'ఆయనే ప్రేమించటం నేర్పించారు'
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ గ్లామర్ క్వీన్ రేఖ, యష్ చోప్రా స్మారక అవార్డును అందుకున్నారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ చేతుల మీదుగా ఈ అవార్డ్ను అందజేశారు. కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఈ అవార్డు కమిటీలో పమెలా చోప్రా, సిమీగేర్ వాల్, బోనీ కపూర్, జయప్రద, పింకీ రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. వీరంతా సినీరంగానికి రేఖ చేసిన సేవలకు గాను ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జ్యూరి సభ్యులతో పాటు డేవిడ్ ధావన్, పూనమ్ దిల్లాన్, మోహన్ బాబు, గుల్షన్ గ్రోవర్, శతృఘ్నసిన్హా లు పాల్గొన్నారు.
అవార్డు అందుకున్న సందర్భంగా రేఖ, యష్ చోప్రాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్స్లో ఒకటైన 'సిల్సిలా' సినిమాను యష్ చోప్రా దర్శకత్వంలోనే నటించినట్లు తెలిపింది. ఆ సమయంలోనే ఆయన తనకు ప్రేమ అంటే ఏంటో తెలియచేశారని రేఖ పేర్కొంది. ఇది తన కెరీర్కు ముగింపు కాకపోయినా, ఎప్పటికీ గుర్తుండిపోయే బెస్ట్ ఛాప్టర్ అని తెలిపింది. 61 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ నేటి హీరోయిన్లకు పోటి ఇచ్చే గ్లామర్తో ఆకట్టుకుంటున్న రేఖ ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదని, అవకాశాలు వచ్చినన్ని రోజులు సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది.