ముగ్గురు హీరోలతో హ్యాట్రిక్ సినిమాలు
అందం, అభినయం రెండూ ఉన్న స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవటంలో ఫెయిల్ అవుతున్న హీరోయిన్ రెజీనా. తెలుగులో వరుస అవకాశాలు లేకపోవటంతో కోలీవుడ్ బాట పట్టిన ఈ భామ, టాలీవుడ్లో ఇంట్రస్టింగ్ రికార్డ్కు చేరువైంది. ఈ జనరేషన్ హీరోలు ఒక సినిమాలో కలిసి నటించిన హీరోయిన్తో మరో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అలాంటి సమయంలో ముగ్గురు హీరోలతో హ్యాట్రిక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.
ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రెజీనా. సందీప్తో రెజీనాకు ఇది మూడో సినిమా. గతంలో రొటీన్ లవ్ స్టోరి, రా రా కృష్ణయ్య సినిమాలో కలిసి నటించిన ఈ జోడికి తెలుగులో ఇది మూడో సినిమా. నక్షత్రం సినిమాలోనే మరో యంగ్ హీరోతో కూడా మూడో సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో కలిసి నటించిన సాయి ధరమ్ తేజ్ నక్షత్రం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మరో యంగ్ హీరోతో కూడా హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతోంది రెజీనా. ఇటీవల జ్యో అచ్యుతానంద సినిమాతో నారా రోహిత్ సరసన హీరోయిన్గా నటించి మంచి సక్సెస్ సాధించింది. అంతకు ముందే ఇదే కాంబినేషన్లో శంకర అనే సినిమాలో వీరు కలిసి నటించినా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు మరోసారి రోహిత్తో జోడి కట్టేందుకు రెడీ అవుతోంది. పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.