సుశాంత్‌ చావును అవమానిస్తున్నారు: హీరో | Saif Ali Khan Slams Bollywood Over Love For Sushant Singh Rajput After Demise | Sakshi
Sakshi News home page

ఇక్కడ ఎవరూ ఎవరినీ పట్టించుకోరు: సైఫ్‌ అలీఖాన్‌

Published Tue, Jun 16 2020 4:47 PM | Last Updated on Tue, Jun 16 2020 5:01 PM

Saif Ali Khan Slams Bollywood Over Love For Sushant Singh Rajput After Demise - Sakshi

బలవన్మరణానికి పాల్పడిన తర్వాత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌పై ఇప్పుడు కొంతమందికి.. కొత్తగా ప్రేమ పుట్టు​కొచ్చిందని బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సానుభూతి ముసుగులో నటన చేసే బదులు.. ఆరోజు నిశ్శబ్దం పాటించి ఉంటే బాగుండేదని విమర్శించాడు. ఈ విషాదకర ఘటనను చాలా మంది తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక సుశాంత్‌ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఈ క్రమంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు అవకాశాలు లేకపోవడం వల్లే సుశాంత్‌ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడంటూ బాలీవుడ్‌ పెద్దలపై గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.(సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్‌)

ఈ నేపథ్యంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడిన సైఫ్‌ అలీఖాన్‌.. ‘‘ఇది నిజంగా భయంకర ఘటన. అయితే కొంతమంది ఈ విషాదం గురించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. పాపం సుశాంత్‌. అతడి మరణం గురించి కొంతమంది వెంటనే స్పందించారు. అయితే నిజంగా వాళ్లకు అతడిపై ఉన్న ప్రేమతో జరిగిందా లేదా ఇందులో కూడా ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా అర్థంకావడం లేదు. ఇక సోషల్‌ మీడియాలో చాలా మంది రాద్ధాంతం చేస్తున్నారు. చెత్త నింపుతున్నారు. ఇది నిజంగా కాస్త ఇబ్బందిగా ఉంది. నిజానికి వాళ్లంతా నిశ్శబ్దం పాటించి ఉంటే బాగుండేది’’ అని అసహనం వ్యక్తం చేశాడు.

ఎవరినీ పట్టించుకోం..
అదే విధంగా.. ఇండస్ట్రీలో రోజుకో సవాలు కూడుకున్నదే అని.. సుశాంత్‌ విషయంలో ఇప్పుడు బాధ పడటం అతడిని అవమానించినట్లేనని పేర్కొన్నాడు. ‘‘నిజానికి మేం(సెలబ్రిటీలు) ఎవరినీ పట్టించుకోం. ఇక్కడ ఎవరి పని వారికి ఉంటుంది. ఇప్పుడేదో కొత్తగా ఇతరుల గురించి పట్టించుకున్నట్లు నటించడం దారుణం. సుశాంత్‌ ఆత్మను వారు అవమానించినట్లే’’అని చెప్పుకొచ్చాడు. అలాగే.. అవకాశాలు రాకపోవడం వల్లే సుశాంత్‌ చనిపోయాడడని అనడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. లాక్‌డౌన్‌ కాలంలో పరిస్థితులు తారుమారయ్యాయని.. సుశాంత్‌ మరణానికి వ్యక్తిగత కారణాలేమైనా ఉండవచ్చు కదా అని వ్యాఖ్యానించాడు. ('కావాల‌నే సుశాంత్‌ని 7 సినిమాల్లో త‌ప్పించారు')

వాస్తవాలు తెలిశాకే..
ఇక కొంతమంది ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. అయితే వాస్తవాలేమిటో తెలుసుకున్న తర్వాతే తాను ఈ విషయం గురించి స్పందించగలనన్నాడు. కాగా సైఫ్‌ కుమార్తె సారా అలీఖాన్‌ తన తొలి చిత్రం కేదార్‌నాథ్‌లో సుశాంత్‌తో జోడీ కట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సైఫ్‌ మాట్లాడుతూ.. సుశాంత్‌ సెట్లో ఎన్నో మంచి విషయాలు చెప్పేవాడని. తనకు ఎంతో నాలెడ్జ్‌ ఉందని సారా చెప్పిందన్నాడు. ఇక స్టార్‌ కిడ్‌ అయిన సైఫ్‌ అలీఖాన్..‌ కపూర్‌ ఖాన్‌దాన్‌ వారసురాలు కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మొదటి భార్య అమృతాసింగ్‌ కూడా గతంలో హీరోయిన్‌గా వెలుగొందారు. ఇప్పుడు సైఫ్‌ వారసురాలిగా సారా బీ-టౌన్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెపోటిజమ్‌ గురించి మాట్లాడిన కంగనను ఉద్దేశించే సైఫ్‌ ఇలా మాట్లాడి ఉంటారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.(నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement