
‘‘హేమలతా లవణంగారంటే నాకు చాలా గౌరవం. తెరపై ఆమె పాత్ర చేయడం నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా’’ అన్నారు రేణూ దేశాయ్. ‘బద్రి’తో తెలుగు తెరపై కనిపించి, ఆ తర్వాత ‘జానీ’లో చేసిన రేణు నటనకి బ్రేక్ ఇచ్చి, నిర్మాతగా, క్యాస్టూమ్ డిజైనర్‌గా, ఎడిటర్‌గా, డైరెక్టర్‌గా, చేశారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆమె తెలుగు పరిశ్రమకు రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నా.
ఇందులో నేను హేమలతా లవణంగారి పాత్రలో కనిపిస్తాను’’ అని రేణు తెలిపారు. హేమలతా లవణం గురించి చెప్పాలంటే.. ఆమె సామాజిక కార్యకర్త, నాస్తికురాలు, అంటరానితనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారామె. ‘‘ఇలాంటి శక్తిమంతమైన పాత్ర ద్వారా తెలుగుకి రీ–ఎంట్రీ ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉందని, త్వరలో మరిన్ని విశేషాలు చెబుతాను’’ అని రేణు అన్నారు.