
సంచలన విజయం సాధించిన ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఈ యంగ్ హీరోతో కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి యస్.థాను సినిమా చేస్తున్నారు. తుపాకి, కబాలి, వేలై ఇల్లా పట్టదారి2, స్కెచ్ లాంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ప్రస్తుతం థాను కార్తికేయ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘హిప్పీ’ అనే టైటిల్ ఫైనల్ చేశారు.
రేపు (శుక్రవారం) కార్తికేయ పుట్టినరోజు జరుపుకోనుండటంతో ఒక రోజు ముందుగానే ‘హిప్పీ’ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శ కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ ‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. కార్తికేయ తన తొలి చిత్రానికి భిన్నంగా కనిపిస్తారు. ఇంకా హీరోయిన్లను ఫైనల్ చేయాల్సి ఉంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే సినిమా. మన జీవితంలో నిత్యం జరిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబర్ నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ఉంటుంద’ని తెలిపారు.
నిర్మాత కలైపులి యస్.థాను మాట్లాడుతూ ‘తెలుగులో నేరుగా సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. కార్తికేయ ‘ఆర్‌ఎక్స్ 100’ చూశాను. ప్రెజెంట్ ట్రెండ్‌కి తగ్గ హీరో అనిపించింది. ఆయనతో ‘హిప్పీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఎక్కడా బడ్జెట్‌కు వెనకాడకుండా భారీగా రూపొందిస్తాం’ అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘ఆర్‌ఎక్స్ 100 తర్వాత ఓ పెద్ద సంస్థలో అవకాశం రావడం నా అదృష్టం. కథ చాలా బావుంది. నిత్యం మన జీవితంలో జరిగే అంశాలను తెరపై చూడొచ్చు. తొలి సినిమా ఇచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేసే సినిమా అవుతుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment