రోబో ప్రేయసి | robo2 movie villain replaced ? | Sakshi

రోబో ప్రేయసి

Published Tue, Dec 15 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

రోబో ప్రేయసి

రోబో ప్రేయసి

విలన్‌గా ఆర్నాల్డ్ ష్వార్జెనగర్ లేనట్టే!

 దర్శకుడు శంకర్ - సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ల కొత్త సినిమా ‘రోబో-2’ (తమిళంలో ‘యంతిరన్-2’) మొదలైపోయింది. చెన్నైలో తుపాను బీభత్సం దృష్ట్యా మొన్న డిసెంబర్ 12న రజనీకాంత్ తన పుట్టినరోజైతే జరుపుకోలేదు కానీ, రోబో సీక్వెల్ షూటింగ్ మాత్రం లాంఛనంగా మొదలుపెట్టేశారు. ఆ మధ్య విక్రమ్‌తో శంకర్ తీసిన ‘ఐ’ సినిమా ఫేమ్ ఎమీ జాక్సనే ఈ సినిమాకూ హీరోయిన్. ఆమె ఈ చిత్రంలో రోబోగా నటిస్తున్నారు. రోబో లాంటి కాస్ట్యూమ్స్‌తో, ఆమె షూటింగ్‌లో పాల్గొన్నట్లు ఆంతరంగిక వర్గాలు తెలిపాయి. ‘‘గతంలో వచ్చిన ‘రోబో’ సినిమాలో చిట్టి అనే మరమనిషి పాత్రను రజనీకాంత్ పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సీక్వెల్‌లో ఆ చిట్టికి జంటగా ఎమీ జాక్సన్ కనిపిస్తారు’’ అని విశ్వసనీయ వర్గాల కథనం.
 
 అన్నట్లు ఈ చిత్రంలో మరో కథానాయికా ఉంటుంది. ఆ పాత్రకి ఒక హిందీ నటితో చర్చలు జరుపుతున్నారు. ఇది ఇలా ఉండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌ను ‘రోబో-2’లో విలన్‌గా నటింపజేయాలని చేసిన ప్రయత్నం అటకెక్కినట్లే కనిపిస్తోంది. అనేక కారణాల వల్ల ఆర్నాల్డ్‌తో ఈ సినిమాకు ఒప్పందం కుదరలేదట! ఆర్నాల్డ్‌కు దాదాపు రూ. 120 కోట్ల మేర భారీ పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం కుదరకపోవడానికి ఇదే ప్రధాన కారణమని కోడంబాకమ్ వర్గాల కథనం. ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఇప్పటికే ఆలస్యమవుతుండడంతో, ఆర్నాల్డ్ వ్యవహారం ఇక పక్కనపెట్టి, విలన్ పాత్రకు ఒక హిందీ నటుణ్ణి ఎంచుకోవాలని దర్శకుడు శంకర్ బృందం నిర్ణయించుకుంది.
 
  కాగా, లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్‌ను సంప్రతించారు. అతను ఓ.కె. చెప్పారట. అతనే విలన్ పాత్రధారి కావచ్చని భోగట్టా. షూటింగ్ మొదలైంది కాబట్టి, ‘రోబో-2’ గురించి రాగల కొన్ని నెలల పాటు బోలెడన్ని కబుర్లు ఖాయం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement