ఏం జరిగినా మన మంచికే: సాయిపల్లవి | Sai Pallavi Rejected Other Commercial Deal that Value Rs 1 Crore | Sakshi
Sakshi News home page

అంతా మన మంచికే 

Published Sat, Nov 23 2019 2:34 PM | Last Updated on Sat, Nov 23 2019 5:12 PM

Sai Pallavi Rejected Other Commercial Deal that Value Rs 1 Crore - Sakshi

నటి సాయిపల్లవి ఆలోచనలు, ఆచరణలు కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. డాక్టరు కావలసింది. అనుకోకుండా యాక్టర్‌ అయ్యిందీ చిన్నది. మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ సహజ నటి ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌ అంటూ నటిగా తన పరిధిని పెంచుకుంది. అయితే మాలీవుడ్‌ తరువాత టాలీవుడ్‌ ఆదరించినంతగా కోలీవుడ్‌ సాయిపల్లవిని అక్కున చేర్చుకోలేకపోయింది. కారణాలేమైనా సాయిపల్లవి నటించిన మూడు తమిళ సినిమాలు ఆశించిన విజయాలను అందకోలేదు. వాటిలో ధనుష్‌కు జంటగా నటించిన మారి–2 చిత్రం కాస్త బెటర్‌. ఇక్కడ పరిచయం అయిన దయా చిత్రం పూర్తిగా  నిరాశపరచగా, ఇక స్టార్‌ హీరో సూర్యతో నటించిన ఎన్‌జీకే చిత్రం సాయిపల్లవి కెరీర్‌కు ఏ మాత్రం ప్లస్‌ అవలేదు. అంతే కోలీవుడ్‌లో మరో అవకాశం లేదు. 

ఇక తెలుగులో హిట్స్‌ ఉన్నాయి, చాన్స్‌లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ అమ్మడికి చాలా పాఠాలు నేర్పినట్టున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి పేర్కొంటూ జీవితంలో అనుకున్నది జరగకపోతేనో, చేసిన పనికి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడో నిరాశకు గురవడం సహజం అని అంది. అయితే అలాంటి వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది. ఏదైనా జరగాలని రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరంది. అందుకే అలాంటి సమస్యలు ఎదురైతే  అందులోంచి కొత్త విషయాలను నేర్చుకోవాలని పేర్కొంది. అంతేగానీ ఆశించింది జరగలేదే అని నిరుత్సాహపడకూడదని అంది. ఏం జరిగినా మన మంచికే అని భావించడం తనకు చదువుకునే రోజుల నుంచే అలవాటైందని చెప్పింది. ఆ అలవాటు ఇప్పుడు ఈ రంగంలో హెల్ప్‌ అవుతోందని చెప్పింది. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే మనం పాఠం నేర్చుకోవడానికే అది జరిగిందని భావిస్తానని అంది. 

అన్నట్లు ఈ భామ ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశాన్ని తోసిపుచ్చిందట. ఆ ప్రకటనలో నటించినందుకుగానూ ఏడాదికి అక్షరాలా కోటి రూపాయలు పారితోషకాన్ని ముట్ట చెబుతామన్నా, నిరాకరించిందట. అంతేకాదు గతంలో కూడా రూ. 2 కోట్లు పారితోషకాన్ని ఇస్తామని ఓ ఫేస్‌ క్రీమ్‌ సంస్థ ఆఫర్‌ ఇచ్చినా సారీ అనేసిన విషయం తెలిసిందే. సహ నటీమణులు చాలా మంది  వాణిజ్య ప్రకటనలో నటించి సంపాదించుకుంటుంటే సాయిపల్లవి ఎందుకో ఆ రంగంలో విముఖత చూపిస్తోంది. ఇక డబ్బు కోసం ఏదిపడితే ఆది చేయనని గతంలోనే తేల్చిచెప్పేసింది. ‘ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తింటామా? సంతోషంగా, ఆత్మసంతృప్తితో జీవిస్తే చాలు. నా విలువలు చంపుకుని పని చేయడం నాకు నచ్చదు. అందుకే ఇటీవలే కొన్ని యాడ్స్‌ను రిజెక్ట్‌ చేశాను’అని సాయిపల్లవి పేర్కొంది.   
  
ప్రస్తుతం పల్లవి తెలుగులో మంచి అవకాశాలతో దూసుకపోతోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న `విరాటపర్వం' చిత్రంలో ఈమె హీరోయిన్‌గా నటిస్తుంది. దీనితో పాటు నాగ చైతన్య హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రంలో కూడా ఈ రౌడీ బేబీ నటిస్తోంది. మరి కమిట్మెంట్ కోసం కోట్లు వదలుకుంటున్న ఈ బ్యూటీ రానున్న కాలంలో కూడా ఇదే మాట పై ఉంటుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement