‘దిల్’ రాజు టీచర్.. రెమోని పాస్ చేస్తారు!
‘‘నిర్మాతగా 25వ చిత్రం చేస్తున్నాను. ఇప్పటివరకూ ఒక్క రీమేక్ కూడా నిర్మించలేదు. ‘రెమో’ తమిళ ట్రైలర్ చూసి రీమేక్ చేయాలనిపించింది. తమిళ నిర్మాత రాజాగారు ‘రెమో’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను మా సంస్థ ద్వారా విడుదల చేయమని అడగ్గానే అంగీకరించాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శివ కార్తికేయన్, కీర్తీ సురేశ్ జంటగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఆర్.డి.రాజా నిర్మించిన తమిళ చిత్రం ‘రెమో’ తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది. ఆర్.డి.రాజా సమర్పణలో ‘దిల్’ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ - ‘‘రాజుగారు నిర్మించిన ‘బొమ్మరిల్లు’ చాలా ఇష్టం. ఆయన సంస్థ ద్వారా తెలుగులోకి పరిచయం కావడం ఎగ్జయిటింగ్‌గా, ఓ ఎగ్జామ్‌లా ఉంది.
‘దిల్’ రాజు వంటి నిర్మాత ఇక్కడ టీచర్‌గా ఉన్నప్పుడు, ‘రెమో’ ఎగ్జామ్ పాసవుతాడాని ఆశిసున్నా’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో హీరో అద్భుతంగా నటించాడు. పీసీ శ్రీరామ్ కెమేరా వర్క్, అనిరుధ్ సంగీతం ప్లస్ పాయింట్స్. తమిళంలో సుమారు 70 కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. ‘వైశాలి’, ‘ఓకే బంగారం’ తర్వాత మా సంస్థ ద్వారా విడుదల చేస్తోన్న మూడో డబ్బింగ్ చిత్రమిది. హ్యాట్రిక్ కొడతాం’’ అన్నారు. ‘‘తెలుగు, తమిళ సినిమాలు నాకు రెండు కళ్లు’’ అన్నారు పీసీ శ్రీరామ్. సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బక్కియరాజ్ కన్నన్ పాల్గొన్నారు.