వర్దమాన నటి రెబా మోనికా సూపర్ ఛాన్స్‌ను దక్కించుకుందన్నది తాజా సమాచారం. శాండిల్‌వుడ్‌కు చెందిన ఈ బ్యూటీ మొదట మాలీవుడ్‌లో కథానాయకిగా పరిచయమైంది. అటు నుంచి కోలీవుడ్, ఆ తరువాత మాతృభాషలో అంటూ మొదట్లోనే బహుభాషా నటిగా పేరు సంపాందించుకుంది. ఆ మధ్య విడుదలైన జరుగండి చిత్రంతో నటుడు జయ్‌కు జంటగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. దీనికి దావు అనే టైటిల్‌ను నిర్ణయించారు.
సంతానం హీరోగా దిల్లుకు దుడ్డు, దానికి సీక్వెల్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన రాంబాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చంద్రమౌళికి జంటగా రెబా మోనిక నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇలాంటి సందర్భంగా రెబాను మరో లక్కీఛాన్స్ వరించిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే ఇళయదళపతితో రొమాన్స్‌తో చేయబోంతోందన్నదే ఆ సమాచారం.
విజయ్ ప్రస్తుతం తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది.ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో అగ్రనటి నయనతార కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో మరో హీరోయిన్ ఉంటుందనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అంతే కాదు ఆ పాత్రలో నటి కీర్తీసురేశ్ నటించనుందనే టాక్ వినిపించింది.
తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు ఇప్పుడు రెబా మోనికను ఎంపిక చేశారట. విజయ్ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ ప్రధాన పాత్రను పోషించడం. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రాజకీయాలు ఉండవని, ఇది పూర్తిగా వినోదభరితంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. అయితే ఇందులో రాజకీయాలు ఉంటాయిగానీ, అవి వేరే విధంగా ఉంటాయన్నది తాజా సమాచారం. మొత్తం మీద విజయ్ 63వ చిత్రం ఇప్పటి నుంచే సంచలనం సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment