Rangula Ratnam
-
‘ఉనికి’ కోసం తపన
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్లా జంటగా రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉనికి’. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మాతలు. షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకి ‘ఉనికి’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, పోస్టర్ని విడుదల చేశారు. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ.. ‘‘ప్రతి మనిషి తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తాడు. ఓ మధ్య తరగతి యువతికి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికి నిలుపుకోవడం కోసం ఎలా పోరాడింది? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. రాజమండ్రి సబ్ కలెక్టర్ అంజలి అనుపమను చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ స్క్రిప్ట్ తయారు చేశాం. ఈ వేసవికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్), సహనిర్మాత: అడ్డాల రాజేశ్. -
‘రంగుల రాట్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగుల రాట్నం జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : రాజ్ తరుణ్, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి సంగీతం : శ్రీచరణ్ పాకల దర్శకత్వం : శ్రీ రంజని నిర్మాత : నాగార్జున అక్కినేని ఉయ్యాల జంపాల సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్ తరుణ్ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి అదే బ్యానర్లో నటించిన సినిమా రంగుల రాట్నం. శ్రీ రంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ పోటి మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? కథ : విష్ణు (రాజ్ తరుణ్) బాధ్యత తెలియకుండా పెరిగిన కుర్రాడు. తల్లి(సితార) గారాభం చేయటంతో ఏ పనీ సొంతం గా చేసుకోకుండా అన్నింటికీ తల్లి మీద ఆధారపడుతుంటాడు. పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుందని అమ్మాయిని చూడటం మొదలు పెడుతుంది విష్ణు తల్లి. అయితే అదే సమయంలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసే కీర్తి(చిత్రా శుక్లా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు విష్ణు, ఆ అమ్మాయితో పరిచయం పెంచుకునేందుకు అమ్మ పుట్టిన రోజు పార్టీ అని కీర్తిని ఇంటికి పిలుస్తాడు. అలా వారిద్దరి పరిచయం స్నేహంగా మారుతుంది. కానీ కీర్తికి ప్రేమ విషయం చెప్పేలోపే విష్ణు తల్లి చనిపోతుంది. తల్లి చనిపోయిన బాధలో ఉన్న విష్ణు ఆ బాధనుంచి ఎలా బయటపడ్డాడు..? కీర్తికి ఎలా దగ్గరయ్యాడు..? కీర్తి ఓకె చెప్పిన తరువాత విష్ణు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? చివరకు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : గత ఏడాది కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ కొత్త ఏడాదిలో రంగుల రాట్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనకు అలవాటైన మేనరిజమ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథలో బలమైన సన్నివేశాలు లేకపోవటంతో నటుడిగా పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కలేదు. సెంటిమెంట్ సీన్స్‌లో మాత్రం మంచి పరిణతి కనబరిచాడు. హీరోయిన్ చిత్రా శుక్లా పరవాలేదనిపించింది. తల్లి పాత్రకు సీనియర్ నటి సితార ప్రాణం పోసింది. హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రియదర్శి మంచి నటన కనబరిచాడు. అక్కడక్కడ ప్రియదర్శి కామెడీ కాస్త నవ్విస్తుంది. విశ్లేషణ : తొలి చిత్రంగా ఎలాంటి ప్రయోగాలకు పోకుండా ఓ సాధారణ ప్రేమకథను ఎంచుకున్న దర్శకురాలు శ్రీరంజని, ఆ కథను ఆసక్తికరంగా తెర మీద ఆవిష్కరించటంలో పూర్తిగా విఫలమయ్యారు. సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. ఏ దశలోనూ ఆడియన్ను కథలో లీనం చేయలేకపోయారు. బలమైన ఎమోషన్స్, ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవటం నిరాశకలిగిస్తుంది. తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ మరింత బలంగా చూపించేందుకు అవకాశం ఉన్నా.. అలాంటి సన్నివేశాలపై పెద్దగా దృష్టిపెట్టినట్టుగా అనిపించదు. శ్రీచరణ్ అందించిన సంగీతం పరవాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సితార పాత్ర నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : కథా కథనం స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
సమంత ఆటపట్టించింది – నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై శ్రీరంజని దర్శకత్వంలో రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా జంటగా నాగార్జున నిర్మించిన చిత్రం ‘రంగుల రాట్నం’. ఇందులో సితార, ప్రియదర్శి కీలక పాత్రలు చేశారు. నిర్మాత నాగ్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ, నటీనటులతో సంక్రాంతి విశేషాలు. ఈ సంక్రాంతి మీకు చాలా స్పెషల్. అఖిల్ ‘హలో’ హిట్. నాగచైతన్య పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.. అవును. వెరీ స్పెషల్ సంక్రాంతి. పిల్లలు సెటిల్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ‘హలో’తో అఖిల్‌కి మంచి పేరు వచ్చింది. మీడియా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆడియన్స్.. ఇలా అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లాస్ట్ వన్ ఇయర్ బాగాలేదు. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ఎదురైన ఒత్తిడిని తట్టుకొని, నిలబడి సినిమా చేశాడు. అఖిల్ యాక్టింగ్ చూసి, నేను కూడా షాక్ అయ్యాను. తండ్రిగా కాకుండా ఒక ఆర్టిస్ట్‌గా చూస్తే ఆ యాక్షన్, డైలాగ్ డిక్షన్, డాన్స్ చాలా బాగా చేశాడనిపించింది. తెలుగు ఇంత బాగా మాట్లాడతాడనుకోలేదు. వాయిస్ అంత బాగా ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు.. భలే పాడాడు. నాన్న (అక్కినేని నాగేశ్వరరావు) ఎప్పుడూ చెబుతుండేవారు ‘కసి ఉంటేనేరా పైకి వచ్చేది’ అని. అఖిల్ ఆ కసితోనే చేశాడనిపించింది. హ్యాపీగా ఉంటే శుబ్బరంగా తిని పడుకుంటాం. ఇప్పుడు మేం అంత హ్యాపీగా ఉన్నాం (నవ్వుతూ). మీరన్నట్లు లైఫ్‌లో వచ్చే ‘డౌన్స్’ని తట్టుకుని నిలబడటం గ్రేట్. ఓ ఫాదర్‌గా మీ పిల్లలకు మీరు భలే మోరల్ సపోర్ట్ ఇస్తారనిపిస్తుంటుంది.. నా మొదటి నాలుగు సినిమాలు ఆడనప్పుడు నాన్నగారు ‘లైఫ్ విల్ టీచ్ యు’ అన్నారు. నేను నా పిల్లలకు కూడా అదే చెబుతుంటాను. దాంతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల లైఫ్ ఎగ్జాంపుల్స్ చెబుతుంటాను. ‘నిన్ను ఎవరైనా తిట్టారు అంటే అది పర్సనల్‌గా కాదు.. బాగా లేని నీ సినిమాని’ అంటుంటా. ‘క్రికెట్లో కోహ్లీ బాగా ఆడలేదు అంటే పర్సనల్ అని కాదు పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే’ అని చెబుతుంటాను. నాకంటే కూడా అమల స్పిరిచ్యువల్‌గా బాగా మోటివేట్ చేస్తుంది. వాళ్లు గంటలు గంటలు మాట్లాడుకుంటారు. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారో ఇక వాళ్లకు లోన్లీ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది? ఎవరికైనా సరే పేరెంట్స్ సపోర్ట్ ఇస్తే చాలు. మనం ముసలివాళ్లు అయిపోయినా కూడా దెబ్బ తగిలితే ‘అమ్మా’ అనే అంటాం కదా. అవును. ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు బిడ్డే కదా. ఓకే.. ఇంటికి కొత్త కోడలు వచ్చాక మీరు జరుపుకుంటున్న ఫస్ట్ సంక్రాంతి. సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేశారు? ఈరోజు (శుక్రవారం) అందరం స్టూడియోలోనే కలిశాం. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 42 ఇయర్స్ అయింది. వర్కర్స్ అందరికీ భోజనాలు పెట్టింది సమంత. మేమంతా కలసి భోజనం చేశాం. ఆ సమయంలో ఏవేవో జోక్స్. సమంత అయితే ‘మై హస్బెండ్ ఈజ్ ది బెస్ట్’ అంది. అంతే.. మేమంతా షాక్ (నవ్వుతూ). అంటే.. మేమందరం మా భార్యలకు మంచి హస్బెండ్స్ కాదా? అనడిగాం. ‘లేదు.. లేదు.. మై హస్బెండ్ ఈజ్ ది బెస్టెస్ట్’ అంది. ఆ విధంగా మా అందర్నీ ఆటపట్టించింది. ►చిన్నప్పుడు గాలి పటాలు ఎగరేశారా? ఏవైనా మెమరీస్ ఉంటే చెబుతారా? సంక్రాంతి అంటే అదే పని మీద ఉండేవాళ్లం. ఫ్రెండ్స్‌తో కలిసి తెగ తిరిగేవాణ్ణి. హైదరాబాద్ కదా.. ఇక్కడ హడావిడి ఇంకా ఎక్కువ. చింతల్ బస్తీలో ఫ్రెండ్స్‌తో కలిసి గాలిపటాలు ఎగరేసేవాణ్ణి. కైట్స్, మాంజా తెగ కొనేవాళ్లం. వాటితో పాటు డప్పులు కూడా కొనేవాళ్లం. మేం ఎవరిదైనా కైట్‌ని కట్ చేస్తే.. వెంటనే డప్పులు కొట్టి, డ్యాన్స్ చేసేవాళ్లం. చింతల్ బస్తీ ఏరియా అంతా గోల గోల చేసేవాళ్లం. అప్పట్లో ఉన్నంత సందడి ఇప్పుడు లేదేమో అనిపిస్తోంది. ఎక్కడ? ఒక్క కైట్ కూడా కనిపించడంలేదు (పైకి చూస్తూ). నన్ను చూసి నవ్వుకుంటే చాలు – ప్రియదర్శి సంక్రాంతి పండగ అంటే చాలు.. ‘ఆ బిల్డింగ్ ఎక్కొద్దు.. ఈ బిల్డింగ్ ఎక్కొద్దు’ అని రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు మా నాన్నగారు. మేం ఎక్కడ పడిపోతామో అని ఆయన భయం. చిన్నప్పుడు ఓల్డ్‌సిటీలో ఉన్నప్పుడు పెద్దవాళ్లందరూ ఓ బ్యాచ్. చిన్నవాళ్లందరూ ఇంకో బ్యాచ్ అన్నమాట. పెద్దవాళ్లతో పోటీ పడి గాలిపటాలు ఎగరేసేవాళ్లం. నాకు ఊహ తెలిసిన దగర్నుంచి సినిమా అంటే ప్రేమ. స్క్రీన్ మీద నన్ను చూసి ప్రేక్షకులు కొన్నిసార్లయినా నవ్వుకుని, నన్ను గుర్తుతెచ్చుకుంటే అదే చాలని కోరుకుంటున్నాను. ఫామ్‌లోకి రాకముందు, వచ్చిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటి? అంటే... ‘మంచి బట్టలు వేసుకుంటున్నానండి. ఇదిగో నా హెయిర్ ఇలా బాగా సెట్ చేసుకున్నాను. అదే మార్పు’ (నవ్వేస్తూ). దారం అందిస్తే రెచ్చిపోయేవాణ్ణి – రాజ్ తరుణ్ నేను ఎనిమిదో క్లాస్‌లో ఉన్నప్పుడు సంక్రాంతి మూడు రోజులూ సినిమాలు చూసేవాణ్ణి. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లేవాళ్లం. మాములుగా అయితే సంక్రాంతి పండక్కి ఊరు వెళ్లేవాణ్ణి. కానీ, ఈరోజు నా సినిమా ‘రంగుల రాట్నం’ రిలీజ్ ఉంది కదా. అందుకే ఇక్కడే ఉంటున్నా. చిన్నప్పుడు నేను గాలిపటాలు బాగా ఎగరేసేవాణ్ణి. కానీ స్టార్టింగ్ ప్లాబ్లమ్. అంటే.. మా అన్నయ్య గానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కొంచెం దూరం ఎగరేసి ఆ తర్వాత దారం అందిస్తే నేను రెచ్చిపోయేవాణ్ణి. సంక్రాంతి అంటే మనకు ఉన్న అతి పెద్ద ఫెస్టివల్. ఇంత పెద్ద ఫెస్టివల్‌కి నా సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి అంటే ‘తిల్ లడ్డూ’ ఉండాల్సిందే – చిత్రా శుక్లా మా ఊరు ఇండోర్‌లో సంక్రాంతి అంటే.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను పుట్టింటికి పిలుస్తారు. స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తారు. ఆ కొత్త జంటతో కలిసి ఇంట్లోవాళ్లందరం గాలిపటాలు ఎగరేస్తారు. ‘తిల్ లడ్డూ’ (నువ్వుల లడ్డూ) కంపల్సరీగా చేస్తాం. అది లేకపోతే సంక్రాంతి లేనట్లే. మేం సూర్య భగవాన్ని పూజిస్తాం. చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాం. ఈ సంక్రాంతి స్పెషల్ ఏంటంటే... హీరోయిన్గా నా సెకండ్ మూవీ (రంగుల రాట్నం) సంక్రాంతికి విడుదలవుతోంది. నేను, మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాం. నేను తెలుగు పరిశ్రమలో పని చేస్తున్నందుకు, రెండో సినిమానే అన్నపూర్ణ బ్యానర్లో చేసినందుకు వెరీ హ్యాపీ. చిన్నప్పుడు చాలా సార్లు రంగుల రాట్నం ఎక్కాను. ఇప్పుడు కుడా చాన్స్ దొరికితే ఎక్కేస్తాను. రంగుల రాట్నం ఎక్కినప్పుడు నవ్వుతాం, భయపడతాం, అరుస్తాం, కేరింతలు కొడతాం.. అన్ని రకాల ఎమోషన్స్ కలుగతాయి.. మన జీవితంలానే. మావయ్య ఇంట్లో సంక్రాంతి – సాయిధరమ్ తేజ్ సంక్రాంతి అనగానే మేము మా పెద్ద మావయ్య (చిరంజీవి) ఇంట్లో కలిసి అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. కజిన్స్ అందరం కలిసి బాగా సరదాగా టైమ్ స్పెండ్ చేస్తాం. భోగి రోజు మా అమ్మమ్మవాళ్ల ఇంట్లో పాత ఫర్నిచర్‌తో భోగి మంట వేస్తాం. బ్రేక్పాస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి సినిమాలకు వెళతాం లేదా సరదాగా క్రికెట్ ఆడతాం. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ప్రొసీడ్ అవుతాం. ఒక్కోసారి ఏదైనా అవుటింగ్ ప్లాన్ చేస్తాం. చిన్నప్పుడు సంక్రాంతికి ఫ్రెండ్స్‌తో కలిసి గాలిపటాలు ఎగరేసేవాణ్ణి. కాలేజ్ డేస్‌లో అయితే ఫుల్ జోష్ అన్నమాట. స్కూలింగ్ టైమ్ అప్పుడు మేము, మా బాబాయిలు, కజిన్స్ అందరం మా అమ్మమ్మ ఇంటి మేడపై గాలిపటాలు ఎగరేసేవాళ్లం. రైతులు బాగుండాలి కేరళలో సంక్రాంతి లేదు. మకర సంక్రాంతి రోజు మకర జ్యోతిని టీవీలో లైవ్ టెలీకాస్ట్ చూడటం తప్ప పండగ విశేషం ఏం లేదనుకునేదాన్ని. రాజీవ్‌తో పెళ్లయ్యాక ఇక్కడి పండగలు చేసుకోవటం అలవాటైంది. సంక్రాంతి ఎంత పెద్ద పండగో తెలిసింది. అప్పట్లో పండగలంటే తెల్లవారుజామున రంగు రంగుల ముగ్గులు వేయడం, పిండి వంటలు చేయడం చూసేదాన్ని. ఇప్పుడు అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాక సంక్రాంతి వస్తుంది అన్న ఎగై్జట్ మెంట్ లేదు. అందుకే కొంతమంది ఊరికి వెళుతున్నారు. గాలిపటాలు ఎగరేయటం, మాంజాలు కాట్ చేయటం ఇవన్నీ తెలుసు. సంక్రాంతి అంటే రైతుల పండగ. వాళ్ల చేతికి పంట వస్తుంది. డబ్బులు వస్తాయి. వాళ్లు బావుంటే అందరం బాగుంటాం. -
‘రంగుల రాట్నం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
అబ్బాయిలు.. అమ్మాయిలు కనెక్ట్ అవుతారు – రాజ్ తరుణ్
‘‘అందరికీ కనెక్ట్ అయ్యే కథ ‘రంగులరాట్నం’. లవ్ స్టోరీతో పాటు చిన్న చిన్న ఎమోషన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని హీరో రాజ్‌తరుణ్ అన్నారు. రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా జంటగా శ్రీ రంజని దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘రంగులరాట్నం’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ పంచుకున్న విశేషాలు. ► అన్నపూర్ణ వంటి పెద్ద బ్యానర్లో ‘ఉయ్యాల జంపాల’ తర్వాత రెండో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను తప్ప ఈ చిత్రంలో నటించిన వారందరూ దాదాపు కొత్తవారే. అయినా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ► ఈ చిత్రంలో నాది ఓ మధ్యతరగతి అబ్బాయి పాత్ర. బాధ్యతలు తక్కువగా ఉంటాయి. నా లుక్ ఈ సినిమాలో సహజంగా ఉంటుంది. అందరిలా సరదాగా కనిపిస్తాను. అబ్బాయిలకు, అమ్మాయిలకు ఈ సినిమా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ పాయింట్ నచ్చి ఈ సినిమా చేశా. ► జీవితం రంగులరాట్నంలా తిరుగుతుంటుంది. మా సినిమాలో హీరో జీవితం కూడా అంతే. కథకు తగ్గ టైటిల్ అని ‘రంగులరాట్నం’ అని పెట్టాం. సినిమా చూశా. చాలా బాగుంది. చూస్తున్నంతసేపు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ► శ్రీ రంజనిగారు సెల్వరాఘవన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. లేడీ డైరెక్టర్ అయినా అబ్బాయి మనస్తత్వం బాగా అర్థం చేసుకొని ఈ సినిమా తెరకెక్కించారు. తనకు కావాల్సింది బాగా రాబట్టుకున్నారు. ► ప్రతి ఏడాది సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. మా సినిమా వేరే చిత్రాలకు పోటీ అనుకోను. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా మాది. సెన్సార్ పూర్తి కాగానే విడుదల తేదీ ప్రకటిస్తాం. -
‘రంగుల రాట్నం’ మూవీ స్టిల్స్
-
అప్పుడు ఉయ్యాల ఇప్పుడు రంగుల రాట్నం
మాస్‌కి ఈజీగా నచ్చేసే కుర్రాడు రాజ్ తరుణ్. మొదటి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్‌ని హీరోగా పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ మళ్లీ అతనితో ఓ సినిమా నిర్మించింది. ‘రంగుల రాట్నం’ పేరుతో శ్రీ రంజని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిత్రా శుక్లా హీరోయిన్. షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. సితార, ప్రియదర్శి ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: ఎల్.కె. విజయ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్. -
సంక్రాంతి బరిలో నాగార్జున..!
పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జై సింహా’ సినిమాలు బరిలో ఉన్నా.. నాగార్జున పోటికి రెడీ అవుతున్నారు. అయితే నాగార్జున బరిలో దిగుతోంది.. హీరోగా కాదు, నిర్మాతగా సంక్రాంతి రేసుకు సై అంటున్నారు కింగ్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా మారిన రాజ్ తరుణ్ మరోసారి అదే బ్యానర్ లో రంగుల రాట్నం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ సరసన చిత్రా శుక్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. -
గిర్రు.. గిర్రున...
ముద్దుల కూతురు ఆరాధ్యా బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్ రంగుల రాట్నంలో గిర్రున తిరిగారు. తల్లీకూతుళ్లిద్దరూ హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. భార్య, కూతురు ఎంజాయ్ చేస్తోంటే అభిషేక్ బచ్చన్ ఆనందపడిపోయారు. ఇటీవల ఆరాధ్య బర్త్‌డే జరిగింది. పార్టీలో పాల్గొనే పిల్లల ఎంజాయ్మెంట్ కోసం అభిషేక్ రంగుల రాట్నం తెప్పించారు. మరి.... జెయింట్ వీల్ అంటే భయమో? ఏమో? అభిషేక్ మాత్రం ఎక్కలేదు. -
అఖిల్ కోసం కలర్‌ఫుల్ టైటిల్..!
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, తన రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టిన సిసింధ్రీ సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. ఇంకా హీరోయిన్ ఫైనల్ కాకపోయినా అఖిల్ పార్ట్ ను మాత్రం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అక్కినేని నాగార్జున ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ సారి ఎలాగైన అఖిల్ కు బిగ్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు నాగ్. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు జున్ను అనే టైటిల్ ను నిర్ణయించారన్న ప్రచారం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ అవ్వటంతో అది అఖిల్ సినిమా కోసమే అని ఫిక్స్ అయ్యారు. తాజాగా అదే బ్యానర్ రంగుల రాట్నం అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారట. దీంతో అఖిల్ సినిమా టైటిల్ ఇదే అంటూ కొత్త టాక్ మొదలైంది. ఇంత వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. అఖిల్ కొత్త సినిమా వార్తల్లో గట్టిగానే వినిపిస్తుంది. అఖిల్ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకుంటునే రాజుగారి గది 2 సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాగ్. -
నలభై ఆరేళ్ల తర్వాత తెలుగులో...
బాలీవుడ్ అలనాటి అందాల తార రేఖ దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. 1966లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగుల రాట్నం’ చిత్రంతో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు రేఖ. ఆ చిత్రం విడుదలైన నాలుగేళ్ల తర్వాత 1970లో వచ్చిన ‘అమ్మ కోసం’ చిత్రంలో కృష్ణంరాజు సరసన నటించారామె. ఆ తర్వాత ఆమె దక్షిణాదిని వదిలి, హిందీ చిత్రసీమకు తరలివెళ్లారు. అందం, అభినయంతో అక్కడ తిరుగులేని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి రేఖ చాలా విరామం తరువాత తెలుగులో నటించనుండడం సహజంగానే ఆసక్తికరంగా మారింది. కథానాయిక పూర్ణ లీడ్ రోల్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో చాలా విరామం తర్వాత రేఖ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న పూర్ణ, నూతన దర్శకుడు సూర్యతో ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయనున్నారు. మూడు తరాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. అందులో ఓ తరం పాత్రలో రేఖ నటిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్. అయితే, రేఖ ఈ చిత్రంలో ఏ పాత్రలో కనిపిస్తారన్నది సస్పెన్స్. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకులను రేఖ మరోసారి అలరించనున్నారు. -
ఇంతేరా ఈ జీవితం... తిరిగే రంగుల రాట్నం!
పాటతత్వం ఇంతేరా ఈ జీవితం... తిరిగే రంగుల రాట్నం! కొన్ని పాటలు ఇలా వినిపించి అలా మాయమవుతుంటాయి. కొన్ని పాటలు మాత్రం కాలాతీతంగా నిలుస్తాయి. కాలంతో పాటు నడుస్తాయి. ఆ పాటల్లోని తాత్వికత ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త చూపును ఇస్తూనే ఉంటుంది. బి.యన్.రెడ్డి దర్శకత్వంలో 1966లో వచ్చిన ‘రంగుల రాట్నం’ చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాలో శ్రీరామ వెంకట భుజంగరాయశర్మ రాసిన ‘కలిమి నిలవదు లేమి మిగలదు’ నాకు చాలా ఇష్టమైన పాట. సినిమాలో ఇది నేపథ్య గీతంగా వస్తుంది. ‘భారతదేశానికి పట్టుకొమ్మలైన పల్లెసీమలు. సిరిసంపదలు, పచ్చిక బయళ్లతో కళకళలాడిన పల్లెలు. ప్రజలు ఒళ్లు వంచి కష్టపడి ఉన్నదానితో సంతృప్తికరంగా జీవించిన కాలం’....ఈ పరిస్థితి మారిపోయి కష్టపడేవారు ఒక్కరై, ఖర్చు చేసేవారు పదిమందై, వసతులు తక్కువై, కష్టం ఎక్కువై, వ్యవసాయంపై ఆసక్తి తగ్గి ఆస్తికి మించిన అప్పులు పెరిగాయి. సరిగ్గా ఇలాంటి కాలంలో... బాగా బతికి పల్లె నుంచి పట్నానికి వెళ్లిన ఒక కుటుంబ కథ ఈ చిత్రం. ఈ పాట సినిమా కథలో అంతర్లీనమైనట్టు కనిపించినా...లోకరీతిని స్పష్టంగా అక్షరాల్లో చెబుతుంది. ఈ సినిమాలో బాగా బతికిన ఒక కుటుంబం, ఆతిథ్యానికి మారు పేరుగా నిలిచిన కుటుంబం అప్పుల పాలవుతుంది. ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతాయి. ‘ఈ లోకంలో ఏది శాశ్వతం?’ అనే ప్రశ్న ఈ పాట పల్లవిలో ఇలా ప్రతిధ్వనిస్తుంది... ‘కలిమి నిలవదు లేమి మిగలదు కల కాలం ఒక రీతి గడవదు నవ్విన కళ్లే చెమ్మగిల్లవా? ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం’ దారులు అనేకంగా కనిపిస్తాయి. అయితే వాటి గమ్యం ఒకటే. పేదవాళ్లుగా, ధనవంతులుగా మనుషులు రకరకాలుగా కనిపిస్తారు. అయినా అందరొకటే. పేదవాళ్లు అయినంత మాత్రాన....వారి నరాల్లో నెత్తురు, డబ్బు బాగా ఉంది కాబట్టి ... ధనవంతుల నరాల్లో అమృతం ప్రవహించదు. గమ్యం చేరడానికి పేదవాడు తన రెండు కాళ్లను నమ్ముకున్నా, ధనవంతుడు ఖరీదైన కారుని నమ్ముకున్నా...చనిపోయాక ఇద్దరూ వెళ్లేది పాడె పైనే. ఈ సత్యం ఈ చరణాల్లో కనిపిస్తుంది. ‘ఏనుగుపైన నవాబు పల్లకిలోని షరాబు గుర్రం మీద జనాబు గాడిదపైన గరీబు నడిచే దారుల గమ్యమొకటే నడిపే వానికి అందరొకటే’ ఇద్దరు అన్నదమ్ములు. సూర్యం, వాసు. చిన్నోడు వాసు(చంద్రమోహన్) త్యాగం చేసి కష్టపడి పెద్దోడు సూర్యం(రామ్మోహన్)ని చదివిస్తాడు. పెద్దోడు లాయర్ అవుతాడు. ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొంత కాలానికే తాను నడిచొచ్చిన దారిని మరిచిపోతాడు. డబ్బున్న పెళ్లాం ముందు...పేద తల్లి, పేద తమ్ముడు, పేద చెల్లి... మరింత పేదగా కనిపిస్తారు. ఇక ఆయన శ్రీమతి గురించి అయితే చెప్పక్కర్లేదు. అత్త, మరుదులను ఆమె చీదరించుకుంటుంది. వాళ్లను దూరంగా పెట్టడమే నాగరికం అనుకుంటుంది. అందుకే తమ్ముడు ఒక సందర్భంలో అన్నను ఉద్దేశించి ఇలా అంటాడు... ‘‘సీతమ్మ కొడుకు కాదు... వనజ మొగుడు’’ ఈ పరిస్థితి చరణాల్లో ఇలా వ్యక్తం అవుతుంది... ‘త్యాగం ఒకరిది ఫలితం ఒకరిది అమ్మ ప్రాణమా ఇద్దరిది ఎదలు, బాధలు, కష్టగాథలు... చివరకు కంచికి వెళ్లే కథలే’ ఒకరి బాధ... ఇంకొకరి బాధ కాకపోవచ్చు. ఆ బాధ అవతలి వ్యక్తికి సంతోషం కూడా కలిగించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కవి ఇలా అంటారు... ‘ఇరుగింటిలోన ఖేదం పొరుగింటిలోన ప్రమోదం’ ఎవరికి ఏదో అయిందని కాలం ఒక దగ్గర ఆగదు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా దిగులుగా ఒక దగ్గర కూర్చోదు. ఈ వాస్తవం... ‘ఎవరు కులికినా ఎవరు కుమిలినా ఆగదు కాలం ఆగదు జీవనవాహిని ఆగదు’ ఈ పాటలో ప్రతి వాక్యం లోకరీతిని వ్యాఖ్యానించే పదాల సమహారం. ఈ పాట విన్నప్పుడల్లా "Life doesn't listen to your logic. It goes on its own way undisturbed' అనే ప్రసిద్ధ వాక్యం గుర్తుకొస్తుంది. -
కన్న తల్లిని కోల్పోయాను: చంద్రమోహన్
తెలుగు తెర సీతమ్మ అంజలీ దేవి మరణం తాను జీర్ణించుకోలేక పోతున్నానని ప్రముఖ నటుడు చంద్రమోహన్ వెల్లడించారు. అంజలీదేవి మరణంతో తన కన్న తల్లిని కోల్పోయానని ఆయన ఆవేదన చెందారు. 1966లో వచ్చిన రంగుల రాట్నం చిత్రంలో అంజలి దేవి, తాను తల్లి కొడుకులుగా నటించామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆనాటి నుంచి అంజలీదేవి తనను కన్న కొడుకులా చూసుకునే వారని, ఆ తర్వాత కాలంలో తమ తల్లికొడుకుల అనుబంధం మరింత పెనవేసుకుందని వివరించారు. చలన చిత్ర సీమలో అంజలీదేవి మకుటం లేని మహారాణి అని అభివర్ణించారు. తనకు ఎక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అక్కడ అంజలీదేవి తప్పకుండా హాజరయ్యేవారని పేర్కొన్నారు. అంజలీ దేవి చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. ఆమె అంత్యక్రియలు గురువారం చెన్నైలో జరుగుతాయి. ఆమె గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.