నలభై ఆరేళ్ల తర్వాత తెలుగులో...
బాలీవుడ్ అలనాటి అందాల తార రేఖ దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. 1966లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగుల రాట్నం’ చిత్రంతో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు రేఖ. ఆ చిత్రం విడుదలైన నాలుగేళ్ల తర్వాత 1970లో వచ్చిన ‘అమ్మ కోసం’ చిత్రంలో కృష్ణంరాజు సరసన నటించారామె. ఆ తర్వాత ఆమె దక్షిణాదిని వదిలి, హిందీ చిత్రసీమకు తరలివెళ్లారు. అందం, అభినయంతో అక్కడ తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు.
అలాంటి రేఖ చాలా విరామం తరువాత తెలుగులో నటించనుండడం సహజంగానే ఆసక్తికరంగా మారింది. కథానాయిక పూర్ణ లీడ్ రోల్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో చాలా విరామం తర్వాత రేఖ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న పూర్ణ, నూతన దర్శకుడు సూర్యతో ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయనున్నారు. మూడు తరాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. అందులో ఓ తరం పాత్రలో రేఖ నటిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్. అయితే, రేఖ ఈ చిత్రంలో ఏ పాత్రలో కనిపిస్తారన్నది సస్పెన్స్. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకులను రేఖ మరోసారి అలరించనున్నారు.