‘దేశభక్తి అనేది కిరీటం కాదు... కృతజ్ఞత’ అనే థీమ్‌తో తెరకెక్కిన సినిమా ‘జవాన్’. ఇంటికొక్కడు... అనేది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి బీవీఎస్ రవి దర్శకుడు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీవీఎస్ రవి మాట్లాడుతూ– ‘‘దేశానికి రక్షణగా జవానులు ఉంటారు. అలాగే, ప్రతి ఇంటికీ జవాన్ ఉండాలి, ఉంటాడు కూడా! దేశంలోని తన ఇంటినీ, ఇంట్లోవారినీ తన గుండెల్లో పెట్టుకుని బాధ్యతతో మా జవాన్ కాపాడుకుంటాడు.
అందుకే, ‘కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది’ అని టీజర్‌లో చెప్పాం. అలాగే, ‘దేశభక్తి అనేది కిరీటం కాదు... కృతజ్ఞత’ డైలాగ్. ఇవి విన్నవాళ్లు ఫోనులు చేసి ‘మనసు పెట్టి రాశావ్’ అని ప్రశంసించారు. నిజంగానే ఈ డైలాగులు, కథను మనసుపెట్టి రాశాను. మనసుపెట్టి సినిమాను తీశాను. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్’’ అన్నారు. డిసెంబర్ 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రసమర్పకుడు ‘దిల్’ రాజు, నిర్మాత కృష్ణ తెలిపారు.
‘జవాన్’లో రాశీ ఖన్నా బంగారు:
హీరోయిన్‌గా వరుస హిట్స్‌లో ఉన్న రాశీ ఖన్నా... సింగర్‌గానూ జోరు చూపిస్తున్నారు. ‘జోరు’తో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. రీసెంట్‌గా రెండు సినిమాల్లో పాటలు పాడారు. అయితే... రెండిటిలోనూ హీరోయిన్ ఆమె కాదు. నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’లో ఓ పాట పాడారు. శుక్రవారం ఆ ఆడియో విడుదలైంది. సాయిధరమ్ తేజ్ ‘జవాన్’లో పాడిన పాట త్వరలో విడుదల కానుంది. ‘‘జవాన్’లో మంచి పెప్పీ సాంగ్ పాడడం ఆనందంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు బీవీఎస్ రవిలకు థ్యాంక్స్’’ అని రాశి ట్వీట్ చేశారు. ‘‘వాట్ ఎ టాలెంట్. ‘బంగారు...’ పాటకు రాశి వాయిస్ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఈ పాట విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్నా’’ అని రాశికి తమన్ రిప్లై ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment