వర్షంతో తగ్గిన సినిమా వసూళ్లు
తమిళసినిమా : తమిళనాడులో సినిమా వసూళ్లకు వర్షాలు చెక్ పెట్టాయి. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు విలవిలలాడుతున్నారు. నిన్నటి వరకూ భానుడి భగభగలతో మండిపోయిన జనం ఇప్పుడు వరుడి ప్రతాపంతో వణికిపోతున్నారు. సంక్రాంతి, దీపావళి వంటి పండగల సందర్భాల్లో సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. భారీ చిత్రాలు విడుదలవడమే అందుకు కారణం. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్టకు గల్లాపెట్టెలు కాసులతో కళకళలాడేది అప్పుడే.
ఈ ఏడాది దీపావళికి విశ్వనటుడు కమలహాసన్ తూంగావనం, మాస్ హీరో అజిత్ వేదాళం చిత్రాలు భారీ అంచనాలతో తెరపైకి వచ్చాయి. ఈ చిత్రాల కారణంగా పలు చిన్న బడ్జెట్ చిత్రాల విడుదల వాయిదాపడింది. ఊహించినట్లుగానే రెండు చిత్రాలు మంచి టాక్‌నే తెచ్చుకున్నాయి. నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చునని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం సంబరపడిపోయారు. విడుదలయిన తొలి రెండు రోజులు తూంగావనం, వేదాళం చిత్రాలు మంచి కలెక్ష న్లను రాబట్టుకున్నాయి. అలాంటి పరిస్థితిలో వసూళ్లకు వర్షం గండికొట్టింది.
రోడ్లంతా జలమయం కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు రాలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో సుమారు 120 థియేటర్లు వరద కారణంగా ముంపునకు గురైనట్లు డిస్ట్రిబ్యూటర్ల వర్గాలు వెల్లడించాయి. న గరాల్లో కూడా థియేటర్లకు ప్రేక్షకులు ఎక్కువగా రావడం లేదని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సెలవులు కాస్తా వర్షంతోనే వెళ్లిపోయాయని తెలిపారు.
షూటింగ్‌లకు ఆటంకం
చిత్రాల వసూళ్లకు చెక్ పెట్టిన వర్షం షూటింగ్‌లకూ తీవ్ర ఆటంకంగా మారింది. గురువారం నుంచి వర్షం కురుస్తుండటంతో అవుట్ డోర్‌లో షూటింగ్‌లు చేస్తున్న వారికి చాలా కష్టాలు ఎదురవుతున్నాయని చిత్ర వర్గాలు ఆవేదక వ్యక్తం చేస్తున్నాయి.