
కొందరు పెద్దలకు ఇదో గుణపాఠం: రోజా
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయినందుకు ప్రముఖ నటి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు చిత్రపరిశ్రమలోని కొందరు పెద్దలకు గుణపాఠమని రోజా అన్నారు. పేదకళాకారుడు తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. డబ్బున్న వారి మాటే చెలామణి అవుతుందని గర్వించవారికి తగిన శాస్తి జరిగిందని చెప్పారు.
గతంలో కొందరు గౌరవం కోసం 'మా' అధ్యక్ష పదవి వాడుకున్నారని రోజా విమర్శించారు. వారు కళాకారులకు ఏమీ చేయలేదని అన్నారు. మా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికకావడం సంతోషంగా ఉందని, ఆయన కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.