రిలీజ్ డేట్ ముఖ్యమే
‘‘ప్రతి ఏడాది వందకుపైగా సినిమాలు రిలీజవుతుంటే... 30, 40 సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. మిగతా సినిమాల్లో మంచివి ఉన్నప్పటికీ, పరిస్థితుల కారణంగా ప్రేక్షకులకు చేరువ కావడం లేదు. రిలీజ్ టైమ్ కూడా ఒక్కోసారి రిజల్ట్‌పై ప్రభావం చూపిస్తుంది’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. సూర్య, అనుష్క, శ్రుతీహాసన్ ముఖ్యతారలుగా హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించిన తమిళ చిత్రాన్ని ‘ఎస్3–యముడు3’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారీయన. ఈ నెల 26న వస్తోన్న ఈ సినిమా గురించి మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ‘‘డిసెంబర్ 16న రిలీజ్ కావాల్సిన సినిమా ఇది.
డీమానిటైజేషన్, చెన్నైలో తుఫాన్, ఇతర కారణాలతో వాయిదా పడి ఈ 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. నాకు ప్రతి సినిమాని ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అలవాటు. ఇటీవలే ‘ఎస్3’ ఫస్ట్ కాపీ చూశా. మా సంస్థ నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ తర్వాత అంత సంతృప్తినిచ్చిన చిత్రమిదే. రాజకీయ నేపథ్యం గల ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్‌ని నరసింహం ఎలా పట్టుకున్నాడనేది చిత్రకథ. వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్ నరసింహంగా సూర్య అద్భుతంగా నటించారు.
తమిళ చిత్రమైనా.. తెలుగు నేటివిటీతో కూడిన చిత్రమిది. 60 శాతం చిత్రాన్ని విశాఖలోనే తీశారు. ‘సింగం’ సిరీస్‌లో వచ్చిన ‘యముడు’, ‘సింగం’ చిత్రాలను మించిన యాక్షన్, ఎమోషన్ ‘ఎస్3’లో ఉన్నాయి. సూర్యగారు ఛాన్స్ ఇస్తే ఆయనతో స్ట్రయిట్ తెలుగు సినిమా తీయాలనుంది. ప్రస్తుతం వేరే హీరోలతో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం’’ అన్నారు.