లో కమల్‌హాసన్‌లా ఆయన్ను వెంటాడా!
‘‘సినిమారంగంలోనే ఉండాలని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యా. డెరైక్టర్ కావాలన్న నా కల నెరవేరింది’’ అని చెప్పారు బాబీ (కె.ఎస్. రవీంద్ర). రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబీ ‘పవర్’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమైన విషయం తెలిసిందే. రవితేజ, హన్సిక, రెజీనా నాయకా నాయికలుగా రాక్‌లైన్ వెంకటేశ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ పది చిత్రాల అనుభవం ఉన్న దర్శకునిలా ఈ సినిమా చేశావని పలువురు అగ్రదర్శకులు ప్రశంసించారని బాబీ చెప్పారు.
ఆదివారం పత్రికలవారితో ఆయన మాట్లాడుతూ - ‘‘రవితేజ కెరీర్‌లో మంచి ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రం ఇది. ఈ మధ్యకాలంలో టేబుల్ ప్రాఫిట్ చవిచూసిన చిత్రం కూడా. నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాలు తెచ్చిపెట్టే, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతో, ‘పవర్’ని పక్కా కమర్షియల్ చిత్రంగా తీర్చిదిద్దాను. ఇందులో రవితేజ లుక్ బాగుందని అందరూ అభినందిస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది కదా? అన్న ప్రశ్నకు.. ‘‘ఒకరిద్దరికి నచ్చలేదేమో కానీ, ఓవరాల్‌గా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రనిర్మాత మళ్లీ నాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్నిబట్టి ఏ స్థాయి హిట్టో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. దాదాపు పదేళ్ల క్రితం తన స్వస్థలం గుంటూరులో ఓ వేడుకలో రచయిత చిన్నికృష్ణతో పరిచయం ఏర్పడిందని, ఆయన అవకాశాలిప్పిస్తారనే ఆశతో హైదరాబాద్ వచ్చేశానని బాబీ అన్నారు. ఆ తర్వాత ‘స్వాతిముత్యం’లో కమల్‌హాసన్‌లా చిన్నికృష్ణ వెంటపడ్డానని, ఓ పది రోజుల తర్వాత ఒక సీన్ ఇచ్చి రాసుకు రమ్మన్నారని చెప్పారు బాబి. ఆ ఒక్క సీన్‌ని నాలుగు విధాలుగా రాయడంతో మెచ్చుకుని చిన్నికృష్ణ అవకాశం ఇచ్చారని, అదే తననీ స్థాయికి తీసుకొచ్చేలా చేసిందని బాబీ తెలిపారు.