హైదరాబాద్ : సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే రామ్‌గోపాల్ వర్మ కరోనా టైంలోనే వరుసగా సినిమాలు నిర్మిస్తూ దూసుకెళుతున్నారు. ఒకప్పుడు హారర్ సినిమాలకు కేరాఫ్‌గా ఉన్న వర్మ రాత్రి, దెయ్యం, భూత్ వంటి సినిమాలను తెరకెక్కించి మెప్పించారు. కొంతకాలంగా ఈ జానర్‌కు దూరంగా ఉంటున్న వర్మ తాజాగా 12'0' క్లాక్ అనే హారర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి 1 నిమిషం 47 సెకన్ల నిడివి గల ట్రైలర్‌ను కాసేపటి క్రితమే వర్మ తన యూట్యూబ్ చానెల్‌లో విడుదల చేశారు. సైన్స్‌కు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా అనే అంశాన్ని ముడిపెడుతూ ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే ఆసక్తిగా చూపించారు. (ఆర్జీవీ అదిరిపోయే సమాధానం)
వరుసగా షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న వర్మ నుంచి చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ హారర్ సినిమా వస్తుండడం విశేషం. 12'0' క్లాక్ నిడివి గంటా 45 నిమిషాలుగా ఉంది. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి చాలా కాలం తరువాత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అంతకుముందు వర్మ దర్శకత్వంలో వెంకీ హీరోగా తెరకెక్కిన క్షణక్షణం సినిమాకు కీరవాణి సంగీతం అందించడం విశేషం. మళ్లీ 29 ఏళ్ల తరువాత కీరవాణి వర్మ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమాలో దండుపాళ్యం ఫేమ్ మకర్‌దేశ్ పాండే, మిథున్ చక్రవర్తి, ఆశిష్ విద్యార్థి, దిలీప్ తాహిల్, మానవ్ కౌల్, అలీ అజగర్, కొత్త నటుడు కృష్ట గౌతమ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అమోల్ రాథోడ్ అందించారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసే అంశాన్ని వర్మ పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment