
చిరంజీవి ఫోన్‌తో వణుకు
తెనాలి: ఆ సంభాషణలు ప్రాస కోసం పాకులాడవు. పంచ్‌ల పదబంధాల్లోకి వెళ్లవు. సులువుగా అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. సన్నివేశం, సందర్భానికి తగినట్టుగా ప్రేక్షకుల్ని తీసుకెళ్తాయి. యుద్ధ సన్నివేశమైతే తూటాల్లా పేలతాయి. శత్రువుతో మాటల యుద్ధంలో భాస్వరంలా మండి అగ్గిని రగిలిస్తాయి. ప్రేమావిష్కరణలో గిలిగింతలు పెడతాయి. అమ్మ గురించి చెబితే మనసు పొరల్లోంచి ఆర్ద్రత పొంగుకొస్తుంది. జీవన తాత్వికత కొట్టొచ్చినట్టు గోచరిస్తుంది.
సూటిగా, అలవోకగా, మనకు తెలిసిన పదాలతోనే మంత్రముగ్ధులను చేస్తున్న సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా. తెలుగు సినీ పరిశ్రమల్లో మాటలతో మెస్మరైజ్ చేసే రచయితలు చాలామంది ఉన్నా, వర్ధమాన సినీరచయితల్లో స్టార్ రైటర్ ఆయన. సంక్రాంతికి విడుదలైన ఖైదీ నెం.150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు ఆయన సంభాషణలే ప్రాణంపోశాయి. తెనాలిలో పుట్టిపెరిగిన సాయిమాధవ్ ’సాక్షి’తో ఆ అనుభూతులను ఫోన్‌లో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
వణుకొచ్చింది...
శాతకర్ణికి క్లైమాక్స్ సీను రాసిన రెండోరోజే చిరంజీవి నుంచి ఫోన్. ఖైదీ నెంబరు 150కి రాయాలన్నారు. క్లైమాక్స్ సీన్లు రాసినా, చిత్రీకరణ పూర్తయేంత వరకూ అక్కడి జాగ్రఫీ ప్రకారం మార్పులు చేర్పులు చేస్తూనే ఉండాలి. అలాంటి సమయంలో చిరంజీవి గారే పిలిచి సినిమా చేయాలనడంతో వణుకొచ్చింది. ‘వినాయక్ కథ చెప్తారు.. ఎన్ని సీన్లు రాయాలంటే అన్ని రాయండి’ అన్నారు చిరంజీవి. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన సినిమాల్లో ఒక డైలాగ్ రాసినా సంతోషమే కదా? ఓకే అనేశాను. ఒకటి చారిత్రాత్మకం, మరొకటి సామాజికాంశంతో ముడిపడిన ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. రెండు సమాంతరంగా చిత్రీకరించారు.
ఆ విజయానందం అనన్యం
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా. ఈ రెంటికీ నేను రాయడం, అవి అద్భుతమైన విజయాలు సాధించడం ఆనందకరం. సహజంగా ఒకటే ఇండస్ట్రీ హిట్ ఉంటుంది. ఇలా జరిగిందంటే బాబా దయ. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. గాల్లో తేలిపోతున్నట్టుంది.
క్రెడిట్ క్రిష్‌దే..
కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా చేసేటప్పుడే తర్వాత శాతకర్ణి చేద్దామని దర్శకుడు క్రిష్ చెప్పారు. శాతకర్ణి గురించి అందరికీ తెలిసిన మేరకే నాకూ తెలుసు. గొప్ప కథ/చరిత్ర ఉన్నా ఎందుకు వెలుగులోకి రాలేదో తెలీదు. హిందూ శకంలో శాలివాహన శకం అంటాం. ఒక కాలానికి కొలమానంగా చెబుతున్నామంటే గొప్ప చరిత్రే కదా! అందుకే క్రిష్ ఆ చరిత్రను అధ్యయనం చేశారు. తన పరిశోధనను ఏమాత్రం ఆపకుండా లండన్ కూడా వెళ్లొచ్చారు. సంతృప్తిగా వచ్చిందనుకోగానే స్క్రీన్ టు స్క్రీన్ నరేషన్ ఇచ్చారు.
బాలయ్య లేచి నమస్కరించారు
ఖైదీ నెం.150 విడుదల కాగానే చిరంజీవి ఫోన్‌చేసి, ‘మీ వర్క్ చాలా ప్లస్సయింది’ అని చెప్పారు. తర్వాత కలిసినపుడు హగ్ చేసుకుని ‘సినిమాలో మీ సిగ్నేచర్ కనిపిస్తోంది..’ అన్నపుడు ఆనందమేసింది. శాతకర్ణి తర్వాత బాలయ్యబాబు ఎక్కడికెళ్లినా ఆ సినిమా డైలాగులే చెబుతున్నారు. ఒక ఫంక్షన్‌లో వక్తలు మాట్లాడేటప్పుడు నా ప్రస్తావన రాగానే బాలయ్యబాబు లేచి నిలబడి నమస్కారం చేశారు. నాకు భయమేసింది. వెంటనే నేనూ లేచి నమస్కారం పెట్టాను. తర్వాత కూడా మనం పనిచేద్దాం అన్నారాయన.
ఆత్మసంతృప్తే ముఖ్యం
స్టార్ రైటర్, మాటల మాంత్రికుడు.. అని నేను అనుకోవట్లేదు. ఎవరైనా అనుకుంటే ఆనందపడతాను. అలాగని పెద్ద సినిమాలకే రాస్తాననే పరిమితులు విధించుకోను. మంచి కథ, ప్రొడక్షన్‌లో రాసేందుకు అవకాశం ఉందనుకుంటే చిన్న సినిమా అయినా చేస్తాను. రచయితగా ఆత్మసంతృప్తి ముఖ్యం నాకు.
నాటి నుంచి నేటి వరకూ..
మాది కళల నిలయం తెనాలి. అమ్మానాన్న ఇద్దరూ రంగస్థల నటులే. చిన్నప్పుడు అమ్మ నన్నూ నాటకాలకు తీసుకెళ్లేది. ఆరేళ్ల వయసులో ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో లోహితాస్యుడు పాత్రకు ఎవరూ లేక నాకు మేకప్ వేశారు. ధూళిపాళ్ల, డీవీ సుబ్బారావు నటించారా నాటకంలో. ఆరో తరగతిలో స్కూల్‌లో దుర్యోధనుడి ఏకపాత్ర చేశా. చదువుతూనే నాటకాలు చూడటం, వేయడం చేశాను. ‘బ్రోచేవారెవరురా’ నేను రాసిన తొలి నాటకం. ప్రజానాట్యమండలి, అభ్యుదయ కళాసమితి, అభ్యుదయ రచయితల సంఘం నేనూ, నా స్నేహితుడు చెరుకుమల్లి సింగారావు పనిచేశాం. బాధలు, సంతోషాలు కలిసి పంచుకున్నాం.
తెనాలిలో లేకపోతే గుంటూరు దాకా వెళ్లి సినిమాలు చూశాం. బొల్లిముంత శివరామకృష్ణ గురువు. సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేసిన నూతలపాటి సత్యనారాయణ స్క్రిప్టు రాయడం నేర్పారు. సినిమాల్లోకని వచ్చి హైదరా‘బాధలు’ ఎన్నో అనుభవించా. అమ్మను కష్టపెట్టకుండా తొందరగా సినిమా అవకాశాలు రావాలని ప్రయత్నాలు చేశాను. నా తొలి టెలిఫిల్మ్ ‘అభినందన’. సీరియల్ ‘పుత్తడిబొమ్మ’. అప్పుడే దర్శకుడు క్రిష్‌తో పరిచయం ఏర్పడింది.
భవిష్యత్ ప్రణాళికలు
ప్రస్తుతం మహానటి సావిత్రి జీవిత చరిత్రను దర్శకుడు నాగ్‌అశ్విన్ తీస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ను తీసుకున్నారు. జెమినీగణేశన్ పాత్రధారి కోసం అన్వేషిస్తున్నారు. దీంతోపాటు హీరో కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రానికి రాశాను. ఒకటి రెండు రోజుల్లో భారీ సినిమా ఒకటి ఫైనలేజ్ కానుంది. దర్శకుడు క్రిష్‌తో మరో సినిమాకు పనిచేయనున్నా.
సాయిమాధవ్ సంభాషణల్లో కొన్ని..
- ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికీ గదికీ మధ్య గోడలుంటాయి. గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ, ఎవడో వచ్చి నా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లోనే మీకో శ్మశానం నిర్మిస్తాం. మీ మొండేల మీద మా జెండా ఎగరేస్తాం.
- దొరికినవాళ్లని తురుముదాం.. దొరకనివాళ్లని తరుముదాం..
- పట్నాలు పల్లెటూళ్లకు పిల్లలు
- ఓటమిని పరుగెత్తించు.. అది నిన్ను విజయం దాకా తీసుకెళ్తుంది.
- మనమే కాదు బాబూ, మనముండే సోటు బతకాలా.. తోటోడూ బతకాలా..
- నాయకుడంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు, గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు
- గర్భగుడిలో వీధికుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు మైలపడడు