
మంచి లవ్‌స్టోరీతో వస్తున్నాం
అభిలాష’, ‘ఛాలెంజ్’, ‘స్వర్ణకమలం’, ‘చంటి’, ‘క్రిమినల్’, ‘మాతృదేవోభవ’... ఇరవై, ముప్ఫై ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే.
– నిర్మాత కేఎస్ రామారావు
అభిలాష’, ‘ఛాలెంజ్’, ‘స్వర్ణకమలం’, ‘చంటి’, ‘క్రిమినల్’, ‘మాతృదేవోభవ’... ఇరవై, ముప్ఫై ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఇలాంటి హిట్స్ ఎన్నో తీసిన కె.ఎస్ రామారావు నేటి తరం హీరోలు ఎన్టీఆర్‌తో ‘దమ్ము’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్, శర్వానంద్‌తో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి లవ్‌స్టోరీ తీశారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ‘తొలి ప్రేమ’ ఫేమ్ ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీకి శ్రీకారం చుట్టారు. కె.ఎస్. రామారావు, కె.ఎ. వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో జరిగింది.
కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘మా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ స్థాపించి 35 ఏళ్లయింది. ఇది మాకు 45వ సినిమా. కరుణాకరన్ చెప్పిన కథ నచ్చి, రామారావుగారు నిర్మాత అయితే బాగుంటుందని నన్ను కలిసి, ఈ సినిమా స్టార్ట్ అయ్యేలా చేసిన తేజూ (సాయిధరమ్ తేజ్)కి థ్యాంక్స్. అందమైన సినిమాలు తీసే కరుణాకరన్‌గారితో మంచి లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఆనందంగా ఉంది. కరుణాకరన్‌తో రైటర్ ‘డార్లింగ్’ స్వామి మంచి సినిమాలు చేశారు. గోపీసుందర్ మంచి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మంచి టీమ్ కుదిరింది.
కరుణాకరన్‌గారు ఎంతమంచి సినిమా తీద్దామనుకుంటే అంత మంచి ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే దమ్మూ, ధైర్యం ఉన్న నిర్మాతను. ఈ దసరాకు షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సాయిధరమ్ మాట్లాడుతూ– ‘‘కరుణాకరన్ నాకోసమే ఈ కథ రాశారేమో అనిపిస్తోంది. కె.ఎస్. రామారావుగారితో ఏడాదిగా చేయాలను కుంటున్న ప్రాజెక్ట్ ఇప్పటికి కుదరడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్యూర్ కలర్‌ఫుల్ అండ్ రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు కరుణాకరన్. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి మాటలు: ‘డార్లింగ్’ స్వామి, కెమెరా: ఆండ్రూ, ఆర్ట్: సురేశ్, ఎడిటింగ్: ఎస్.ఆర్ శేఖర్.